Online Puja Services

గొప్ప సంఘ సంస్కర్త రాజమాత అహల్యాబాయి హోల్కర్

3.14.132.43
గొప్ప సంఘ సంస్కర్త 
రాజమాత అహల్యాబాయి హోల్కర్ 
 
 
క్రీ.శ 1754..మాల్వా ప్రాంతం. 29 సంవత్సరాల యువతి యుద్ధంలో చనిపోయిన తన భర్త చితిపై చేరి సతీసహగమనం చేసేందుకు తయారవుతుంది. ఇంతలో తన ఐదేళ్ళ కొడుకు అమ్మా అంటుా కాళ్ళు చుట్టుకున్నాడు. అమ్మా అన్న ఆ పిలుపు ఆమె హృదయాన్ని తాకింది. వెంటనే తన కాళ్ళు చుట్టుకున్న కొడుకును క్రిందకు వంగి పైకెత్తుకొని గుండెలకు హత్తుకుంది. మాతృప్రేమ సహగమనం వద్దంటుంది. కానీ ఆచారం?? "బేటీ" అనే పిలుపుతో తలెత్తి చూసిందామె. తన మామ ఖిన్నమైన మొహంతో కన్నీరు కార్చుతూ నిలబడి వున్నాడు. బిడ్డను దించి మామకు రెండుచేతులతో నమస్కరించిందామె.
 
వణుకుతున్న గద్గద కంఠంతో "బేటీ" నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళవద్దమ్మా "అంటూ పలికాడు మామ. మరి ఆచారం పితాజీ అన్నదామె.ఆచారం పాటించాల్సిన అవసరంలేదు. నువ్వు నీ భర్తస్థానంలో రాజ్యపాలన సాగించు.నీ కొడుకు పెరిగి పెద్దయ్యేంత వరకు. నీకు యుద్ధ విద్యలు, రాజనీతి,పరిపాలనా నేర్పు నేను నేర్పిస్తాను అన్నాడతడు. మామ మాటకు ఆలోచిస్తూ కొడుకు వంక చూసింది. అమాయకంగా తన వంకే చూస్తున్నాడు వాడు. తల్లిప్రేమ తన్నుకొచ్చింది. బిడ్డను కౌగిలించుకుంటూ నా బిడ్డ కోసమైనా నా సతి ధర్మాన్ని వదులుకుంటానంది ఆమె.
 
ఆమెకు గుర్రం స్వారీ, యుద్ధనైపుణ్యాలూ, వ్యూహాలు,పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలు నేర్పాడతను. 1766 లో కొడుకు, 1767 లో మామ చనిపోవడంతో ప్రజల కోరిక ప్రకారం సింహాసనం ఎక్కింది. 1767వ సంవత్సరం నుండి 1795వ సంవత్సరం వరకు ఆమె ఇండోర్ రాజ్యాన్ని పరిపాలించారు. ఆమె రాణికావడం ఇష్టం లేని మరాఠా సుబేదార్లు తిరుగుబాటు చేయగా చాకచక్యంగా అణిచివేసింది. నర్మదా నది ఒడ్డున మల్లేశ్వరం అనే ధృడమైన రాజధానిని నిర్మించింది. మధ్యభారత మాళ్వా ప్రాంతాన్ని మహేశ్వర్ రాజధానిగా శాంతి సౌభాగ్యాలతో పరిపాలించారు.అప్పటి వరకు వున్న స్త్రీల "పరదా" పద్దతి రద్దుచేసింది.  యుధ్ధవిద్యలలో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను ఏర్పరిచారు. వితంతువులకు భర్త ఆస్తి సంక్రమించేలా చేశారు. రాజ్యంలో విద్యాలయాలు స్థాపించి వాటి నిర్వహణకు మాన్యాలను ఏర్పాటుచేసింది. చెరువులు,కాల్వలు త్రవ్వించి వ్యవసాయాభివృద్ధికి బాటలు వేసింది. భారత ప్రసిద్ధిచెందిన మల్లీశ్వరం చీరలు ఈమె కాలంలోనే ప్రారంభించబడింది. 
 
పరిపాలనా సమయంలో ఈవిడ సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారు. ఆమె శివుని భక్తురాలు. మధ్యభారత మాళ్వా ప్రాంతాంలోనే కాక భారతదేశమంతటా శివాలయాలు నిర్మించారు. మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునర్నిమించారు. కాశీ, ద్వారక, మథుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్ ఇలా అనేక పుణ్యక్షేత్రాలలోని అలయాలను పునరుద్దించారు.10 జ్యోతిర్లింగాలను నిర్మించింది. ప్రసిద్ధి చెందిన సోమేశ్వర దేవాలయాన్ని పునర్మించింది.
 
ఇంతకీ ఈమె ఎవరో తెలుసా???
భారతదేశచరిత్రలోనే 18వ శతాబ్ధంలో అత్యంత శక్తివంతురాలైన పరిపాలకురాలిగా పేరుగాంచిన "రాజమాత అహల్యాబాయి హోల్కర్ !! మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి. 
 
అహల్యా బాయి హోల్కర్, 1725వ సంవత్సరం ఔరంగాబాద్ జిల్లా చౌండి గ్రామపెద్ద మంకోజీ షిండే దంపతులకు జన్మించింది. 1735వ సంవత్సరంలో తన పదవ ఏట మరాఠా సర్దార్లలో ప్రముఖుడైన మల్హర్ రావ్ హోల్కర్ ఏకైక కుమారుడు ఖండే రావు హోల్కర్ తో అహల్యా బాయి వివాహం జరిగింది.ఈ సమయంలో ఇండోర్ పాలకుడిగా మరాఠా సర్దార్లలో ప్రముఖుడిగా మల్హర్ రావ్ వెలుగొందుతున్నాడు. 1754వ సంవత్సరం కుంభేర్ కోట ముట్టడి సమయంలో ఖండే రావు మృతిచెందాడు. సతీ సహగమనానికి ఉపక్రమించిన అహల్యా బాయిని మల్హర్ రావ్ అడ్డుకున్నాడు.
 
పదేళ్ళకే భార్య అయి, 29 ఏళ్ళకే విధవరాలై, ఆచారాలను ధిక్కరించి ప్రజలశ్రేయస్సు కోసం అహర్నిశలూ పాటుపడిన ధీరవనిత. ఆమె కట్టించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా వున్నాయి. "బాహుబలి" లోని మహీష్మతీ సామ్రాజ్యమే ఈ మహేశ్వరం. రాజమౌళీగారు ఈ మహేశ్వరం కట్టడానినే తన సినిమాకు నమూనాలుగా వాడారు. భారతదేశ సంస్కృతికి వీరు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం వీరి పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పారు. ఇండోర్లోని విమానాశ్రయానికి దేవి అహల్యా బాయి హోల్కర్ విమానాశ్రయంగా నామకరణం చేశారు. తెలుగు సాహిత్యంలో అహల్యాబాయి జీవితాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం నవలగా మలచగా 1958 నాటి 10వ తరగతి విద్యార్థులకు ఉపవాచకంగా ఆ చారిత్రిక నవలను సంక్షిప్తీకరించారు. 
 
మంచి పరిపాలనాదక్షకురాలిగా, సామ్రాజ్య నిర్మాతగా, ఆలయాల నిర్మాతగా, పరమభక్తురాలిగా స్త్రీ శక్తిని దేశ నలుమూలలా చాటిన అహల్యాబాయి గారి  జ్ఞాపకార్థం ఈ చిన్నవ్యాసం . 
 
- సేకరణ 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore