Online Puja Services

బంధాలు-బాంధవ్యాలు

3.140.243.22
మనిషి జీవితంలో జన్మనిచ్చిన తల్లి, తండ్రి, తోడబుట్టిన అన్న, తమ్ముడు, జీవితం పంచుకునే భార్య, వారసులైన కొడుకులు, కూతుళ్ళు, –ఇలా ఎందఱో బంధువులు తారసపడతారు.
 
వీరందరూ ఎల్లప్పుడూ తనతో ఉంటారని, కష్ట సుఖాల్లో తోడు వస్తారని భావించడం మానవ సహజం.
 
కానీ ఈ బంధాలు అన్ని శాశ్వతం కాదు అని, మనకు జీవితంలోను, తరువాత కూడా తోడు వచ్చే బంధువులు ఎవరో, వారి గురించి చాణక్యుడు ఒక చిన్న శ్లోకంలో ఎంతో చక్కగా వివరించాడు.
 
సత్యం మాతా, పితా జ్ఞానం, ధర్మో భ్రాతా, దయా సఖా
 
శాంతి: పత్నీ, క్షమా పుత్రా: షఢెతె మమ బాంధవా:
 
సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయా స్నేహితుడు, శాంతి భార్య, వోర్పే పుత్రుడు. ఈ ఆరే మానవునకు నిజమైన బంధువులు అని అర్ధం.
 
ఏ జీవికైన జన్మనిచ్చేది తల్లి. తల్లి స్థానం మారదు. ఎటువంటి పరిస్థితులలో  నైనా, తల్లి ప్రేమ మారదు. అలాగే, సత్యం ఒక్కటే. అది ఎన్నటికి, మారదు.
 
జ్ఞానం తండ్రి. తండ్రి ఎలాగైతే విద్యా బుద్ధులు నేర్పించి జీవించె ఉపాయాలు నేర్పడం ద్వార, సుఖవంతమైన జీవితానికి మార్గదర్శకుడు అవుతున్నాడో, జ్ఞానం కూడా మనిషికి సంతోషంగా జీవించడం నేర్పుతుంది. మనిషి పురోగతికి మూలం జ్ఞానమే.
 
సోదరుడు ఎలాగైతే ఎప్పుడు అండగా నిలుస్తాడో, తోడుగా ఉండి, అభివృద్ధికి బాటలు వేస్తాడో, అలాగే ధర్మం ఎప్పుడు మనిషికి వెంట నుండి ఆత్మీయతను, అనురాగాన్ని పంచి, ధర్మాన్ని పాటించిన వాడికి అమృత ఫలాలను అందిస్తుంది.
 
దయ మిత్రుని లాంటిది. మిత్రుని వలే మంచి చెడులను ప్రభోదిస్తుంది.
 
శాంతి భార్య వంటిది. భార్య సుగుణ శీలి అయితే, ఆ మనిషి జీవితం పూలపాన్పు లాగా ఉంటుంది. 
 
భార్య గయ్యాళి అయితే ఆ మనిషి జీవితం నరక ప్రాయం ఔతుంది. 
 
అలాగే జీవితంలో శాంతి ఉన్నవాడికి ఇంక ఏ లోటు ఉండదు. శాంతిని అలవరచుకోని మనిషి జీవితం నరకంతో సమానం.
 
ఓర్పు పుత్రునిలాంటిది. పుత్రుడు ఎలాగైతే నరకం నుండి రక్షిస్తాడు అని నమ్ముతామో, అలాగే ఓర్పు ఉన్న వ్యక్తి యొక్క జీవితం స్వర్గాతుల్యమే.
 
పై శ్లోకం ద్వారా చాణక్యుడు ఒక మనిషి తన జీవితంలో బంధువులు ఎంత ముఖ్యం అని అనుకుంటాడో, అంతకన్నా, సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, ఓర్పు అనే ఆరు గుణాలు అంతే ముఖ్యం అని చెప్తాడు.. 
 
ఊహ తెలిసిన దగ్గరనుంచి, మరణించే వరకు ఎలాగైతే బంధువులను వీడి పోలేమో, అలాగే ఈ ఆరు గుణాలను ఆజన్మాంతం పాటించాలి అని ఉపదేశించాడు.
 

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya