ఇది కృష్ణుడు చెప్పిన మాట
ఇది శ్రీకృష్ణ పరమాత్మ వచనం.
ఈ సృష్టి రచనకు గాను సృష్టికర్త అయిన బ్రహ్మకు పరమాత్మ వేదాలను ప్రసాదించాడు. ఆ వేదవిజ్ఞానాన్ని అనుసరించి విధాత విశ్వనిర్మాణాన్ని కొనసాగించాడు. అంటే విశ్వనిర్మాణ సూత్రాలు వేదాలలో దాగి ఉన్నాయి. (ఈ దృష్టితో వేదాలను అధ్యయనం చేయవలసిన అవసరముంది) అవి శ్రుతులు.
ఆ వేదధర్మాలను మహర్షులు స్మరిస్తూ అందించినవే స్మృతులు. ఇవి ధర్మశాస్త్రాలు. శ్రుతుల అర్థాలను విస్తృతంగా వ్యవహారంలో వినియోగించేందుకు విధానాలను పురాణేతిహాసాలు ఆచరణాత్మకంగా అందించాయి. భారతీయవ్యవస్థ అంతా వీటిని ప్రాతిపదికగా తీసుకొని పటిష్టమయింది.
పురాణేతిహాసాలు కూడా ‘స్మృతులు’గానే పరిగణింపబడతాయి. ఇలా ‘శ్రుతిస్మృతులు’ మనకి ప్రమాణగ్రంథాలు. వీటిని శాస్త్రాలు అంటారు. కర్తవ్య విషయంలో సందేహం ఏర్పడినప్పుడు ఇవే ప్రమాణాలు. కొన్ని పరస్పర విరుద్ధంగా కనబడినా, సందర్భానుసారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా అవే శాస్త్రాలలో కొన్నిచోట్ల సంఘటనా రూపంగానో, ఉపదేశరూపంగానో చెప్పబడి ఉంటాయి.
స్థూలంగా, అర్థరహితంగా కనిపించే శాస్త్రాంశాలు, సూక్ష్మంగా ఎంతో అర్థవంతంగా సత్ ప్రభావాన్ని కలిగిస్తాయి. వ్యక్తి నేటి జన్మకి సుఖభోగాలే కాక, ఆ జీవునికి శాశ్వత సుస్థితి, సుగతి కలిగేలా శాస్త్రాలు నిర్మించబడ్డాయి. తపశ్శక్తితో అతీంద్రియ దృష్టిని పొందిన మహర్షులు విశ్వహితాన్ని ఆకాంక్షించి ఏర్పరచినవే శాస్త్రాలు. శాస్త్రముద్వారానే పరమార్థ జ్ఞానానికి అవసరమైన సాధనా సూత్రాలు, అవగాహనా మార్గాలు ప్రస్ఫుటమవుతాయి. అందుకే బ్రహ్మసూత్రాలు సైతం ‘శాస్త్రయోనిత్వాత్’ అని ప్రకటించాయి.
తాత్కాలికంగా వ్యక్తి స్వార్థానికి, పరిమిత దృష్టికి ఆటంకాలుగానూ, మామూలు విషయాలుగానూ కొన్ని శాస్త్రవిషయాలు గోచరించినా, పరిణామంలో శాశ్వతమైన క్షేమాన్ని, వ్యవస్థకు ధర్మబలాన్ని సమకూర్చడంలో అవి సఫలీకృతమవుతాయి.
వ్యక్తి నిర్ణయాలు అనేక మానసిక వికారాలతో కూడుకుని ఉంటాయి. నియమబద్ధమైన జీవనసరళి, లోతైన అధ్యయనం వంటివి లేక, మానసికోద్రేకాలను సవరించుకోలేని మానవులు తమకు తోచినట్లుగా ప్రవర్తిస్తూ పోతే శాశ్వత క్షేమానికే భంగం కలిగే ప్రమాదం ఉంది. అది సామాజిక భద్రతని దెబ్బతీసి, విచ్చలవిడితనానికి దారితీస్తాయి కూడా. అందుకే నిత్యభద్రతకోసం మనిషి స్వార్థాన్ని నియంత్రించే విషయమై, సూక్ష్మతమమైన రహస్యవిజ్ఞానంతో శాస్త్రాలు ఏర్పడ్డాయి.
ప్రత్యక్ష, అనుమానాది ప్రమాణాలకన్నా శాస్త్ర ప్రమాణానికే ప్రాధాన్యమిచ్చారు మనవారు. తమకంటూ ఏ స్వార్థమూ లేక కేవలం లోక హితైషులైన వారు ఋషులు. వ్యక్తి, చుట్టూ ఉన్న పరిసరాలు, అనంత విశ్వం ఈ మూడింటినీ సమన్వయించుతూ ఆ మహర్షులు కేవలం మనక్షేమం కోసమే చెప్పినవి శాస్త్రాలు. ఆ ఋషులకన్నా మనకు ఆప్తులెవరుంటారు? అందుకే వాటిని ‘ఆప్తవాక్యాలు’ అంటారు.
శాస్త్రాలను ప్రమాణంగా గ్రహించి జీవితాన్ని మలచుకోవాలని పరమాత్మ గీతాదులద్వారా నిర్దిశించారు.
యత్ శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః!
న చ సిద్ధిమవాప్నోతి నసుఖం నపరాంగతిం!!
శాస్త్ర విధులను వదలి, ఇచ్ఛవచ్చినట్లు ప్రవర్తించే వానికి ఇహ సుఖమూ, పరగతీ రెండూ ఉండవు. సిద్ధి లభించదు” అని గీతలోనే జగద్గురువైన పరమాత్మ బోధించారు.
శ్రుతిస్మృతీమమైవాజ్ఞా...” అనే వాక్యం ద్వారా “శ్రుతి స్మృతులు జగన్నిర్వాహకుడైన ఈశ్వరుని ఆజ్ఞలనీ, వాటిని ఉల్లంగించేవారు శాశ్వత ప్రక్రుతి నియమాలననుసరించి శిక్షను అనుభవించి తీరతార”ని పురాణాదులు చాటుతున్నాయి.
అహంకారంతో, వితండవాదంతో శాస్త్రాలను తారుమారు చేసి ‘అవిది పూర్వకం’గా ప్రవర్తించే వారికి గతులుండవని శ్రీకృష్ణ పరమాత్మ గీతాశాస్త్రంలో హెచ్చరించాడు. శాస్త్ర ప్రమాణ బుద్ధిని దైవీగుణంగా అభివర్ణించాడు కూడా.
-
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం నుండి.