వృషభారూఢ శాస్త
హరి హర పుత్రుడు ధర్మశాస్తా కథలు.
సీరియల్.నం.9
ఈ దినం మనము వృషభారూఢ శాస్త గురించి. తెలుసు కుందాం.
శ్రీ ధర్మశాస్తా, పార్వతి పరమేశ్వరులు గా భక్తులకు దర్శనం:--
ఒక సందర్భమున, పార్వతి పరమేశ్వరులు ఏకాంతము కోరి, కైలాశమును వదిలి, చేరువలో నున్న ఉద్యానవనము నకు వెళ్ళినారు. అచట శివగణములతో ఆటలాడు చున్న శాస్తా క్రీకంట అ విషయమును గమనిoచినాడు. కైలాసమునకు ఆది దంపతుల దర్శనార్థం సిద్ద గణములు వచ్చిన, వారికి ఆది దంపతుల దర్శనము లభింపదన్న ఆలోచన శాస్తాకు కలిగినది. అంత శివగణములలో శ్రేష్టుడైన “ మహాబలుని” శాస్తా, పిలిచి, అతనిని వృషభ రూపము ( నంది ) ధరించుమని కోరేను. వృషభ ధరించిన మహాబలునిపై శాస్తా, పార్వతి పరమేశ్వరుల రూపము దాల్చి, సిద్ద గణముల నిరాశను నివారింప, నందిపై ఆసీనుడాయేను. శాస్తా అచ్చు గరళకంఠ రూపమున, మాత జ్ణాణమహేశ్వరి పార్వతిగాను, ద్వందరూపముల ఎల్లరకు గోచరింప సాగేను. వృషభమును అధిరోహించిన “ వృషభారూఢ శాస్తా” గా మారిపోయేను.
.మిక్కిలి తేజో మయమున, లోకమాతా పితల రూపమున, శాస్తా రూపమును గాంచిన శివగణములు, సిద్దగణములు తన్మయత్వమున, భక్తితో శివ పార్వతులను స్థితింప సాగిరి. వచ్చిన వారాలoదరి ప్రార్థనలను ఆలకించి, వారి వారి కోర్కెలను తీర్చి వారిని సాగనంపేను. అమితా నందమున తిరుగు పయనములో వారికి నిజస్వరూపులైన శివ పార్వతుల దర్శనము కలిగినది. వారు అమిత అశ్చర్యమున వారలను గాంచి, భక్తి తో నమస్కరించి, మేము ఇప్పుడే కదా, మీ నివాస స్థలమున మీ ఆశీర్వాదమును గైకొని తిరిగి వెలుచుండగా, అపుడే తిరిగి మాపై కరుణతో దర్శనము ఇస్తున్నారు. మేము ధన్యులమైనాము అని అన్నారు. అపుడు ఆశ్చర్య పోవడం ఆదిదంపతుల వంతాయెను. అయోమయమున, “ అది ఏమిటి, ఇపుడే కదా మేము ఉద్యానవనము నుoడి తిరిగి వస్తున్నాము. మమ్ము మీరు ఏటుల మాలోకమున దర్శించ వీలగును” - అని తమ దివ్య దృష్టి తో జరిగిన దంతయు గ్రహించినారు.
వారికి మిక్కిలి ఆనందము కలిగినది. సిద్దగణముల నిరాశను నివారింప, శ్రీశాస్తా ఆడిన నాటకమును వారికి తెలిపి, వారినందరిని ఆదరమున ఆదరించి, అనుగ్రహించి సాగనంపిరి.
కైలాశమును చేరి అ ఆదిదంపతులు శ్రీశాస్తాను పిలిపించినారు. విషయము వారికి తెలిసిపోయినదని గ్రహించిన శ్రీశాస్తా, అచ్చటకు అరుదెంచి, కాస్త బిడియముతోను, భయముతోనూ, భక్తి పూర్వకముగా వారికి ప్రదిక్షణలు గావించి, జరిగినదంతయును వారికి విన్నవించుకొనెను. అంతయును విన్న అ పుణ్య దంపతుల, శాస్తా సమయస్పూర్తికి, భక్తుల యెడ గల ఆదరాభి మానములకు సంతసించి, పుత్రుని ఆశీర్వదించి, నాయనా! సిద్ద గణములకు నీవు ఎవ్విధముగా దర్శనమును అనుగ్రహించినావో, అదివ్య మంగళ స్వరూపము చూడ, మా మనస్సు ఉవ్విళ్లూరుచున్నది. మాకునూ నీ వృషభారూఢ రూప దర్శనము కలుగు చేయుమనిరి.
మహాబలుడును, శాస్తాను వారి ఆజ్ణమేరకు, తిరిగి మహాబలుడు వృషభము గాను, శాస్తా ఆది దంపతుల ద్వందరూపమున వృషభారూడాయెను. లోకాలకంతటికి నాటకము చూపు నాటక సూత్రధారి శంకరుడికి, లోక పావని పార్వతికిని, తమ నకలు రూపము చూడ అమితానందము కలిగెను. అంత పార్వతి మాత, “చాలు నాయనా! మా కనులకు విoదాయెను. నీ యదా రూపమునకు రమ్మనెను. శాస్తా తన బాల రూపుమునకు మారి పోయెను. కానీ మహాబలుడు మాత్రము వృషభముగానే వుండి పోయెను. ఆదృశ్యమును గాంచిన మాత, “అదేమి నాయనా! మహాబలుడిoకను వృషభముగానే నున్నాడు? అని అడుగగా, శాస్తా, “తల్లి! తమరు, నన్ను నా నిజరూపమునకు రమ్మన్నారే కానీ మా యిరువురిని అని అనలేదు కదా”! అని అన్నాడు.
అపుడు పరమశివుడు కలుగ చేసుకొని, “పుత్రా! ఈ వృషభ వాహనము నీకు చాలా బాగున్నది. అందువలన మహాబలుడు, వృషభముగానే వుండనిమ్ము. నేనా వరమును అతనికి ఒసంగుతున్నాను. నీవు ఇకపై వృషభారూఢశాస్తా నామధేయమున, నీ భక్తుల పాలిట కల్ప తరువై ఆచంద్రార్కము వెలుగొందుదువు గాక” అని ఆశీర్వదించేను.
మహాబలుడును అమిత సంతోషమున తన భక్తి తత్పరతను చాటుకొను మహాద్బాగ్యము లభించినందులకు మిక్కిలి సంతసించేను. అప్పటి నుండి స్వామి వృషభ వాహన మూర్తిగా సార్థక నామధేయమును పొందెను.
“వృషభారూఢ శాస్తావే శరణం శరణం శరణo”
శ్రీధర్మశాస్తా వే శరణం
శరణం శరణం ప్రబద్దే!
ఇట్లు
మీ స్నేహితుడు
L. Rajeshwar