ఏది అసలైన ముక్తి.....!?
శంకరులు, "సౌందర్యలహరి" లోని 22వ శ్లోకాన్ని, ముక్తి విషయాన్ని ప్రస్తావిస్తూ , ఇలా రచించారు,
భవాని త్వం దాసే - మయి వితర దృష్టిం సకరుణా మితి స్తోతుం వాంఛన్- కథయతిభవాని త్వమితియః
తదైవ త్వం త స్మై - దిశసి నిజసాయుజ్యపదవీం
ముకుంద భ్రహ్మేంద్ర - స్ఫుటమకుటనీరాజితపదామ్
"భవాని త్వం" అనగా...!?,
'భవాని' అన్న శబ్దమును, నామవాచకముగా గ్రహిస్తే, భవుని రాణి భవాని. అయితే, ఈ శబ్దమునకు సంస్కృత వ్యాకరణ ప్రకారముగా మరొక అర్ధం స్పురిస్తుంది. 'భూ' ధాతువు యొక్క 'లోట్' ఉత్తమ పురుషలో ఏకవచన క్రియా పదముగా తీసుకుంటే, "భవాని త్వం" అన్న శబ్దములకు "నేను నీవు అవుతాను గాక" అనే అర్థం వస్తుంది. శంకరులు చేసిన ఈ పద ప్రయోగం, సాయుజ్య ముక్తిని సూచిస్తున్నది. శ్రీ కనకదుర్గా మాత యొక్క కరుణా విశేషాన్ని వివరిస్తున్నారు శంకరులు ఈ శ్లోకంలో.
సాధకుడు అమ్మవారిని తనను అనుగ్రహించాలని కోరుతూ స్తోత్రము చేయాలనుకున్నాడు.
కానీ, సాధకుడు "భవాని త్వం" అనగానే, అమ్మవారు ఆ సాధకుడికి సాయుజ్య ముక్తిని ప్రసాదించేస్తుంది అన్నారు శంకరులు ఈ శ్లోకంలో.
గుర్తు పెట్టుకోవాలి. అలా జరిగేది మనకు కాదు..!! సాధకుడికి మాత్రమే !!. మనకు కూడా అలాంటి అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే సాధన చేయవలసి ఉంది. "భవాని త్వం" అనేది నోటి మాట అయితే, ఏమీ ప్రయోజనము లేదు. అదే ఆర్తి మరియు భక్తితో కూడిన ఆత్మ మాట అయితే, తక్షణమే అమ్మవారు అలానే అనుగ్రహిస్తారు. అన్ని మతాలు దేవుడిని విశ్వసిస్తున్నాయి. అయితే, ఆ మతాలు ఎంతవరకు చెబుతున్నాయి అంటే, పుణ్యం (virtue/good deeds) చేస్తే, heaven opens, స్వర్గానికి పోతాము, పాపము (sin) చేస్తే,(go to hell) నరకానికి పోతాము.
భారతీయ సనాతన ధర్మము, హిందూమతము మాత్రమే స్వర్గమునకు, మరియూ నరకమునకు, మించి మరియొకటి ఉన్నది అని చెప్పగలిగింది.
అదే ముక్తి లేక మోక్షము.
అదే పరమం (ultimate).
మోక్షము నాలుగు విధములు.
1) సాలోక్య ముక్తి అనగా అమ్మవారి లోకమైన మణిద్వీపము చేరి అక్కడ నివసించడం. ఇది కూడా మనకు సురక్షితం కాదు. అక్కడికి పోయిన వాళ్ళు కూడా తప్పులు చేసి వెనక్కు వచ్చారని శ్రీ దేవీభాగవతము మరియూ అష్టాదశ పురాణములలో అనేక కథలు ఉన్నాయి.
2) సారూప్య ముక్తి అనగా అమ్మవారి యొక్క సమాన రూపాన్ని పొందటము. ఇది కూడా మనకు పైన చెప్పిన కారణం వల్ల సురక్షితం కాదు.
3) సామీప్య ముక్తి అనగా అమ్మవారి సన్నిధికి చేరటం. అమ్మవారి లోకమైన మణిద్వీపమునకు చేరడము వేరు, ఆలోకములో అమ్మవారి సమీపమునకు చేరటం వేరు. ఇది కూడా మనము నిలబెట్టుకుంటే నిలుస్తుంది.
4) సాయుజ్య ముక్తి అనగా పరబ్రహ్మములో ఏకమై పోవటం. ఈ ముక్తియే, పరమమునకే, పరం. (ulmately ultimate).
సాయుజ్య ముక్తిని పొందిన వారిని, ఇంక ఎవరూ ఏమీ చేయలేరు..!! ఇంక వాడు పడిపోవటం అంటూ ఉండదు. ఒక బిందువు, సింధువులో(సముద్రంలో) కలిసి పోయింది. ఇక ఆ బిందువుని ఎలా పట్టుకుంటాము.
అలా బిందువైన మనలను, సింధువైన శ్రీ కనకదుర్గా మాతతో ఏకం చేసి సాయుజ్య ముక్తిని ప్రసాదించ గలిగినది, శ్రీ లలితా సహస్రనామ సాధన మాత్రమే.
శ్రీ శంకర భగవత్పాద విరచిత
సౌందర్య లహరి.
సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది.
శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే
-
శివకుమార్ రాయసం