Online Puja Services

మోహిని అవతారం విష్ణుమూర్తికి ఇష్టమా?

18.219.176.215
శక్తి రూపం తీసుకోవడం విష్ణుమూర్తికి ఎంత ఇష్టమో ఏమో కానీ మనకు మన పురాణాలలో విష్ణుమూర్తి యొక్క మోహినీ అవతారాలు పలు సందర్భాల్లో కనబడుతుంది. "నారాయణ-నారాయణి" రెండు రూపాలలో కనబడుతున్న ఒకే పరబ్రహ్మం అని ఇతఃపూర్వం ఎన్నో సార్లు చెప్పుకున్నాము. ఇప్పుడు వివిధ పురాణాలలో (పద్మపురాణం, భాగవతం, బ్రహ్మాండపురాణం, లింగ పురాణం, గణేశపురాణం, స్కాందం) ఆయన తన నారాయణి స్వరూపమైన మోహిని అవతారాలు ఎక్కడ తీసుకున్నారో చూద్దాము.
 
1.మొట్టమొదట మోహినీ అవతారం ప్రస్తావన క్షీరసాగర మధనం అనంతరం దైత్యగణ మోసాన్ని నివారించడానికి దేవతలకు న్యాయం చెయ్యడానికి స్వామి ఒకే సమయంలో ఆ మందర పర్వతాన్ని మోస్తున్న కూర్మంగా, ఆ మధనఫలితాన్ని అనుగ్రహిస్తున్న ధన్వంతరిగా, దేవతలకు అమృతం పంచుతున్న మోహినిగా నాటక రచన చేసారు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ మోహినిగా నిలబడి రాక్షసులను మరులు గొలుపుతూ దేవతలకు ఆ ఫలాలను అందించారు.
 
2.ఈశ్వరుడు ఆ సాగరమధన సమయంలో వచ్చిన విషాన్ని తన గరళంలో దాచుకుని లోకాలను రక్షించిన తరువాత దేవతలందరూ స్వామి యొక్క మోహినీ అందచందాలను పొగిడితే తన బావగారి వైకుంఠంకు వెళ్లి తనకు ఆ అవతార దర్శనాన్ని ఇమ్మని అడుగగా శివుని కోసం మరల మరొక్కసారి మొహిని అవతారం తీసుకుని పార్వతీదేవి మరొక రూపం ఆయనకు దర్శింపచేసారు.
 
3.ఒకానొక సమయంలో ఋషులు అహంకారంతో తాము ధర్మాన్ని అనుష్టిస్తున్న కారణంగా దేవతలకు హవిస్సులు అవసరం లేదు, తాము అరిషడ్వర్గాలను జయించాము కాబట్టి తామే స్వతంత్రులమని ప్రకటించుకుని అనుష్టానాలు మానేస్తే వారికి సత్యం బోధపరచడానికి శివుడు సుందరుని రూపంలో ఋషి పత్నుల ముందు, అదే సమయానికి విష్ణువు మోహినీ అవతారంలో ఋషుల ముందు నడయాడి వారిని మోహంలో ముంచి తద్వారా తమ తప్పులు తెలుసుకునేలా చేసి మరల ధర్మానుష్టానం చేసేవిధంగా బోధించి వచ్చారు. చిదంబరంలో నటరాజేశ్వరుని చరితం దీనికి అనుసంధానించి చెబుతారు.
 
4.ఒకసారి భాస్మాసురునికి ఎవరి తలపైన చేయి పెడితే వారు భస్మం అవుతారన్న విపరీతమైన వరాన్ని అనుగ్రహించిన శివుని వెంటాడుతాడు ఆ రాక్షసుడు. తానిచ్చిన వరం మర్యాద నిలపాలి కావున లీలావినోదంగా శివుడు అతడినుండి పారిపోతున్నట్టు నటించగా తనకు అభేదమైన విష్ణువు ఆ మూర్ఖ అసురుని మోహింప చెయ్యడానికి మోహిని అవతారం స్వీకరించి అతడి తలమీదే అతని చెయ్యి పెట్టుకుని భస్మమైపోయేట్టు చేస్తాడు.
 
5. అంతగా ప్రాచుర్యం పొందని మరొక కధ గణేశపురాణంలో ఉంది. సూర్యుని అనుగ్రహంతో విరోచనుడు అజేయమైన ఒక మాయా కిరీటం సంపాదిస్తాడు. దాని వలన అతడు లోక కంటకునిగా మారి స్వర్గాన్ని ఆక్రమించి అల్లకల్లోలం సృష్టించగా మోహినీ అవతారంలో అతడిని మొహంలో ముంచి ఆ కిరీటం వాడులుకునేలా ప్రేరేపించి సుదర్శనానికి బలి ఇస్తాడు ఆ స్తితికారకుడు.
 
6. ఇరావంతుడు (తమిళంలో అరవన్)అని అర్జునుని కుమారుని దగ్గర మూడు అజేయమైన బాణాల ద్వారా ఎవరినైనా ఓడించగలిగిన శక్తి సాధిస్తే అతడి బ్రహ్మచర్యాన్ని, విపరీతంగా పెరిగిన తేజస్సును ఒజస్సుగా నీరు కార్చడానికి శ్రీకృష్ణుడు తన ఒకానొక అంశగా మోహినిని సృష్టించి తద్వారా అతడిని అచిరకాలంలో నిరోధిస్తాడు అని స్థలపురాణం. 
 
ఇక హర మోహినీ కలయిక వలన హరిహరపుత్రుడు(ధర్మశాస్త) ఉద్భవించారని కొన్ని పురాణాలు ఘోషిస్తే, కొన్ని తమిళ పురాణాలలో అక్కడ అయ్యనార్ అవతరించారని, అగ్ని పురాణం ప్రకారం హనుమంతుడు ఉద్భవించారని, లింగపురాణం ప్రకారం ఉమయంగనగా విష్ణువు శివుని పుత్రుడైన స్కంధునికి పుట్టుక కలిగించినట్టు చెబుతాయి. కొన్ని కధలు కల్పభేదాలుగా కనిపిస్తాయి. కొన్ని మరొక దానితో విభేదించినట్టు కనబడతాయి కానీ ఇందులో ఉన్న ఒక ధర్మసూక్ష్మం నారాయణ నారాయణి అభేదం. శివ-శక్తి అభేదం, హరి హర అభేదం. వివిధ రూపాలలో కనబడినా ఉన్న ఒక్క పరబ్రహ్మం వివిధ ఆకారాలలో ఆ విధినిర్వహణ చేస్తున్నా ఒకొక్క కార్యాన్ని చక్కబెట్టడానికి కొన్ని శక్తుల కలయిక చెయ్యాలి కాబట్టి ఇటువంటి లీలలు చేస్తారు. నమ్మినవాడికి నమ్మినంత మహాదేవా....
 
- L. రాజేశ్వర్ 
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore