ఆశ - నిరాశ
ఆశ మనిషిని గెలిపిస్తుంది. నిరాశ మనిషిని ఓటమిపాలు చేసి కుంగదీస్తుంది. తన శారీరక, మానసిక బలంపై నమ్మకమే ఆత్మవిశ్వాసం. గెలవగలననే ధీమా మనిషికి ఆశను కలిగిస్తుంది. నిరాశావాదంలో పలాయనమార్గం గోచరిస్తుంది. ఆశ బతికిస్తే, నిరాశ మనిషిని చంపుతుంది.
రేపు లేదనుకుంటే జీవితం శూన్యం. భవిష్యత్తుపై ఆశే దారి చూపుతుంది. ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఈ లోకంలో ఎవరినీ ఎవరూ ఉద్ధరించలేరు. ఎవరికి వారే శ్రద్ధతో జ్ఞానాన్ని పొంది ఉన్నత విజయాన్ని అందుకోవాలి. అదే గీతాసారం.
ఓటమి చెందినప్పుడు మనిషిని నిస్పృహ, నిరాశ ఆవరిస్తాయి. ఎందులోనైనా ఓడిపోతాననే భయం పట్టుకుంటుంది. భవిష్యత్తు శూన్యమని భావిస్తాడు. తనకుతాను కుంగిపోయి చావుకు దగ్గరవుతాడు. ఆధ్యాత్మిక జ్ఞానం మనిషిని నిరాశావాదం నుంచి అమృతమయ విజయ సోపానానికి చేరుస్తుంది.
మానవుడికి కోరికలు సహజమైనవి. కోరిక తీరకపోతే నిరాశ కలుగుతుంది. తన సహజ ప్రతిభకు, పరిస్థితులకు తగ్గ కోరికలు కోరుకోవాలి. ఆకాశానికి నిచ్చెనలేసే కోరికలు అంతిమంగా పాతాళానికి దిగజారుస్తాయి. ఓటమిని రుచిచూపిస్తాయి.
శతయోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు హనుమంతుడు. లంఖిణిని సంహరించి అర్ధరాత్రి వరకు అనేక ప్రదేశాల్లో సీతామాతను వెతికాడు. అంతఃపురాన్ని గాలించినా, ఎన్ని గృహాలు వెతికినా జాడ తెలియలేదు. నిరాశతో కూర్చు న్నాడు. తాను సీత జాడ తెలియకుండా తిరిగివెళ్తే రాముడి వంశమంతా మృత్యువు పాలవు తుంది. సుగ్రీవుడి పరివారమంతా నశిస్తుంది. ఎన్నిచోట్ల గాలించినా సీత కనిపించలేదు. ‘ఎన్నో ఆశలతో లంకలో అడుగుపెట్టాను. తిరిగి వెళ్ళను. ఈ సముద్ర తీరంలో నిరసన వ్రతాన్ని ఆరంభించి, ఉపవాసాలతో మరణిస్తాను. ఆశతోనైనా రాముడు, సుగ్రీవుడు జీవించి ఉంటారు...’ అనుకున్నాడు.
నిరాశ మనిషిని శారీరకంగా, మానసికంగా నాశనం చేస్తుంది. విజయం సాధించాలంటే పట్టుదల, కఠోర పరిశ్రమ అవసరం. దిగులు చెంది పరాజయాన్ని పొందడం అవివేకం. ఆ స్థితిలో హనుమ ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు. అదే తన ఊపిరిగా భావించాడు. అశోకవనాన్ని చేరి సీతను చూశాడు. కడకు విజయాన్ని పొందాడు.
కొంతమంది ప్రతి చిన్న విషయానికీి భయపడి దిగులు చెంది నిరాశలో కూరుకుపోతారు. ఏదీ తనకు సాధ్యంకాదని అందరికీ దూరంగా పారిపోతారు. కనిపించని చిమ్మచీకటిని చూసి బాధపడేకన్నా చిరుదివ్వెను వెలిగిస్తే చీకటి తప్పుకొంటుంది. జ్ఞానం అవతరిస్తుంది.
హిమాలయ పర్వత ప్రాంతంలో చలికి వణికిపోతూ, జారిపోతున్న కొండలను దాటుకుంటూ శత్రుశిబిరాలనుంచి వచ్చే తుపాకి గుళ్లను భరిస్తూ కాపలా కాసే సైనికులు- నిరాశకు చోటివ్వరు.
లాభాలబాట నుంచి నష్టాల మార్గం పట్టినా నిరాశ చెందక పట్టుదలతో వ్యాపారరంగంలో విజయాన్ని సాధించిన వ్యాపారవేత్తలు ఎంతోమంది కనిపిస్తారు. పాఠశాల నుంచి ఉన్నత విద్యవరకు పరీక్షల్లో కృతార్థులు కాలేని సాధారణ విద్యార్థులు- నిరంతర కృషితో, దీక్షతో, తపస్సుగా విద్యను అభ్యసించి ఉన్నత పదవులను పొంది విద్యావేత్తలైన ఉదంతాలున్నాయి.
సంగీత, నటన, ఇతర కళారంగాల్లో ఏ మాత్రం పనికిరారంటూ తిరస్కరణకు గురైతేనేం- వారిలోని ప్రతిభను నమ్ముకుని, కృషితో చరిత్ర సృష్టించిన వారెందరో మనకు దర్శనమిస్తారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న కవి వాక్కు- మనిషిని ఆశతో నడిపించి గెలిపించే సూత్రం!
- రావులపాటి వెంకట రామారావు