Online Puja Services

ఊర్మిళ గురించి ఎవరైనా ఆలోచించారా?

3.145.85.3

కనిపించే పెద్ద గీత – సీత
దాని వెనుక మరుగైన చిన్నగీత – ఊర్మిళ

 

లక్ష్మణుడికి త్యాగం పేరు చెప్పగానే ఊర్మిళ గుర్తొచ్చింది.
తన మాటని జవదాటకుండా అంతఃపురానికే అంకితమయ్యింది.

 

ఒకరకంగా ఊర్మిళని వదిలి రావడం భర్తగా తను చేసింది తప్పే –
కాని అన్నగారి మీద ప్రేమ, భక్తి ఈనాటివి కాదు. అభిమానాలు, ప్రేమలు న్యాయ ధర్మాల తర్కానికి అందవు. తను అన్నగారిననుసరించి త్యాగం చేసాననుకుంటున్నారు వీళ్ళందరూ !

 

తన త్యాగం వెనుక మరొక మూర్తి త్యాగం కూడా వుంది. ఊర్మిళే కనక తనని అడవులకు వెళ్ళ వద్దని నిర్భందిస్తే ?

ఒకరకంగా తనకు పరీక్షే – తను వద్దనగానే మరోమాట మాట్లాడకుండా మౌనంగా అంగీకరించింది. 
ఒకసారి ఊర్మిళ మీద ప్రేమ అభిమానం పొంగుకొచ్చాయి లక్ష్మణుడికి. రాజ పరివారమంతా బయల్దేరివచ్చినా ఊర్మిళ మాత్రం రాలేదు – ఎందుకు రాలేదు ?

భర్తని చూడాలని అనిపించలేదా ? ఏదో కారణం ఉండే ఉంటుంది.

తల్లి సుమిత్ర నడిగితే తెలుస్తుంది. లక్ష్మణుడు గుడారం లోపలకి ప్రవేశించగానే చెలికత్తెలు పక్కకు తప్పుకున్నారు. తల్లి సుమిత్రకి, పెదతల్లి కౌసల్యకి ప్రణామాలు చేసి, ఈ అడవిలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారేమో చూసి రమ్మని అన్నగారి ఆజ్ఞ అని విన్నవించాడు. కొంతసేపు కుశల ప్రశ్నల అనంతరం సుమిత్రని అడిగాడు లక్ష్మణుడు.

” తల్లీ – అయోధ్యలో అందరూ కుశలమేనా ? ఊర్మిళ ఎలా వుంది ? మీరందరూ అడవికి ఆయత్తమవుతుంటే తనూ వస్తానని అనలేదా ? మీతో పాటు ఊర్మిళ ఎందుకు రాలేదు ? ”

” నాయనా లక్ష్మణా – మేమందరమూ భరతునితో బయల్దేరుతున్నామన్న విషయం స్వయంగా నేనే వెళ్ళి చెప్పాను. తనని కూడా రమ్మనమని చెప్పాను…కానీ.. ” మధ్యలో ఆగిపోయింది సుమిత్ర.

” కానీ…”

” తనే రానని నిష్కర్షగా చెప్పింది. ఎంత బ్రతిమాలినా రానంది. ”

” అదేమిటమ్మా – నువ్వు బ్రతిమాలినా రానని అందా ఊర్మిళ – పోనీ ఎందుకు రానందో కారణమైనా విన్నవించిందా నాకు….”

” కారణం…” తటపటాయిస్తూ ఆగిపోయింది సుమిత్ర.

” సందేహం వద్దు – చెప్పమ్మా ! నేనేమి కోపగించుకోను…”

” నీకు ప్రతిబంధకం కాకూడదని…” సుమిత్ర మధ్యలో ఆగిపోయింది. ఒక్కసారి లక్ష్మణునకు మనుసుని ఛెళ్ళుమని కొట్టినట్లనిపించింది. బయల్దేరేముందు తనకి, ఊర్మిళకి జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. ఇంకేమీ మారు మాట్లాడకుండా మౌనంగా లక్ష్మణుడు బయటకు వచ్చేశాడు. ఊర్మిళ అభిమానవతి. అంతేకాదు భర్త కర్తవ్యపాలనకోసం అంతఃపురానికే అంకితమయ్యిన మహాసాధ్వి. బాధలు, సంతోషాలు పంచుకోవడానికి వదిన గారు సీతకి, అన్నగారు రాముడున్నారు.

మరి ఊర్మిళకెవరున్నారు ? పక్కన ఉండాల్సిన తను…. లక్ష్మణుడు వడి వడిగా అడుగులువేసుకుంటూ తమ కుటీరం వైపు మరలాడు. వెన్నెల రాత్రిలో కుటీరం ముందు వదినగారు పుష్ప రేకలతో వేసిన ముగ్గు చూసాడు. గబుక్కున త్రొక్కబోయి పక్కకు జరిగాడు. పసిడి వెన్నెల్లో గీతల్లా వేసిన ముగ్గులో ఆ పుష్పాలు మరింతగా మెరుస్తున్నాయి. ఆ పుష్పాల్లో ఊర్మిళే కనిపించింది లక్ష్మణుడికి. కనిపించే పెద్ద గీత - సీత దాని వెనుక మరుగైన చిన్నగీత – ఊర్మిళ

ఓం దాశరథాయ విద్మహే జానకీవల్లభాయ థీమహి 
తన్నో: రామచంద్ర ప్రచోదయాత్!!!

శ్వేత రావు 

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya