Online Puja Services

సమస్త జీవులను పోషించువాడు ఆ నారాయణుడే

18.119.133.138

శతాబ్దాల క్రితం కూడా శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు బారులు తీరి వేచి చూసేవారు. ఒక పేద వైష్ణవుడు రోజు వరుసలో అందరికంటే ముందు నిలబడే వాడు. అయన తన కోసమే కాక, తన ఆరుగురు కొడుకుల కొరకు కూడా ప్రసాదం ఈయమని పట్టు పట్టేవాడు. ఇలా రోజు ఆలయ అధికారులకి అతనికి క్రొంత వాదులాట జరిగేది. 

ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకు కొంచెమే ప్రసాదం లభిస్తుంది అని ఆలయ అధికారులు మందలించేవారు. నా ఆరుగురు కొడుకులు బ్రక్క చిక్కి పోయారు, కనుక ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆయన వాదించేవాడు. 

ఇంతలో ఒకరోజు రామానుజుల వారు అక్కడ గలాటా చూసి ఏమి జరిగిందని వాకబు చేస్తారు. ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుణ్ణి చూపి, రోజూ అధిక ప్రసాదం కొరకు ఆయన గలాటా చేస్తున్నాడని తెలియచేస్తారు. రామానుజులు ఆ వైష్ణవుణ్ణి చూసి, నాయనా నీవు ఆలయములో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తారు. 

స్వామి, నా బక్క చిక్కిన కొడుకులని మీరే చుడండి, రోజంతా వారికీ సేవలు చేయడములోనే నాకు సమయం సరిపోతుంది, వీరిని వదిలేసి నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయలేను అని బదులిచ్చాడు ఆ పేద వైష్ణవుడు. పైగా నేను వేదాలను గాని, దివ్య ప్రబంధములను గాని నేర్చుకోలేదు, అందువల్ల నేను ఆలయ సేవ కాలములలో కూడా ఏ కైంకర్యం చేయలేను, నాకు కొన్ని విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు తప్ప ఏమి రావు, నేనేమి చేయగలను.

సరే నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలని చెప్పమని రామానుజుల వారు అడుగగా, ఎంతో ఇబ్బందిగా "విశ్వం విషు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు:, భూత కృత్ భూత భృత్..
నాకంత వరకే వచ్చు అని చెప్పాడా వైష్ణవుడు. సరే నీకు భూత భృత్ అనే భగవన్నామము తెలుసు కదా, ఆ నామాన్నే జపించు, ఇక నీకు ఇక్కడికి ఆహారార్థి యై రావలసిన అవసరం ఉండదు అని సెలవిచ్చారు రామానుజులు.

ఆ నాటి నుండి ఆ వైష్ణవుడు మరల కోవెల ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపించలేదు. ప్రసాదపు వరుసలలో గొడవలు ఆగిపోయాయి. అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలయింది. రోజూ రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాల భాగం మాయమైపోతుంది. ప్రసాదం దొంగల బారి పడుతుందేమో అని భద్రత పెంచారు కూడా. అయినా సమర్పించిన దానిలో చాల ప్రసాదం మాయమైపోతుంది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అని అనుమానం అందరిదీ. చివరకి రామానుజులకి తెలియ చేసారు ఈ సమస్యని. ఆ పేద బ్రాహ్మణుణ్ణి పిలుచుకు రమ్మని రామానుజుల వారు మనుషులని పంపగా, ఆయన తన పాత నివాసంలో ఉండటం లేదని తెలిసింది. ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియలేదు.

కొంత కలం తర్వాత, రామానుజులు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది (శ్రీరంగం దగ్గర కావేరి పాయ) దాటు తుండగా ఈ వైష్ణవుడు స్వామి స్వామి అని రామానుజులని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించారు. రామానుజుల పాదాలకు సాష్టాంగం చేసి, ఆయన కనుల నుండి ధారగా కన్నీరు రాసాగింది. మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజూ నాకు ప్రసాదం అందచేస్తున్నాడు అని చెప్పాడు. అందువల్ల నా పిల్లలు ఇక పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని కోవెల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేసాను. 
నేను మీకు సదా కృతజ్ఞుడను. మీరు చెప్పిన విధంగా రోజూ నేను "భూతభృతే నమ:" జపాన్ని చేస్తున్నాను. 

ఈ మాటలు విన్న రామానుజులు ఆశ్చర్య చకితులయ్యారు. ఎవరా పిల్లవాడు? వాని పేరేమి?? అని అడుగగా, ఆ పిల్లవాడు తాను రామానుజా దాసుడనని చెప్పాడని చెప్పాడు వైష్ణవుడు. 

ఇంతకీ ఆబాలుడు ఇంకెవ్వరు సాక్షాత్ శ్రీరంగనాథుడే. 

భూత భృత్ నామానికి అర్థం సమస్త జీవులని పోషించువాడు అని అర్థం.

-  sekarana

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore