జ్ఞానశిశువు
శ్రీరమణమహర్షి
* * *
* * *
తాను సకలాన్ని చూస్తున్నాడు.
కానీ చూసే తనను చూడలేకున్నాడు.
తనను చూడడమే దైవాన్ని చూడడం.
అంతేగాని తనకు వెలిగా ఏదో రూపంలో కనబడేది కాదు దైవదర్శనం అంటే.
తనకు వెలిగా కనబడే ఎంత గొప్ప దృశ్యమైనా, దేవుడైనా అదంతా నీ మానసిక దర్శనమే.
అంటే స్వప్నంలో తోచే రూపాల్లాంటివే.
స్వప్నప్రపంచం నీ మనో వైచిత్ర్యమే కదా!
అలాంటిదే ఈ మెలకువలో కనబడే యావత్తు దృశ్యం కూడా.
చూచేవానికన్నా 'దైవం' మరొకరు లేరు.
చూడబడేదానికన్నా 'మాయ' మరొకటి లేదు.
అంటారు గురుదేవులు.
ఈ ఒక్కమాట గుర్తులో ఉంచుకుంటే....
నిన్ను ఏ దృశ్యమూ ఇబ్బంది పెట్టదు.
(నీ తనువు కూడా దృశ్యంలో భాగమే)
ఈ తనువు నీవు కాదు, ఈ తనువు అనేది దృశ్యంలో నీకు అతి దగ్గరగా ఉన్న ఓ భాగం మాత్రమే.
రైలులో తనతో చాలా మంది ప్రయాణిస్తుంటారు.
కానీ తన ప్రక్కనే కూర్చొని ఉన్న తోటి ప్రయాణికునితోనే పరిచయం పెంచుకుంటాం. అతని స్టేషన్ రాగానే దిగివెళ్లిపోయేటప్పుడు బాధపడతాం.
అలాంటి పరిచయమే తనకు తన తనువుతో ఉండేది.
ఉన్నంతకాలం ఉండి, దాని సమయం రాగానే అది తనను విడిచిపెట్టేస్తుంది.
కానీ 'తాను' సదా ఉంటాడు.
ఆ సదా ఉన్న 'ద్రష్ట' యే 'నేను'(దైవం).
దైవం లేక తానూ(వ్యక్తి) లేడు, జగత్తూ లేదు.
ఆ ద్రష్టలో నుంచి ప్రసరించే దృశ్యమంతా(ప్రపంచమంతా) మాయ.
కాబట్టి అహమిక మూలానికెళ్లి హృదయపీఠంపై నిలిస్తే ఆత్మసామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తివి నీవే అవుతావు.