పంచ అయ్యప్ప క్షేత్రాలు
స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప
పంచ అయ్యప్ప క్షేత్రాలు వాటి వివరణ
1. కుళత్తుపుల - అనే క్షేత్రంలో అయ్యప్పస్వామి విగ్రహం బాలుని రూపంలో వుంటుంది ! అందాలు చిందే పసిబాలుడుగా సాలగ్రామ శిలారూపంలో ‘కుళత్తూర్ అయ్యన్’ అనే పేరుతో పూజింపబడుతున్నాడు.
ఆలయ సమీపంలో వున్న పుష్కరిణిలో స్నానం ఆచరించడంవల్ల చర్మరోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం ! ఈ క్షేత్రం జీవి హృదయస్థానంలో వుండే వాయుతత్త్వంతో కూడిన అనాహత చక్రానికి ప్రతీకగా స్థల పురాణంలో చెప్పబడింది !
2. ఆర్యన్‌గావ్ - కుళత్తపుల క్షేత్రానికి సుమారు పద్ధెనిమిది మైళ్ల దూరంలో వున్న ఈ క్షేత్రంలో కళ్యాణమూర్తిగా పూర్ణా , పుష్కళా దేవేరుల సహితంగా దర్శనమిస్తాడు అయ్యప్పస్వామి ! ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి , దేవేరుల కళ్యాణం వైభవంగా జరుపుతారు ! జీవి నాభి స్థానంలో వుండే అగ్నితత్వం గల మణిపూరక చక్రానికి ఈ క్షేత్రం ప్రతీకగా చెప్పబడింది !
3. అచ్చన్ కోవిల్ : జలతత్త్వమైన , నాభికి క్రిందగా వుండే స్వాధిష్టాన చక్రానికి ప్రతీకగా వెలసి వున్న ఈ క్షేత్రంలో రుద్రాక్ష శిలారూపంలో వెలసి వున్న అయ్యప్పస్వామి గృహస్థుగా పూజింపబడుతున్నాడు !రాచర్ల రమేష్
4. ఎరుమేలి : ఇక్కడ ఆలయంలో ధర్మశాస్తా కిరాత పురుషునిగా (వేటగాడు)గా దర్శనమిస్తాడు. ఈ ఎరుమేలిలోనే అయ్యప్పస్వామి మిత్రుడైన వావరు గుడి వున్నది ! శబరిమల యాత్రలో భక్తులందరూ ఎరుమేలి చేరి అయ్యప్ప ఆటవిక పురుషుని రూపంలో వున్నందువల్ల తాము కూడా ఆటవిక వేషాలు ధరించి , తాము తీసుకువెళుతున్న ఆయుధాలను చేతబట్టి (కత్తి , గద , బాణం మొదలైనవి) అయ్యప్ప భజన చేస్తూ నాట్యం చేస్తుంటారు. దీన్ని ‘వేటతుళ్లి’ అంటారు ! ఈ విధంగా చేయడంవల్ల స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం ! జీవి శరీరంలోని పృథ్వీతత్వమైన మూలాధార చక్రానికి ప్రతీకగా ఈ స్థానం చెప్పబడింది !
5. శబరిమల : జీవి కనుబొమ్మల మధ్య వుండే ఆజ్ఞా చక్రానికి ప్రతీకగా శబరిమల ! ఇక్కడ స్వామి జ్యోతి రూపంలో మకర సంక్రాంతినాడు దర్శనం ప్రసాదిస్తాడు !
ఈ ఐదు క్షేత్రాలేగాక పంబల రాజ్యంలోని ధర్మశాస్తా ఆలయం వెలసి వున్న ప్రాంతం జీవి కంఠ ప్రదేశంలో వుండే ఆకాశ తత్వాన్ని గల విశుద్ధి చక్రానికి ప్రతీకలా చెప్పబడింది. ఇక్కడ స్వామిని బాలశాస్తాగా పూజించడం ఆనవాయితీ !
కేరళ రాష్ట్రంలో ప్రధానమైన అయ్యప్ప క్షేత్రాలు అవి ! ఇక ఇప్పుడు దక్షిణాపథంలోని ఇతర రాష్ట్రాలో గూడా అయ్యప్పస్వామికి ఎన్నో గుడులు నిర్మించబడ్డాయి. భక్తులు కూడా ఎక్కువైనారు ! దీక్షాధారులే కాక అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులతో కార్తీకమాసం నుండి శబరిమలకు వెళ్ళేదారులంతా జన సందోహంతో నిండి వుంటుంది !.......
స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప...
L. రాజేశ్వర్