Online Puja Services

స్టే హోమ్... స్టే సేఫ్...! అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

3.133.157.133

స్టే హోమ్... స్టే సేఫ్...! అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...! - 

 
కురుక్షేత్ర సమరం జరగడం ఖాయమై పోయింది… యుద్ధక్షేత్రాన్ని కూడా ఖరారు చేసేశారు… ఏ రోజు నుంచి యుద్ధం ప్రారంభం అవుతుందో కూడా తేల్చేశారు… ఇరుపక్షాలూ బలాల సమీకరణలో పడ్డాయి… సాధనసంపత్తి సమకూర్చుకుంటున్నాయి… అక్షౌహిణుల కొద్దీ సైన్యం తలపడే చరిత్రాత్మక సమరం అది… ఎన్ని లక్షల తలలు తెగిపడతాయో తెలియదు… ఆ కురుక్షేత్ర స్థలాన్ని ఏనుగులతో చదును చేయిస్తున్నారు… రాళ్లు, పొదలు, తుప్పలు, చెట్లను తొలగించేస్తున్నారు… సమతలం చేస్తున్నారు… ఆకాలంలో ఏనుగులే కదా జేసీబీలు, పొక్లయిన్లు…
 
అర్జునుడు, కృష్ణుడు కలిసి ఆ స్థలాన్ని పరిశీలించటానికి వచ్చారు… క్రికెట్ మ్యాచుకు ముందు ఫీల్డ్, పిచ్ పరిశీలనకు వచ్చిన కెప్టెన్లలాగా ఓచోట నడుస్తున్నారు… ఇంతలో ఒక పెద్ద ఏనుగు ఓ చెట్టును అమాంతంగా కూల్చేసింది… పాపం, ఆ చెట్టు తొర్రలో ఓ పిచ్చుక ఉండేది… దానికి ఓ గూడు… దానికి నాలుగు పిల్లలు… ఇంకా ఎగరడానికి రెక్కలకు బలం రాలేదు… ఆ నాలుగింటినీ ఇంకెక్కడికో ఎత్తుకుపోయేంత బలం ఈ తల్లి పిచ్చుక రెక్కలకు లేదు… చెట్టుతోపాటు పిచ్చుకగూడు కూడా కిందపడింది… లక్కీగా పిల్లలు సేఫ్…
 
ఆ పిట్ట కృష్ణుడిని చూస్తుంది… గుర్తిస్తుంది… ఎలాగోలా బలహీనంగా ఎగురుతూ వెళ్లి తన ఎదుట వాలుతుంది… ఆ రెక్కలతో దండం పెడుతుంది… అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు… కృష్ణుడికి అన్నీ తెలుసు కదా… చిరునవ్వుతో పిచ్చుక వైపు చూశాడు…
 
కృష్ణా… ఏమిటిదంతా దేవా..? అడిగింది పిట్ట…
 
యుద్ధక్షేత్రాన్ని చదును చేసే ప్రక్రియ తల్లీ… బదులిచ్చాడు కృష్ణుడు…
 
రేపు మరో ఏనుగు వస్తుంది, తన కాళ్లతో తొక్కేస్తుంది… మరి నా పిల్లలు ఏమైపోవాలి..? యుద్ధం నా పిల్లల ప్రాణాలతోనే ప్రారంభం కావాలా కృష్ణా… అని విలపించింది పిట్ట…
 
నేను విన్నాను, నేనున్నాను అనలేదు కృష్ణుడు… రాసి పెట్టి ఉంటే తప్పదమ్మా… కాలచక్రం చాలా నిరంకుశమైంది… దాని ముందు నువ్వూ, నేను నిమిత్తమాత్రులమే కదా… అన్నాడు నిర్దయగా… కానీ ఏదో ఆలోచనలో పడ్డాడు…
 
కపటనాటక సూత్రధారివి నువ్వు, నాకు తెలుసులే నీ మాటల మహత్తు… తత్వం బోధించకు స్వామీ… అసలు కాలచక్రమే నువ్వు… అన్నీ జరిపించేది నువ్వే, నువ్వే.,., నా పిల్లల్ని కాపాడాల్సింది నువ్వే, నీమీదే భారం వేస్తున్నా, నువ్వే రక్షకుడివి ప్రభువా…, నిన్నే వేడుకుంటున్నాను…. అని మొరపెట్టుకుంది పిచ్చుక…
 
పోనీలే కృష్ణా, మనతో తీసుకుపోదాం, బయట వదిలేద్దాంలే అన్నాడు అర్జునుడు… కృష్ణుడు వారించాడు… పిచ్చుక అసహాయంగా చూస్తూ ఉండిపోయింది… వెళ్లేముందు పిచ్చుకతో… ‘‘నీకూ, నీ పిల్లలకు మూడు వారాలకు సరిపడా తిండిని ఎలాగోలా తెచ్చి పెట్టుకో..’’ అన్నాడు… పిచ్చుకకు, అర్జునుడికీ ఏమీ అర్థం కాలేదు…
 
రెండు రోజులు గడిచాయి… సమరశంఖాలు పూరించారు… ఇరువైపులా చతురంగ బలాలు… సమరాంగణం హోరెత్తిపోతున్నది… కాసేపట్లో యుద్ధం ప్రారంభం కాబోతున్నది… కృష్ణుడు ఒకసారి నీ ధనుస్సు ఇవ్వు బావా అనడిగాడు అర్జునుడిని…
 
అర్జునుడు విస్తుపోయాడు… నువ్వు ఆయుధాన్ని ధరించను, వాడను, పోరాడను అని ప్రకటించావు కదా బావా… నీకెందుకు మాటతప్పిన అప్రతిష్ట..? నువ్వు ఆదేశించు, నేను హతమారుస్తా…
 
కృష్ణుడు మాట్లాడకుండా గాండీవాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ఓ బాణాన్ని ఎక్కుబెట్టి, ఘీంకరిస్తున్న ఓ ఏనుగుకు గురిపెట్టి వదిలాడు… ఆ బాణం నేరుగా వెళ్లింది… ఆ ఏనుగు మెడలో కట్టి ఉన్న పెద్ద గంటను తాకింది… ఆ గంటకు ఉన్న తాడు తెగి, గంట కింద పడిపోయింది… అర్జునుడికి నవ్వొచ్చింది… ఏమిటి బావా..? ఈ అపశకునం, ఐనా నీ గురితప్పడం ఏమిటి..? అనడిగాడు… ఆ ఏనుగును చంపేయాలా..? నేను బాణం వదలనా..? అన్నాడు… మాట్లాడకుండా ఆ ధనుస్సు తిరిగి ఇచ్చేసిన కృష్ణుడు తన చేతిలోని పాంచజన్యాన్ని పూరించాడు… యుద్ధం ప్రారంభమైంది… మొన్న పిట్ట గూడును కూల్చేసిన ఏనుగే అది…
 
భీకరమైన యుద్ధం… 18 రోజుల్లో అటూ ఇటూ లక్షల తలలు తెగిపడ్డాయి… ఏనుగులు, గుర్రాలు చచ్చిపోయాయి… ఎటు చూసినా కళేబరాలు… తెగిన అవయవాలు… విరిగిన రథాలు… బాణాలు, ధనుస్సులు, ఈటెలు, గదలు… పైన ఎగురుతున్న రాబందులు… మృత్యుదేవత వేనవేల కోరలతో తాండవం చేస్తున్న వాసన… అర్జునుడిని తీసుకుని ఆ శవాల నడుమ ఏదో వెతకడం ప్రారంభించాడు కృష్ణుడు…
 
తొలిరోజున తన పడగొట్టిన ఏనుగు గంట కనిపించింది ఓచోట… అలాగే భద్రంగా… అర్జునా, ఆ గంటను పైకి లేపు అన్నాడు కృష్ణుడు… కృష్ణలీలలు, మాయలు, చేష్టలు ఎప్పటికప్పుడు కొత్తే కదా అర్జునుడికి… మారుమాట్లాడకుండా ఆ గంటను పైకి లేపాడు… అంతే… దాని కింద ఉన్న పిట్టపిల్లలు నాలుగు రెక్కలను ఒక్కసారి వదిల్చి గాలిలోకి ఎగిరాయి… వాటితోపాటు వాటి తల్లి కూడా… ‘ఇవి ఆ రోజు పిట్ట పిల్లలేనా..?’ అనడిగాడు అర్జునుడు… కృష్ణుడు మొహంలో చిరుమందహాసం… ఆ గంట అన్నిరోజులపాటు అంత భీకరమైన యుద్ధం నుంచి ఆ చిన్ని కుటుంబాన్ని కాపాడింది… ఇంతకీ ఈ కథలో నీతి ఏమిటి అంటారా..? ఈ కరోనా విపత్తు వేళ మనకు చెబుతున్న పాఠం ఏమిటీ అంటారా..? సింపుల్….
 
‘‘ గంట దాటి బయటికి కదలకండి, యుద్ధం పూర్తయ్యేంతవరకూ దాని కిందే భద్రంగా ఉండండి… అదే మీకు రక్ష… స్టే హోమ్… స్టే సేఫ్…’’ .
 
- వాట్సాప్ సేకరణ 
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore