Online Puja Services

వేదాలను మనమే రక్షించుకోవాలి

18.118.30.137
వేద సంరక్షణావశ్యకత
 
క్రయిస్తవులలో కాతలిక్కులు, ప్రాటెస్టంటు లను రెండు తెగలవారున్నారు. ఇరువాగుల వారికి దేవుని పేరు ఒక్కటే. ఇరువురకు బైబిలనేదే ప్రమాణగ్రంథం. అట్లే ముస్లిములలోను రెండు తెగలున్నవి. రెంటికి అల్లాయేదైవం. రెంటికి కొరానే ప్రమాణ గ్రంథం. హిందువులలోనువైష్ణవులు, శైవులనే రెండు ప్రధాన శాఖలవారున్నారు. వీరిరువురకూ దైవనామం వేరు. విష్ణువనీ నారాయణుడనీ, ఒకరు; శివుడని రెండవవారు ఈశ్వరునకు పేర్లు పెట్టుకున్నారు. వైష్ణవులకు దివ్య ప్రబంధము, శైవులకు తిరుమంత్రము ప్రమాణగ్రంధాలు. మళ్ళా ఈ రెంటికీ మూలము వేద మేనని ఉభయులూ అంగీకరిస్తారు. వైష్ణవులు తమ దివ్యప్రబంధాన్ని తమిళ వేదమంటారు. శైవుల స్తోత్రములు, పదములు వేదప్రామాణ్యాన్ని ఒప్పుకుంటుంది. కాబట్టి శైవ వైష్ణవాలు రెండూ వేదవృక్షానపుట్టినశాఖలేనని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. హిందువులలో ఎన్ని మతభేదాలున్నా వాటికన్నిటికీ వేదమే ప్రమాణము. కనుకమనది వైదికమతం, వైదికధర్మమూఅనిచెప్పాలి. బ్రిటిషుప్రభువులువారిపుణ్యమా అని మనలందరనూ హిందువులని జనాభాలెక్కలో వ్రాయబట్టి సరిపోయిందిగాని, వైష్ణువులు, శైవులు అంటూ విడదీసి వ్రాసియున్నట్లయితే కొంపలుమునిగి, ఈపాటికి వైష్ణవస్ధానం శైవస్థానం అంటూ దేశం చిన్నా భిన్నమైపోయేది.
 
ఇంతకు మన మతానికి మూలమైన వేదాన్ని మనం రక్షించుకోవాలనేది ప్రస్తుతం. వేదాలు వ్రాతతో లేకపోవట మనేది చాలా గొప్ప విషయం. వేదాలను తమిళభాషలో ''మరై'' అంటారు. ఆ మాటకు గుప్తములు అని అర్థము. ఆ మాట బాగున్నది. ఎందువల్లనంటే భూగర్భములోదాగివున్న చెట్టువేళ్ళవలె వేదాలుకూడా మన కంటికగపడవు. గురుశిష్య పరంపరగా వాటిని నోటిపాటగా చెప్పుకొవలసిందే. వేదాల పవిత్రత ఈ విధంగా సురక్షితంకావడం లోకానికంతటికి శ్రేయస్కరమయిందని చెప్పాలి. వేదాలేకాదు, వాటి అర్ధ నిర్ణయానికితోడ్పడే శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం అనే వేదాంగాలుకూడా రక్షితములై వేదస్వరోచ్చారణను, కర్మ ప్రయోగ కలాపాన్ని భద్రంగా కాపాడినవి.
 
హిందువులు కొందరిపుడుఇతరమత ప్రవిష్టు లవుతున్నారు. ధర్మ మూలమయిన వేదములతో వారికి సంబంధం తెగిపోవటమే యిందుకు కారణం. ''వేదాలు చెప్పుతున్న ధర్మాలు కూడా ఇవే అయినప్పుడు మనమేమతంలో చేరితే నేమి? ఈ మతాలు కొత్తగా సత్యంగా కనిపిస్తున్నవికదా!'' అని అంటారు. వారు, ఈమాట బాగానేవుంది. కానీ, ఆ కొత్త మతముపట్ల దురభిమానము, మూఢభక్తి ఉండగూడదు. అన్ని మతములందు ఈశ్వరుడొక్కడే. ఈశ్వరునికి కళ్యాణ గుణములపట్ల ఈ మతాలలో భేదంలేదు. క్రైస్తవం, ఇస్లాం, హిందూమతము, అన్నీ ఒక్కపరమాత్మనే ఈశ్వరుడుగా పేర్కొంటున్నవి. విచారించి చూచిన మతములన్నీ ఈశ్వరునకు సమాన లక్షణాలు చెబుతున్నట్లు తేలుతున్నదికదా! ఒకరి మతాన్ని ఒకరు తూలనాడటం మెందుకు! మతాన్ని నిందిస్తే దాని ఈశ్వరుని నిందించినట్లే కదా! మరి మతాలన్నీ ఒక్క ఈశ్వరునే చెప్పుతున్నప్పుడు అట్టి నింద సర్వేశ్వరునికే చెందుతుందనాలి. అది మహాపచార మవుతుంది. బుద్ధు లయినవారు మతాలు మారనక్కరలేదు పరమత ఖండన మెప్పుడూ విద్వేషానికి కారణ మవుతుంది కూడాను.
 
మనకు సాధారణంగా మన మతానికి మూలమయిన వేదముతో పరిచయ ముండదు. అధ్యయనాదులచేతప్ప నిలువని ఆ వేదరక్షణమందు మనకు తాత్పర్యంలేదు. బ్రాహ్మణులకు వేదాధ్యయనం ధర్మంగాసంఘ శ్రేయస్సుకోసం విధింపబడింది. స్వధర్మానుష్ఠానం చేయనిజాతి లోకనిందకు గురి అవుతుంది. ఈ అధ్యయనభారం వైదికకులనే ఒకశాఖకు వదలిపెట్టి మన మందరం వైదికులమే అనేమాట మరచి కూర్చున్నాం. వేదాధ్యయనం మనకందరకు విహితమే. యజన యజనార్హత మాట యెలావున్నా దేవయజ్ఞ, పితృ తర్పణములనే నిత్యానుష్ఠానములయినా మనం నేర్చి వుండాలి.
 
ఈ విధంగా మన మందరం వేదసంరక్షణం చేస్తూవుంటే ఇతర మతప్రసక్తి మనకు వుండనే వుండదు. వేద సంరక్షణం సంస్కృతమందే జరగవలసి వుంటుంది. ఇతర భాషలలోకి వేదాలననువదిస్తే అవి చప్పబడి విస్సారములైపోతవి. వేదార్ధ నిర్ణయమున చిక్కులు వచ్చినపుడు సంస్కృత మూలమే శరణ్య మవుతుంది గాని అణువాదాలు కావు.
వైదిక ధర్మానికి ప్రచార సాథన సంపద లేకపోయినా నేటికీ కోట్లకొలది ప్రజలు దాన్ని అంటిపెట్టుకొని వున్నారు. వైదిక ధర్మానుష్ఠానం చేస్తున్న మహనీయుల నడవడియే ఇందకు కారణమనుకోవాలి, ఒకజాతివారని కాకుండ ఎందరో జ్ఞానులు తమదివ్యజీవనం వల్ల వైదిక మతానికి సకల ప్రజారంజనం సంపాదించి పెడుతున్నారు. అట్టి మహానుభావులు ప్రజల అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుతున్నంతకాలం వైదిక మతానికి సకల దేశములందు ప్రాబల్యం వుండనే ఉంటుంది.
 
ప్రజలు సద్ధర్మానుష్ఠానం చేస్తూవుంటేనే నూటికికోటికీ ఎవరో అట్టి సత్పురుషులు పుట్టి యావత్సంఘాన్ని వైదిక మతాన్ని ఉద్ధరిస్తూవుండటం తటస్ధించుతుంది. వారు కల్పించిన ఆధ్యాత్మిక వాతావరణంవల్లనే కబీరుదాసు, మస్తాన్సాహెబు వంటి యోగిపుంగవులు అవతరిస్తారు.
 
అయితే యీవైదికమతానికి అప్పుడప్పుడు బహిరంతరముల నుండి ఆపదలు తటస్థిస్తూండేమాట నిజం. అందుకు మనము భయపడ నక్కరలేదు. మనం స్వధర్మానుష్ఠానం ఏమరక చేస్తూవుండటమే వాటికివిరుగుడు. ఏ విపత్తయినా ఈశ్వరేచ్ఛవల్లనే కలుగుతుంది, వరదలు, తుఫానులు, మహామారిమున్నైన జాడ్యములు ఎంతమందినో తమ పొట్టన పెట్టుకుంటున్నవి. ఈ విపత్తులు తెచ్చి
 
పెట్టినవాడే వాటిని పరిహరిస్తాడు. ఔరంగజేబు కల్పించిన ప్రజాపీడనమునుండే శివాజీ, అహల్యాబాయి పుట్టుకవచ్చారు. భయకారణము, తన్నాశనము కూడా పరమేశ్వరాధీనములు. ఎవరిస్వధర్మాన్ని వారనుష్ఠించుతూవుంటే ఆ సత్కర్మ సమిష్ఠిఫలమే సంఘానికి శ్రేయంచే కూరుస్తుంది ధర్మానుష్ఠానమనేది విశ్వ శ్రేయం కొరకే అని మనంగ్రహించాలి. నియమపూర్వకంగా విహిత కర్మానుష్ఠానం చేస్తూవుంటే నైదికమతం సురక్షితంగా ఉంటుంది.
భౌతికశాస్త్ర విజ్ఞానం బహుముఖాల వికసిస్తున్న ఈ రోజుల్లో ప్రాతబడిన యీ ధర్మాలను అనుష్ఠిస్తూ మనం కూర్చోవడ మెందుకు? ఒక చెంప స్పుత్నిక్కులు అవతరిస్తూవుంటే, ఈ వైదికమతంవల్ల ఏమి ప్రయోజనం? అని కొందరడుగుతూ వుంటారు. నిజమేకాని, అంతఃశాంతి లోపించిన వానికి ఈ జగత్తంతా ఉండి ప్రయోజనమేమిటి? ఒకవంక విశ్వవిజయంచేసి, రెండోవంక ఆత్మను పోగొట్టుకున్న వానికి కలిగేసౌఖ్యమేమిటి? అని నేనడుగుతాను. అది అలావుండగా ఈ స్పుత్నిక్కును సృజించేవారే మహాభారతాన్ని తమ భాషలోకి అనువదించుకుంటున్నారనేమాట మనం మరువగూడదు.
 
ఇంతకూ చెప్పవచ్చిందేమంటే - శైవం, వైష్ణవం మొదలైన ఈ మతాలన్నిటికీ వేదమే మూలంగనుక, ఆయా మతస్థులకు విరోధభావము లుండనక్కరలేదనే. వైదిక ధర్మమనే మహానదీ ప్రవాహంలో ఈ భిన్నమతాలు స్నాన ఘట్టాలవంటివి. వేద ప్రతిపాదములైన ధర్మాలను పూర్వకాలంలో ఇల్లాండ్రు పనిపాటలు చేసుకొంటూ పాటలుగా, కథలుగా తెలియచెప్పికొనేవారు. ఆపాటలను, కథలను వింటూవుంటే పిల్లలకువాటి సారం ఒంట జీర్ణించేది. తల్లులు వైదికధర్మాన్ని ఈ విధంగా ఉగ్గుబాలతోనే బిడ్డలకు క్రోల్చే వారు. కాలంమారిపోయి. ఈ సదాచారాలన్నీ వెనుకబడటం వల్ల నేటిబిడ్డలకు ఆ వైదిక ధర్మమనే స్తన్యంలభించడంలేదు. కనుక, వైదికధర్మాలను వాటి ఆంతర్యాన్ని పునరుద్ధరించి, వాటికి పుష్టికూర్చేభారం మన మీద వున్నది.
 
''వేదము లెప్పుడు పుట్టినవి?''
 
బౌద్ధ క్రైస్తవ, ఇస్లాముమతముల ప్రమాణ గ్రంథాలు పుట్టిన కాలాన్ని ఆయా మతస్థులు నిర్ణయించారు. బౌద్ధులు త్రిపిటకాలు ఇంచుమించుగా అశోకుని కాలాన రచితమయిన వంటారు. కాని, కొన్ని పురాణాలను బట్టిచూస్తే, బుద్ధుడు పుట్టినకాలం ఇంకా కొన్ని శతాబ్దాల వెనుకకు జరపవలసి వస్తుంది. ''న్యూ టెస్టమెంటు'' అనే క్రయిస్తవగ్రంథం రెండు వేలేండ్లనాటిది. పైగంబరు వారికివినిపించిన ఈశ్వరవాక్కు అనిపించుకొనే ''కొరాను'' సుమారు 1200 ఏళ్ళనాటిది. ఇలా ఈ గ్రంథాలకయితే కాల నిర్ణయంజరిగింది కాని, వేదాలకాలాన్ని నిర్ణయించటం సాధ్యంకాలేదు. వేదములు రచితములని చెప్పగోరే పాశ్చాత్యపండితులు 3,500 ఏండ్లనాటి వంటారు. కొందరు 5,000 ఏండ్ల క్రింద వేదములు పుట్టినవంటారు. తిలక్ పండితులు వేదముల వయస్సు 8,000 ఏండ్లంటారు. జాకోబి పండితు డాయనతో ఏకీభవించాడు. ఇటీవలి పాశ్చాత్య పండితులు వేదముల కాలాన్ని యింకా యింకా తగ్గిస్తున్నారు. ఇక మన భారతీయపండితులు చూడబోతే వేదములు మరీ అర్వాచీనములని చెప్పాలని ఉబలాటపడుతున్నారు.
 
అవైదకమయిన బౌద్ధమువేదములన్నిటినీ ప్రమాణంగా అంగీకరించదు. బుద్దుడు పుట్టి 2,500 ఏండ్లయిందంటారు. మరి ఆ బుద్ధునికే తెలియదు వేదము లెప్పుడు పుట్టినవో, కనుక, బుద్ధునకు కూడా ఊహింపరాని కాలమందు వేదములు పుట్టినవని చెప్పాలి. ఇంతకు యదార్థమేమిటంటే - వేదము అనాది. అది నిత్యం. శబ్దమనేది నిత్యం. ప్రతిప్రళయాంతమునపుట్టుతూ వుంటుంది శబ్దం. సృష్టిప్రళయాలు పర్యాయంగా, వస్తూంటవి. క్రైస్తవుల ఓల్డు టెస్టుమెంటులో ఇప్పటి సృష్టిప్రస్తావం కనిపిస్తుంది. మన గ్రంథాలు ఇప్పటికెన్నో సృష్టులు, ప్రళయాలు జరిగినవనీ, వాటి కాల పరిగణనం ఆశక్యమని చెప్పుతున్నవి. ప్రతి సృష్టికి ఆరంభమందు నిత్యమైన ఈ శబ్దం అనగా - వేదం ఋషులకు వినిపిస్తుందనీ అది వారి ముఖతః వెలువడుతుందనీ మన మతం. భూజాతకాన్ని గుణించే నేటి శాస్త్రాలు కూడా సృష్టిప్రళయాల పరంపర నంగీకరిస్తున్నవి. బైబిలు చెప్పే లెక్కకు ఈశాస్త్రములకూ ఏతంపెట్టుగా వుంటుంది. నేటి శాస్త్రాలిలా భూతజాలాన్ని తరచిచూచినకొద్దీ మనవేదము లకు ప్రామాణ్యం అధికమవుతూ వుంటుంది. ఈనాటి విజ్ఞాన శాస్త్రానికి లభించని కారణాన వేదవాక్యాలను కాదనడంకంటే అవివేకం వుండదు. ఆ వాక్యాలు నేటి విజ్ఞానంతో లభించక పోతే రేపటి విజ్ఞానంతో లభిస్తవి. తప్పదు.
 
వేదములు చెప్పబడిన సూర్యాది గ్రహాల పరస్పర సంబంధాన్ని బట్టి వాటి నేటిస్థితులను కాలమానముచేగణించి వేదముల కాలాన్ని నిర్ణయిస్తామంటారు పాశ్చాత్యపండితులు. ఇప్పుడు మనకు కనిపించే ఈసృష్టియే ఎప్పుడూ వున్నదనకుకో వడంవల్ల వచ్చేచిక్కిది. ఇట్టి సృష్టులెన్నో గడచిపోయినవంటవి మన శాస్త్రాలు. నేడు కనుపించే గ్రహస్థితులవంటివి. వెనుకటి సృష్టులందునూ సంభవించివుంటవి. ఇట్టి సర్గములు, ప్రళయములు ఎన్ని జరిగినవో మనం చెప్పలేము.
 
వేదకాలనిర్ణయానికి కొందరికొక సూత్రాన్ని అవలంబింస్తారు. ఋక్సంహితలు, ఉపనిషత్తులు, సూత్రాలు, కావ్యాలు అనేవాటిలో క్రమంగా కానవచ్చే భాషా రూపపరిణామం వీరికి కొలబద్ద. అది ఎలాగంటే - వ్యవహారమందున్న భాషలు సుమారు ప్రతిరెండువందలేండ్లకు కొన్ని మార్పులుచెందుతూ వుంటవి. చూడండి - సంగంకాలపు తమిళానికి, నేటి తమిళానికి ఎంత భేదం కనిపిస్తున్నదో? అలాగే పురాతనాంగ్ల భాషకు నేటి ఆంగ్లానికి
 
పోలికలే పట్టలేము. లండనునాగరులఆంగ్లానికి అమెరికన్ల ఆంగ్లానికీగూడా ఎంతోభేదం వున్నది. వార్తాపత్రికలలో ఆంగ్లభాషకూడా 50 ఏండ్లలో ఎంతగానో మారిపోయిందా, లేదా? కాలమాన భాషా వ్యవహారంలో రచనలో ఈ మార్పు తప్పదు. పాతభాషారూపాలు అరిగిపోయి, కొత్త రూపాలు పుట్టడానికి రెండు వందల ఏండ్లు పట్టుతవనే లెక్క ఆధారంగా వేదభాష, కావ్యభాషగా మారటానికి పట్టే కాలాన్ని లెక్కగట్టి వేదములు 3,500 ఏండ్ల క్రిందట రచితమై వుంటవని వీరు తేల్చారు.
 
ఇది ఎలావున్నదంటే -
 
దేవాలయాలలో, మఠాలలో నిత్యం వందలాది ప్రజలకు వంటచేసే పాత్రలుంటవి. రోజూపొయ్యిమీదపెట్టడం, తోమడంవల్ల ఇవి త్వరగా అరిగిపోతవి. వీటికి మాట్లు వేయటమో, వీటినివదలి కొత్తవి ఉపయోగించటమో తప్పదు. అలాగే నీటిపంపులు లేని పూర్వకాలంలో ప్రజోపయోగంకొరకుఊరబావు లుండేవి. ఆ బావులచుట్టు గోడలపై చిరకాలంగా పాత్రలు పెట్టిదించుతూ వుండటంవల్ల గుంటలు పడుతవి. మరిశ్రీమంతుల ఇండ్లలో ఎప్పుడో శుభశోభనాదులందు సంతర్పరణలోవాడుకునే పెద్దపెద్ద గుండిగలుంటవి. ఆ కాస్త అక్కర తీరగానే వాటిని శుభ్రంచేసి అటకలపై దాస్తూవుంటారు. వాడకం తక్కువవల్ల ఆ పాత్రలకు మాట్లు అక్కరలేదు. వాటిని మార్చనూ అక్కరలేదు. అలాగేనీటిపంపులు, కుళాయీలు వచ్చిన రోజులలో కట్టిన నూతి గోడలకు చుట్టు పళ్ళెములకు వాడుక తక్కువై వాటిమీదగుంటలుపడక చెక్కు చెదరకుండా కనుపిస్తవి. దీనినిబట్టి తరుచువాడుకునే వస్తువులు అరిగిపోతవనీ, సకృత్తుగా ఉపయోగించుకొనేవి అరిగిపోవనీ తేలుతున్నది. భాషారూపములుకూడాఅట్టివే. తమిళం, ఆంగ్లం, హిందీ మొదలయిన దేశభాషలు నిత్యవ్యవహారంలో అందరినోళ్ళలోపడి అరిగి రూపుమాసి కొత్తరూపమూలకు చోటిచ్చిపోతూవుంటవి.
 
ఇక వేదాలలో భాషను చూస్తే, పురాతనకాలంలో ఎలావున్నదో నేడూ అలాగే ఏ వికారములు చెందక ఒక్క రీతిగా ఉన్నది. వేదమంత్రోచ్చారణలోఏమాత్రమూ పొల్లు పోకుండా కాపాడుకుంటూ వచ్చినందువల్ల దాని రూపం అచ్చంగాపూర్వంవలెనే ఉండిపోయింది. ఇప్పుడు మనం అధ్యయనం చేసేవేకాక, వేదాలు అనంతంగా ఉన్నవి. ఋక్ఛాఖలు 21 వుంటే, వానిలో ఒక్కటిమాత్రమే అధ్యయనం చేస్తున్నాము. యజుర్వేదానికి 101 శాఖలు. వానిలో మనం మెరిగియున్నవి. మూడే, సామవేద శాఖలు వేయింటిలోరెండో మూడో మనం వాడుకుంటున్నాము. అధర్వశాఖలు పదకొండింటిలో మనకు వచ్చిన దొక్కటే. వీటిలో ఏఒక్క శాఖను అధ్యయనం చేయాలన్నా, ఎనిమిదేళ్ళుఅహోరాత్రాలు కష్టిస్తే తప్ప కృతకృత్యత సిద్ధించదు. ఒక్కొక్క మంత్రం వుండె మాటల సంఖ్యా, అక్షరాలసంఖ్యా, వాటి వరసా మారిపోకుండాకొన్ని నియమాలు ఏర్పడివున్నవి. ఒక్కొక్కఅక్షరాన్ని ఉచ్చరించడానికి ఎన్ని మాత్రల కాలంపట్టుతుందో, శరీరంలో ఏస్థానంనుండి ఏ అక్షరం ఉచ్చరించాలో, వేదస్వరాలకుసంగీత స్వరాలకు ఉండేసంబంధ మెట్టిదో, నెమిలీ, ఎద్దు, గుఱ్ఱమూ, ఏనుగూ, మేకా, క్రౌంచమూ మున్నగు పశుపక్ష్యాదుల సహజస్వరాలకు వేదగాంధర్వముల స్వరాలకూ వుండేసంబంధ మెట్టిదో వీటినన్నింటినీ తెలిసికొని వేదమంత్రాలను కాపాడుకొనేటందుకు వాక్య పదక్రమ ఘన జట స్వరాది సాధనాలు ఏర్పాటయి వున్నవి. కాబట్టి నిత్య వ్యవహారంలో భాషలవలె వైదికభాషా, స్వరము మార్పుచెందుటకు వీలులేదు. ఈ స్వర భేదవర్ణ క్రమాదులుతరతరాలుగా గురుశిష్య పరంపరయా శ్రవణ మాత్రంచేత సురక్షితములుగా వుంటున్నవి. వేదాధ్యయనపరులకు ఎన్నో నియమాలను, ఆచారాలను విధించారు. ఈ సంప్రదాయమంతా తెలుసుకోకుండా వేదములను గూర్చి తత్కాలమును గూర్చి లౌకికమైన తార్కాణాలతో ఏవో సిద్ధాంతాలు చేయడం బూనితే అవి వేదములకు అన్వయించవు. వేదములు అనాది అయిన కారణముచేత. అనేకసర్గములు, ప్రళయములు దాటి అచ్చమయిన నిజ రూపంతో నేటికిశ్రవణగోచర మవుతున్నవి. మరియే యితర మత ప్రమాణ గ్రంథాలకు ఇట్టి భాగ్యం లేదు.
 
కడిచిన మూడేండ్లనుండి వేదవిజ్ఞానానికి మనం పాశ్చాత్య పండితుల ఆచార్యత్వం అంగీకరిస్తున్నాము. వేద విషయాన వారు చాలా పరిశ్రమచేసి మేలుచేశారు. నిజమే కాని, వేదములవల్ల మనకు ముఖ్యంగా కావలసింది. తదధ్యయనం. వేదములను చక్కగా అచ్చొత్తించి, భాండాగారాలలో భద్రపరచటంవల్లా. ఆ గ్రంథాలను చేతిలో పట్టుకొని తిరగటం వల్లా మనకు వేదాధ్యయన ప్రయోజనం నెరవేరదు. వేదాలను మనం చదువుకోవడానికి కుతూహలంకొద్దీ అందలి విషయాలను తెలుసుకొని సంతోషించడానికి అవి పనికివచ్చే మాట నిజం. అంతమాత్రాన అధీతి బోధాచరణ ప్రచారములు సిద్ధించవు. శ్రవణ సాహాయ్యముచేత, గురువుచెంత చక్కగా అధ్యయనం చేసి, నిత్యకర్మానుష్టానికి, తపచ్చర్యకు, ఈశ్వరారాధనకు వాటి నుపయోగించికొని చిత్తశుద్ధిని, ఆత్మజ్ఞానాన్ని, ఈశ్వరానుగ్రహాన్ని పొందవలెనంటే వేదగ్రంథాలవల్ల ఆ ప్రయోజనాలు నెరవేరవు దీనికో తార్కాణం చెపుతాను. చూడండి! దేవాలయాలలో ఎన్నొ శిల్పాలు, శిలాశాసనాలు ఉంటవి. తొల్లింటి పుణ్యాత్ములుచేసిన ధర్మకార్యాలను ఈ శాసనాలు పేర్కొంటవి. శిల్పములు ఈశ్వరభక్తికి సాధనములవుతవి. మరి శాసనాలు చదివేవారు, పురావస్తుతత్వపరిశోధకులు, చక్కావచ్చి ఆ శిల్పాలకు, శాసనాలకు ఫోటోలుఎత్తి, వాటిని పరిశోధించి, వాటి కాలనిర్ణయంచేస్తారు. అది మంచిపనే, కాదనం. అంతమాత్రంచేత భక్తులకూ, ధర్మాత్ములకూ కలగవలసిన ఆధ్యాత్మిక ప్రయోజనం కలుగదు. అలాగే వేదాలను అచ్చువేసి, గ్రంథస్థం చేసినంతమాత్రాన కర్మా
 
నుష్ఠానానికి, మంత్రోపాసనకు, చిత్తశుద్ధికి, ఈశ్వరప్రసాదానికి ఆ గ్రంధా లక్కరకురావు.
 
ఇంతకు వేదాలను వ్రాసుకుని చదవాలంటే కుదరదు. గురువు చెపుతూంటే ఒక్కొక్క అక్షరమే విని, అధ్యయనం చేయవలసిందే. అందుకే వేదాలను అలేఖ్యములంటారు. ఇలా వేదాలను వ్రాసుకుని, చదివేవానిని గూర్చి చెప్పే శ్లోక మొకటి వుంది.
 
గీతీ శీ ఘ్రీ శిరః కంపీ తథా లిఖితపాఠకః,
అనర్ధజ్ఞః అల్పకంఠశ్చ షడైతే పాఠకాథమాః ||
 
వేదాలను పాటగా పాడేవారు, గడగడా చదువుకు పోయేవారు. బుర్రతిప్పేవారు, వ్రాసుకుని చదివేవారు, అర్థ గ్రహణం జేయనివారు. అల్పకంఠులూ, ఈ యారుగురూపాఠ కాథములన్నారు. కనుక వేదాలను విని వల్లన వేయవలసిందే. అందుకే వాటిని శ్రుతులన్నారు.
వేదాధ్యయనానికి ఇప్పుడు చెడుదినాలొచ్చినవి. వాటిని అధ్యయనంచేసే శ్రద్ధాభక్తులునశిస్తున్నవి. ఈతరంకూడాదాటి పోతే అధ్యయనం చేయదలచినవారికి చెప్పేవారు దొరకరు. వీటివల్ల లౌకిక ప్రయోజనం శూన్యమగుటవల్ల. ఈ దురవస్థ దాపురించింది. మన స్మృతినుండి, శ్రుతినుండి వేదములుజారి పోతవేమో అనిపిస్తున్నది. ఈ విపత్తుతప్పించేందుకు కొందరు ధర్మాత్ములు భూదాన, ద్రవ్యదానములుచేసి ధర్మనిధిని నెలకొల్పడం జరిగింది. ఆరేళ్ళనాడు అప్పటికివున్న పూర్ణాధ్యయన పరులను లెక్కచూచి వారికి సంభావన ఏర్పాటుచేశారు. ఒక్కొక్క వేదశాఖను, ఏబది భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని అధ్యయనం చేసే వటువులకు, వేద భాషాధ్యయనం చేసేవారికి భృతులు ఇస్తున్నారు. ఆరునెలల కొకతూరి పరీక్షించి నెగ్గినవారిని సంభావిస్తున్నారు. ఈ విథంగా వేదాధ్యయనము, భాష్యాధ్యయనము రక్షితమవుతున్నది.
 
వైదిక కర్మలందు చెప్పే మంత్రాలకర్థం తెలియక పోయెనేయని విచారించేవారు అచ్చటచ్చట కనిపిస్తున్నారు. ఇది మంచిమాటే. అర్థరహితంగా కర్మాచరణం చేస్తున్నందు వల్లనే, వివాహాది కర్మలందు మన పడుచువాండ్రకు శ్రద్ధా భక్తులు సన్నగిల్లిపోతున్నవి. కనుక మంత్రార్థము తెలిసి కోవాలని కూతూహలం కలవారు వేదసంవర్థక మఠాన్ని కోరితే వారు ఆ సమీపమందున్న వేదార్ధ విదుణ్ణిపంపిస్తారు. ఆవేత్త వల్ల ముందుగా మంత్రార్థము తెలిసికొని వధూవరులు వివాహ కర్మ మాచరించుకొంటే, దాని పరమార్థ గ్రహణం శ్రద్ధా భక్తులకు కారణమై మేలు చేకూరుస్తుంది. ఉప నయనాది సంస్కారములందు గూడా అలా చేయడం మేలు.
 
అర్థవిహీనమైన వేదాధ్యయనం జీవరహితమైన శుష్క శరీరాన్ని పదిలపరచుకోవడం వంటిది. సార్థకంగా చేసేవేదా ధ్యయనం పాపాలను పరిహరించి అరిష్టములను శాంతింపచేసి బ్రహ్మసాక్షాత్కారానికి మార్గం సుగమం చేస్తుంది. వేదమే మన మతమునకు మూలము. తక్కిన విందులు, వేడుకలు పత్ర పుష్పాల వంటివి మాత్రమే. వేదమూలము భూగర్భమందు మట్టిలో వున్నా పైనున్న ఫలపుష్పాలవలె ఆ వ్రేళ్లు సుగంధ మాధుర్యాలను నిత్యనూతనంగా వెదజల్లుతూనే ఉంటవి. పాశ్చాత్యపండితులు వేదాల నచ్చు వేసి గ్రంథస్థం మన కిచ్చారుగదా అని సంతోషించినందువల్ల ప్రయోజనం లేదు. మనకు కావలసింది వేదాధ్యయనము, కర్మానుష్ఠానమున్నూ. అందుకొరకు వేదాలను సంత చెప్పుకొని అధ్యయనం చేసి, తద్గ్రహణపూర్వకంగా, స్వరయుక్తంగా ఉచ్చరించక తప్పదు.
 
--- “జగద్గురు బోధలు” నుండి
 
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
 
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
 
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore