Online Puja Services

ఆగమము అంటే ???

3.15.186.56

ఆగమము...

ఆగమము అనగా వచ్చినది అని అర్దము. వైష్ణవ ఆగమము లలో రెండు రకములు ఉన్నాయి. అందులో ఒకటి వైఖానశ మునికి విష్ణువు నుండి వచ్చినది 'వైఖానశ ఆగమము', రెండవది గరుత్మంతునికి అయిదు రాత్రులు విష్ణువు వుపదేశించినదే 'పాంచరాత్ర ఆగమము'. నేడు అత్యధిక దేవాలయాలలో పాంచరాత్ర ఆగమానుసారమే పూజలు నిర్వహించబడుతున్నాయి. కానీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో మాత్రం వైఖానశ ఆగమానుసారం పూజలు నిర్వహించబడుతున్నాయి. మిగతా వైఖానశ ఆగమాలను అనుసరించే దేవాలయాలను పాంచరాత్ర ఆగమ విధానం లోనికి మార్చిన రామానుజాచార్యులవారు తిరుమలలో మాత్రం ఆసాహసం చేయలేక వైఖానశ ఆగమం లోనే పూజలు చేయాలని కట్టడి చేసారు.

శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను మరియు వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమయిన వైఖానస భగవత్ శాస్త్రమే తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం.

వైఖానసులు ఒక తపస్సంపన్నుల సమూహం. వీరి ప్రస్తావన మొదటి సారిగా మనుధర్మశాస్త్రంలో వస్తుంది. మనువు మనిషి యొక్క వర్ణాశ్రమంలోని ఆఖరి రెండు చరమాంకాలయిన వానప్రస్థం ఇంకా సన్యాసాశ్రమం గురించి చెబుతూ వైఖానస నిబంధనను తెలుపుతాడు. తద్వారా వైఖానస సముదాయం ఆ కాలానికే ఉందని తెలుస్తుంది. నారాయణీయంలో కూడా వీరి ప్రస్తావన వస్తుంది. కానీ సైద్ధాంతికంగా వైఖానస సూత్రాలు నాలుగోశతాబ్దికన్నా పాతవి కావని తెలుస్తోంది. ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా వైఖానసులు పూజారులని తెలుస్తోంది. వైఖానసులు పూజారిలే కాక దేవాలయంలో ధర్మకర్తల బాధ్యతలు కూడా నిర్వహించేవారు. గుడికి సంబంధించిన ఆస్తులకు జవాబుదారీగా ఉండే వారు. శ్రీవైష్ణవుల రాకతో వైఖానసుల ప్రాభవం తగ్గిపోయింది. రామానుజాచార్యుడి రాకతో ఈ ప్రాభవం మరింత తగ్గింది. రామానుజులు దేవాలయ పూజారి వ్యవస్థను రూపుమాపు చేసాడు. అయిదు స్థాయిలలో ఉన్నది పది స్థాయిలకు మార్చాడు (ప్రధానార్చకుడు-అర్చకుడు-తీర్థం (నీరు) తెచ్చే వ్యక్తి - వంట చేసే వ్యక్తి - ఘంటారావం చేసే వ్యక్తి ఉన్న వ్యవస్థ నుండి శూద్రులకు స్థానం కల్పిస్తూ నిర్మాల్యం తొలగించడం-పాలుపూలుపళ్ళు తేవడం- ఉత్సవ పల్లకీ మోయడం - గుడిలో తులసీవనం పోషించడం మొ॥ ఉన్న వ్యవస్థను నెలకొల్పడం). ఈ విధంగా శూద్రులకు ఎన్నడూలేని స్థానం దేవాలయంలో దక్కినప్పటికీ వైఖానసుల అవసరం తగ్గలేదు. ఈనాడు ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ప్రధానార్చకులుగా వైఖానసులే ఉంటారు. ఒక కథనం ప్రకారం శైవుల రాక వలన వైఖానసులంతా తిరుమల ఆలయం చేరతారు. వీరు వీడి వచ్చిన ఆలయాలన్నీ అప్పటి చోళ రాజు స్వాధీనం చేసుకుని శైవాలయాలుగా మార్చివేస్తాడు. కొద్ది కాలానికి ఆ ఆలయాలలో తిరిగి వైష్ణవ పూజలను రామానుజుల ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులు కొనసాగిస్తారు. అంతలోనే అందరు వైఖానసులు నరికివేయబడతారు. అది చోళరాజు చేయించినదా లేక రామానుజులు చేయించిన చర్యనా అన్నది ఎవరికీ తెలీదు. ఆ విధంగా ఒక్క వైఖానస పురుషుడు కూడా మిగలకుండా అవుతుంది. అప్పుడు రామానుజులు వేంకటేశ్వర స్వామిని సమీపించి పూజాపునస్కారాల విషయమై చర్చిస్తూ, శ్రీవైష్ణవుల ఆధ్వర్యంలో పూజలు జరగాలని స్వామి వారిని కోరతాడు. కానీ స్వామివారు ఒక వైఖానస బాలకుడి విషయం తెలిపి అతనికి ఉపనయనం చేయించి అతని చేతనే పూజలు జరిపించాలని కోరతాడు. రామానుజులు ఈ విషయమై విముఖంగా ఉంటాడు. పాంచరాత్రాగమంలోనే పూజలు జరగాలన్నది ఆయన ఆశయం. ఈ బాలుణ్ణి కూడా హతమార్చాలని పన్నాగం జరుగుతుంది. స్వామి పుష్కరిణిలో మునిగి తేలగానే ఆ బాలుడు వటువుగా మారిపోతాడు. స్వామివారి వైభవం తెలుసుకున్న ఇతరులు, రామానుజులు తిరుమల పూజలను తిరిగి వైఖానసులకే అప్పగిస్తాడు. అప్పటి నుండి తిరుమల ఆలయం మొదలు చాలా ఆలయాల్లో వైఖానస-శ్రీవైష్ణవ వైరం ముందుకొస్తుంది. నేటికీ కొన్ని ఆలయాలలో ప్రధానార్చకత్వంపై వివాదాలున్నాయి. అయినా శ్రీరంగంలోని రామానుజుల పార్థివశరీరమూర్తి అని చెప్పబడే తాన్ ఆన తిరుమేణికి పూజ చేసేది వైఖానసులే.

దాదాపుగా 4000కుటుంబాలున్న ఈ మతానుయాయులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలు, ఇంకా విదేశాల్లోని వైష్ణవాలయాల్లో పూజారులుగా కనిపిస్తారు. తమని వేరే శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు. ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారు. వీరెక్కువగా తెలుగు మాట్లాడుతారు. అరవం వారు కూడా తెలుగు లిపిని చదవగలుగుతారు.  
వైఖానసులు, వారి నమ్మకం ప్రకారం, వైదిక సాంప్రదాయమైన కృష్ణ యజుర్వేదీయ తైత్తీరియ శాఖను పాటించే జీవిత సమూహం. వైఖానస సాంప్రదాయం ప్రకారం ఋషివిఖనసుడు మహావిష్ణువు యొక్క అంశతో మహావిష్ణువుకే జన్మించాడు. బ్రహ్మతో పాటుగానే ఇతనికి ఉపనయనం జరిగింది. మహావిష్ణువే గురువుగా సమస్త వేదాలు, మరియు భగవత్ శాస్త్రాన్ని అభ్యసిస్తాడు. ఆపై భూమి మీదకి నైమిశారణ్యం వద్దకు వస్తాడు. అక్కడ వైఖానస కల్పసూత్రాన్ని రచించి తన నలుగురు శిష్యులైన అత్రి, భృగువు, కశ్యపుడు మరియు మరీచికి ఉపదేశిస్తాడు. అత్రికి సమూర్తార్చన, భృగువుకి అమూర్తార్చన, కశ్యపుడికి తర్కం-జపం, మరియు మరీచికి అగ్ని హుతం పై ఉపదేశాలు చేస్తాడు. వైఖానసుల ప్రకారం వైదిక హవిస్సు క్రతువునే వీరు కొనసాగిస్తున్నారు. యాగం చేస్తూ అగ్నిలో హవిస్సులు పోస్తే వచ్చే ఫలితమే వైష్ణవారాధాన ద్వారా వస్తుందని నమ్ముతారు. విష్ణువు యొక్క ఐదు రూపాలను వీరు కొలుసారు -

విష్ణువు - సర్వాంతార్యామియైన దేవాదిదేవుడు
పురుషుడు - జీవితం యొక్క సూత్రము
సత్యము - దైవం యొక్క మారని అంశం
అచ్యుతుడు - మార్పు చెందని వాడు
అనిరుద్ధుడు - ఎన్నటికీ తరగని వాడు

పాంచరాత్రమనగా శ్రీవైష్ణవులు పరమపవిత్రంగా భావించే ఆగమ శాస్త్రం. ఐదు రాత్రులనే అర్థం వచ్చే ఈ పాంచరాత్రం వెనుక ఎన్నో కథలూ, కథనాలూ కనిపిస్తాయి. ఈ పదం శతపథ బ్రాహ్మణంలోని 12వ సర్గలో కనిపిస్తుంది - మహావిష్ణువు ఐదు రాత్రుల పాటు బలి క్రతువును నిర్వహించి సర్వశక్తులను పొందడం. రామానుజులు ప్రతిపాదించిన శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఈ ఆగమం ముఖ్య పాత్రను వహిస్తుంది. 200కు పైగా గ్రంథాలు ఇందులో భాగం. ఇందులో క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందినవి, కీ.శ. 6 నుండి 9 మధ్య రాయబడినవి కనిపిస్తాయి. పాంచరాత్ర ఆగమం ఉదహరించిన కథనాలలో అన్నిటికన్నా ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది ఇది. హయవదనుడనే రాక్షసుడు వేదాలకు విధియయిన బ్రహ్మ నుండి తస్కరించి సముద్రగర్భానికి వెళ్ళి దాక్కున్నప్పుడు వేద క్రతువులు జరగక దేవతల శక్తులు తగ్గిపోసాగాయి. అప్పుడు అయిదు రాత్రుల పాటూ దేవర్షులంతా కలిసి అయిదు రాత్రుల పాటు మంత్రం లేనందువలన (వేదాలు లేవు కనుక మంత్రం లేదు) తంత్రంతో పూజ చేస్తారు. ఆ విధంగా విష్ణువు శక్తిమంతుడై మత్స్యావతారం దాల్చి హయవదనుణ్ణి చంపి వేదాలను రక్షిస్తాడు. తిరిగి హయగ్రీవ మూర్తిగా మారి వాటిని బ్రహ్మకు ఉపదేశిస్తాడు. అలా వేదాలు పోయి మరలా తిరిగి వచ్చిన వ్యవధి అయిదు రాత్రులలో భగవదారాధన వైదిక పద్ధతిలో కాకుండా తంత్రంలో జరిగింది. అందువలన ఆ పంచరాత్రుల పేరు మీద పాంచరాత్రం అని ఈ ఆగమశాస్త్రానికి పేరు పడింది. ద్వాపరయుగమంతా భగవదారాధనకు మూలం పాంచరాత్ర ఆగమశాస్త్రమే అని మనకు తెలుస్తున్నది. ద్వాపర యుగంలో నారదుడు తిరిగి ఈ శాస్త్రాన్ని రుక్మిణికి ఉపదేశించి శ్రీకృష్ణుని మూర్తిని పాంచరాత్ర ఆగమశాస్ర్తయుతంగా పూజించమని చెబుతాడు. ఆపై రుక్మిణి నుండి అందరికీ ఈ విషయం వ్యాప్తి చెందుతుంది. గౌడీయ సాంప్రదాయంలో కూడా ఈ పూజా పద్ధతి కనిపిస్తుంది. చారిత్రక ఆధారాల ప్రకారం రామానుజుల వారి కాలంలో ఈ ఆగమ శాస్త్రం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎన్నో ప్రముఖ దేవాలయాలకు ఇది నేడు ప్రామాణికం.  
పాంచరాత్రమనే పదానికి అర్థం - ఐదు రాత్రులతో సంబంధం ఉన్నది అని. ఒక కథ ప్రకారం కేశవుడు (విష్ణువు లేదా నారాయణుడు) ఈ పరమరహస్యమయిన తాంత్రిక విద్యను మొటమొదటగా ఐదు రాత్రుల పాటూ అనంతుడికీ (ఆదిశేషుడు), గరుత్మంతుడికీ, విష్వక్సేనుడికీ, విధియయిన బ్రహ్మకూ మరియు రుద్రునికీ నేర్పిస్తాడు. 
మరొక కథనం ప్రకారం రాత్రము అనే పదానికి జ్ఞానము, జ్ఞప్తి, తెలివి మొదలగు అర్ధాలు ఉన్నాయి. ఐదు రకాల తత్వ జ్ఞానాలను ప్రసాదిస్తుంది కాబట్టీ ఇది పాంచరాత్రమయింది. ఈ ఐదు జ్ఞానాలు:

తత్వము
ముక్తిప్రథము
భక్తిప్రథము
యౌగికము
వైషాయికము
ఇంకొక కథనం ప్రకారం ఇది భగవంతుని ఐదు తత్వాలను బోధించే శాస్త్రము కాబట్టీ పాంచరాత్రమయింది. ఇవి :

పర
వ్యూహ
విభవ
అంతర్యామి
అర్చ  
పదకొండవ శతాబ్దిలో రామానుజులు ఆది శంకరుల అద్వైతాన్ని తిరస్కరిస్తూ వైష్ణవులకు పాంచరాత్ర పద్ధతిని ఏర్పరచారు. పాంచరాత్రాగమనానికి అనువుగానే నారాయణుణ్ణి పరమాత్మగా నమ్మడం, దేవాధిదేవుడిగా కొలవడం కనిపిస్తుంది. రామానుజుల ప్రకారం పరమాత్మ ఐదు రూపాల్లో అవతరిస్తాడు: పర, వ్యూహ, విభవ, అంతర్యామి మరియు అర్చ. మనుషులు భగంతుణ్ణి చేరేందుకు ఈ ఐదు రూపాల్లో ఏదో ఒకటి లేదా ఎక్కువ రూపాలను ఆరాధించవచ్చు 

పర రూపం
పరమాత్ముడి రూపమే ఈ పర.

వ్యూహ రూపం
ఆరు గుణాలతో కూడుకుని ఉన్న వాసుదేవుడే మొదటి వ్యూహ మూర్తిగా గుర్తించబడ్డాడు. వాసుదేవుడి నుండి ఉద్భవించిన సంకర్షణుడిలో జ్ఞానము మరియు బలము అనే గుణాలు ఉంటాయి. సంకర్షణుడి నుండి ఉద్భవించిన ప్రద్యుమ్నుడిలో ఐశ్వర్యము మరియు వీర్యము (వీరత్వము) అనే గుణాలు ఉంటాయి. ప్రద్యుమ్నుడి నుండి ఉద్భవించిన అనిరుద్ధుడిలో శక్తి మరియు తేజస్సు అనే గుణాలు ఉంటాయి. ఇలా ఈ రూపాలను ఆయా గుణాలకు అధిదేవతలుగా కీర్తిస్తూ పూజించడం పాంచరాత్రుల సంప్రదాయం.

అవతార రూపం
వ్యూహ రూపం యొక్క సిద్ధాంతానికి దగ్గరగా ఉండేదే ఈ రూపం. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యూహ రూపంలో పేర్కొన్న నలుగురూ వేరు వేరు సమయాలలో అవతారాలుగా ఈ భూమిపైకి వస్తారు.

అంతర్యామి రూపం
ఈ రూపం ప్రతీ మనిషిలోనూ ఉంటుందనేది నమ్మిక. ఈ నాలుగో రూపం ప్రతి మనిషిలోనూ అనిరుద్ధుడి ద్వారా నియంరించబడుతుంది. ఈ శక్తి ప్రతి ఒక్కరి హృదయంలో హృదయకమలంగా స్థాపించబడి ఉంటుంది. ఇది వ్యూహంలోని ఒక్కడయిన అనిరుద్ధుడే కానీ పరమాత్మ కాదన్నది పండితుల వాదన.

అర్చ రూపం లేదా అర్చావతారం
నారాయణీయం లోలా కాకుండా పాంచరాత్ర సంహితాలలో అర్చ రూపాన్ని భగవంతుని యొక్క స్వరూపంగా నమ్ముతారు. ఏదయిన జడ వస్తువు (విష్ణువు విగ్రహం లేదా పటం) ను సరియయిన పద్ధతిలో పాంచరాత్ర సంహితల ప్రకారం పూజించి, ప్రాణ ప్రతిష్ఠ చేస్తే, అందులోకి అద్భుతమయిన శక్తులు వచ్చి, విష్ణువు యొక్క శక్తిని ఆ వస్తువు సంతరించుకుంటుంది. ఆ విధంగా ప్రతిష్ఠించిన ఆ వస్తువుకు అనుదినం నిత్యపూజ చేయాల్సి ఉంటుంది. ఈ అర్చ ఆరాధనకూ మూర్తిపూజకూ చాలా తేడా ఉంది. మూర్తిపూజలో ఆరాధకుడికి విగ్రహం యొక్క అంగములపై దృష్టి ఉంటుంది (అంగ పూజ మొ॥). అలా చేయటం ద్వారా కొద్ది కాలానికి ఆరాధకుడి దృష్టి ఒక బిందువుకు కుచించుకుంటుంది, ఆపై మూర్తి అవసరం ఉండదు. కానీ అర్చ పద్ధతిలో విగ్రహంలో భగవంతుడిని ఆరాధకుడు అనుభవిస్తాడు. ఈ విధంగా పన్నిద్దరు ఆళ్వారులూ వివిధ దివ్య దేశాలలో భగవంతుని అనుభవించారు. 

ఆగమాన్ని అనుసరిస్తున్న దేవాలయాలు ఈ ఆగమం ప్రకారం మంత్రం కన్నా భగవంతునిపై భక్తి పెక్కు రెట్లు ప్రభావం కలిగి ఉంటుంది. సంస్కృతంకన్నా ఆరాధకుడి మాతృభాషలో పూజలు చేయటం ఉత్తమంగా ఈ మతం నమ్ముతుంది. ఈ మతాన్ననుసరించి పూజలు జరిగే 
ఆలయాలు :

తిరుమల ఆలయంలో స్నపన తిరుమంజనం మొదలు కొన్ని పూజలు
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో నివేదన
యాదగిరిగుట్ట నరసింహాలయం
భద్రాచలం శ్రీరామ ఆలయం
శ్రీకాకుళం ఆంధ్రమహావిష్ణువు ఆలయం
మంగళగిరి పానకాల స్వామి ఆలయం
కడప దేవునికడప ఆలయం
అహోబిలం ఆలయాలు
శ్రీరంగం ప్రధాన ఆలయం
వంగిపురం శ్రీ వల్లభరాయ ఆలయం.

భానుమతి అక్కిశెట్టి 

 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore