కంచి స్వామి పంపినవారు రండి
ఇది జూన్ 1984లో జరిగిన సంఘటన. కంచి పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని మెహబూబ్ నగర్(ఇప్పటి తెలంగాణ)లో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగే శంకర జయంతి ఉత్సవాలలో పాల్గొనవలసిందని నన్ను ఆజ్ఞాపించారు. నేను వెళ్ళి మహాస్వామి వారిని దర్శించుకున్నాను. వారు నన్ను శృంగేరి వెళ్ళి జగద్గురువులను కలవమని చెప్పారు.
నాతోపాటు మరొక ఐదుగురము కలిసి శృంగేరి వెళ్ళాము. మేము శృంగేరి చేరిన వెంటనే శారదా పీఠం సెక్రటరీని కలిసాము. ఆయన ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా ఆచార్యులను కలవడం కుదరదని చెప్పారు.
నేను మహాస్వామి వారిని మనస్సులోనే ప్రార్థించి అక్కడ కూర్చొని శారదా మాతకు సహస్రనామం చెయ్యడం ప్రారంభించాము. దాదాపు ఒక గంట తరువాత శృంగేరి పీఠ జగద్గురువులు శ్రీ శంకరాచార్య అభినవ విద్యాతీర్థ మహాసన్నిధానం, శ్రీ శంకరాచార్య భారతీ తీర్థ సన్నిధానం ఇరువురూ దీపారాధనకు వచ్చారు. వారు శారదాంబకు చేయవలసిన పూజ అంతా ముగిసిన తరువాత మహాసన్నిధానం వారు మావైపు చూస్తూ, “కంచి మహా పెరియవ వద్ద నుండి వచ్చిన వారు మమ్ము కలవచ్చు” అని చెప్పి ముందుకు నడిచారు.
మాకు చాలా ఆశ్చర్యం వేసి, వారి వెంట వెళ్ళాము. దాదాపు గంట సేపు వారితో సంభాషించాము. మేము తిరిగి వచ్చిన తరువాత సెక్రటరీ గారు మావద్దకు వచ్చి మమ్మల్ని క్షమాపణ కోరుతూ “మిమ్మల్ని పరమాచార్య స్వామి వారు పంపారని, మీకు అన్నిటికంటే పెద్ద అపాయింట్మెంట్ ఉందని నాకు తెలియదు” అని చెప్పాడు. అప్పుడు నేను అతనితో “సన్యాసులను సిద్ధపురుషులను కలిసేప్పుడు ఏ పరిచయం చేసుకోవలసిన అవసరం లేదని” చెప్పాను.
అచ్చంగా ఇలాంటి సంఘటనే తపోవనం సాధు త్రివేణిగిరి స్వామిగళ్ మరియు తిరువణ్ణామలై విసిరి స్వామిగళ్ వారి దగ్గర కూడా జరిగింది.
ఇక్కడ అర్థం చెసుకోవలసినది ఏమంటే, మనకు తెలిసినదానికంటే మహాత్ములకు తెలిసినది ఎక్కువ. వారిది వ్రాత సంభాషణ, మౌఖిక సంభాషణ కాదు. వారిది ఆత్మ సంభాషణ. మనం కేవలం దూతలం అంతే. ఉన్నది ఒక్క పరబ్రహ్మం అయినప్పుడు, వారు ఆ పరబ్రహ్మమునందు రమించునప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడవలసిన పనిలేదు. వారు అత్మస్థితి చేత ఒక్కటిగా ఉండి, ఎప్పుడూ మనతోనే ఉంటారు.
--- కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్