( సో -హం అంటే ఏమిటి ? )
నాడీ చక్రము :
నాడీ చక్రము నెరింగినవారు ప్రాణస్వరూపమును, తద్ద్వారా హృదయాంతర్గతుడైన్ పరమాత్మ స్వరూపమును గ్రహింపగలరు. నాభికి క్రిందుగా నాడుల మాలకందము ఉండును. అక్కడినుండియే నాడుల ప్రారంభము. నాభి మధ్యమున 72౦౦౦ నాడులుండును. ఈ శరీరమంతయు, నిలువుగాను ,అడ్డముగాను, ఊర్ధ్వముగాను వ్యాపించిన నాడులలో నిండియుండును.వీనిమధ్య ప్రధాన నాడులు పడి యున్నవి. ఇడ, పింగల, సుషుమ్ను, గాంధారి, హస్తిజిహ్వ, ప్రధ, యశ, ఆలంబున, హుహు, మరియు శంఖిని అని వాని పేరులు. వాయువులు గూడ పది. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, నాగము, కూర్మము, క్రుకరము, దేవదత్తము మరియు ధనంజయము అని వాని నామములు. ఈ పదివాయువులలో ప్రాణము మొదటిదియు ప్రదానమైనదియు అయి యున్నది. ప్రాణవాయువు ప్రాణమును నిలబెట్టుచున్నది. హృదయ స్థానమున నుండి, ఉచ్ఛ్వాస నిశ్వాసములతో జీవనాధారమై యుండును. జీవిని ఇట్లు లోకములో ప్రయాణము చేయించుచున్నది కనుకనే ప్రాణమనబడును. తిన్న ఆహారమును జీర్ణము చేసి మలముత్ర శుక్ర రూపములో క్రిందికి త్రోయునది అపానవాయువు.త్రాగిన వానిని, తిన్నవానిని రక్తముగా, పిత్తముగా, శ్లేషముగా, వాయువుగా (వాతముగా) మార్చి, శరీరమునకు సమానముగా అందజేయునది సమానవాయువు. కంఠ ప్రదేశమున నుండి ముఖమునకు, పెదవులకు, కన్నులకు అదురునట్లు చేయుచు కామక్రోధములను ఉత్తేజ పరచునది ఉదానవాయువు. శరీరమును ఎటూ కావలసిన అటు వంగునట్లు (కదలునట్లు) చేయుచు, కంఠముదాక వ్యాపించియుండి, ఆహార విహారాదులలో ఏమాత్రము తేడా వచ్చినను వ్యాధులు గలిగించునది వ్యానవాయువు. వామనము కలిగించునది నాగావాయువు. కన్నులు తెరచునట్లు చేయునది కూర్మవాయువు.మ్రింగుటలో సహాయపడునది క్రుకరవాయువు. ఇంద్రియములను విజ్రుమ్భించునట్లు చేయునది దేవదత్తవాయువు. ప్రాణఘోషయందు నిలుచుచు, ప్రాణము పొయినను శరీరమును దహనమగు వరకును అంటిపెట్టుకొని యుండునది ధనంజయవాయువు. (చెవులలో వ్రేళ్ళు పెట్టుకున్నచో గుంయి మను శబ్దము వినబడును. అదే ప్రాణఘోషము). సుషుమ్ను నాది శరీరమధ్యమున (వెన్నెముకలో) ఉండును. ఇడానాడి యెడమ భాగములోను, పింగళనాడి కూడి భాగములోను ఉండును. గాలిని పీల్చి పొట్టనుబ్బించుటనే ప్రాణాయామ మందరు. ఇడానాడి ద్వారా గాలిని లోనికి పీల్చుట పూరక మనబడును. ఆ గాలిని శక్తిమేరకు లోపల బందించుట కుంభక మనబడును. పింగళనాడి ద్వారా గాలిని విడుచుట రేచక మనబడును. ఇది ఒక ప్రాణాయామ విధానము. ప్రాణాయామము చెయపొయినను మనము నిత్యము గాలిని పీల్చి వదలుచునే యుందుము. గాలిని పీల్చునప్పుడు ‘సో’ అను శబ్దము వచ్చును. విడుచుచున్నప్పుడు ‘హం’ అను శబ్దము వచ్చును. “సోహం” అనుదానికి “ఆ పరమాత్ముడను నేను” అని యర్ధము. అనగా మనము తెలిసియో తెలియకయో పరమాత్మను నిత్యము స్మరించుచున్నా మన్నమాట. “సోహం” అన్నదానిని తిరుగావేసిన “హంసః” అగును. హంస యనగా పరమాత్మ లేదా పరమాత్మ స్వరూపమైన ప్రాణము. దీనినే హంసగాయత్రి అందురు. గాయత్రి యనగా ప్రాణములను రక్షించునది అని యర్ధము. ఈ పరమార్ధము గ్రహించి (తెలిసికొని) ఎవ్వరీ హంస గాయత్రిని జపింతురో వారికి పునర్జన్మ ఉండదు. “హంస హంసేతి యోబ్రుయా ద్దంసో దేవ స్సదాశివః”.
ప్రణవము (ఓంకారము):
వేదములు ప్రణవముతో మొదలై ప్రణవముతో ముగియును. ప్రణవము సర్వ వాజ్మయ రూపము. కావున ప్రణవము నభ్యసించవలెను. అకారము ఉకారము మకారములోని అర్ధమాత్రయు గలసి “ఓమ్” అను ప్రణవ స్వరూప మేర్పడినది.అకార, ఉకార, మాకారములు మూడును, మూడు వేదములు, మూడు లోకములు (భూః – భువః – సువః) ‘బ్రహ్మవిష్ణు శంకరులు, సత్వరజస్తమో గుణములు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు, ప్రద్యుమ్న – శ్రీ (లక్ష్మి) - వాసుదేవ లనెడి అర్చామూర్తులు అని భావింపబడుచున్నవి. ఇట్టి ఓంకార స్వరూపమును దేలిసికొన్నవాడే ముని, తురీయ (4వ) మాత్ర గాంధారి యనబడును. శిరస్స్థానమున నుండును.అది ఘటము నందలి దీపమువలె దేహమధ్యమున హృదయపద్మములో పరబ్రహ్మ జ్యోతి రూపమున ప్రకాశించుచుండును. దానిని నిత్యము జపించుచు ధ్యానించవలెను. ప్రణవము ధనుస్సు. ఆత్మయే బాణము. లక్ష్యము పరబ్రహ్మము. ఉపాసకుడు జాగ్రత్త గలిగినవాడై లక్ష్యమును కొట్టవలెను. కొట్టినచో జీవాత్మ పరమాత్మ దగ్గరకు చేరుటే కాదు. పరమాత్మలో లయమగును. మొదటనే, నామరూప రహితమైన పరబ్రహ్మమును ధ్యానించుట సాధ్యము కాదు. అందుకే విగ్రహారాధన. ఆరూపము మనసులో హత్తుకొన్న తరువాత క్రమముగా జ్ఞాన సిద్దికలుగును. ఆ పైన నిర్గుణ బ్రహ్మో పాసనము సాధ్య మగును. ప్రణవ స్వరూపమైన ఈ ఒక్క అక్షరమే బ్రహ్మము. అదే సర్వశ్రేష్టము అదే అందరకును గమ్యస్థానము. “ఓమిత్యేకాక్షరం బ్రహ్మ”.
.
భావశూన్య సద్భావ సుస్థితి: |
భావనా బలాద్భక్తిరుత్తమా ||
శూన్య భావనా చింతన కన్నా, సద్భావన (పరమాత్మయే నేను అనే అభేద చింతన) శ్రేష్టము. ఇట్టి భావనతో కూడుకున్న అభేదభక్తి ఉత్తమము.
సోహం భావన
స: అంటే అతడు పరమాత్మ. అహం అంటే నేను. ఆ పరమాత్మతో నేను ఏకమై యున్నాను. ఈ ఐక్యాన్ని సద్విచారణ ద్వారా జ్ఞానంతో తెలుసుకోవాలి. ఇది జ్ఞానంతో పొందదగినదే కానీ, ధ్యానంతో కాదు. సమాజంలో చాలామంది మేము సోహం మెడిటేషన్ నేర్చుకున్నాం. రోజూ అరగంట ప్రాక్టీసు చేస్తున్నామని చెబుతుంటారు. సోహం అనేది జ్ఞానపర వాక్యంగా సాధకుడు గ్రహించాలి.
సోహం అని ధ్యానం చేయకూడదాయ? తప్పక చెయ్యవచ్చు. సోహం అంటూ ధ్యానం చేస్తే ఏం కలుగుతుందియ? నేను ఈ సృష్టికర్తయైన పరమాత్మ (హిరణ్యగర్భుని)తో ఏకమై యున్నానని భావిస్తూ సోహం.. సోహం.. సోహం.. అని జపంచేస్తూ ధ్యానం చేయడంవల్ల విశేష పుణ్యం కలిగి, సుఖభోగాలు లభించి హిరణ్యగర్భలోకం సిద్దిస్తుందని ఉపాసనాకాండ వివరిస్తూంది.
తం యథాయథా ఉపాస్తే తదేవ భవతి!
ఈ ఉపాసనలో నేను అనే జీవభావం పూర్తిగా తొలగదు. పరమాత్మ తత్త్వ జ్ఞానం కలగదు. కేవలం నేను పరమాత్ముడనై యున్నానని భావిస్తాడంతే! కావున వీడు జీవుడిగానే వుంటూ మరో లోకాన్ని పొంది, ఉపాసనా బలం వున్నంతకాలం అనుభవిస్తాడు. ఉపాసనా ఫలితం తీరిన తర్వాత మళ్లీ మామూలుగా ‘‘క్షీణ పుణ్య మర్త్యలోకం విశంతి’’ పుణ్యఫలం తీరిపోతే తిరిగి ఈ భూలోకంలో ఈ దేహాన్ని పొంది ‘‘పునరపి జననం పునరపి మరణం’’ జనన మరణాలలో చిక్కుకుని తిరుగుతుంటాడు.
అందుకే ఈ సోహం అనే పదాన్ని వివేకయుక్తుడై శాస్త్రప్రమాణంతో విచారణ చేస్తే, అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. విచారణలో ఉదయించిన జ్ఞానమే అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. అజ్ఞానం నశిస్తే సంసారక్షయం. సంసారక్షయమే మోక్షం.
మాభవగ్రాహ్య భావాత్మ గ్రాహకాత్మాచమాభవ భావనామఖిలం త్యక్త్వా యచ్ఛిష్టం తన్మయోభవ కర్మలు, ఉపాసనలు, వాటివల్ల కలిగే ఫలాలు, వాటిని పొందాలనే భావాలన్నింటిని అధిగమించి, ఏదైతే నిత్యశుద్ద చైతన్యమై అన్నింటికి విలక్షణమై వెలుగొందుతుందో అట్టి తత్త్వరూపమై నీవు వెలుగొందమని భావం. కనుక కర్మ, ఉపాసన కూడా మోక్షాన్ని, శాశ్వతానందాన్ని ఇవ్వలేవు.