Online Puja Services

విద్య గురుముఖతః నేర్చుకోవాలి

18.218.145.54
విద్య గురుముఖతః నేర్చుకోవాలి
     (ఈ కథ అరణ్యపర్వము లోనిది)
 
 
పూర్వం భరద్వాజుడు అని మహర్షి ఉండేవాడు. ఆయనకు ప్రాణ స్నేహితుడు రైభ్యుడు.  వారిరువురు సూర్యోదయానికి ముందుగానే లేచి కాలకృత్యాలు ముగించి, నదీస్నానం చేసి, నిర్మల చిత్తంతో పరబ్రహ్మ ధ్యానం చేసుకుంటూ అడవిలో దొరికే ఫలాలతో జీవయాత్ర సాగించే వారు.  
 
అలా ఉండగా వారిలో భరద్వాజునికి యవక్రీతుడు అనే కుమారుడు కలిగాడు. రైభ్యునికి  ఆర్యావసువు, పరావసువు అని ఇద్దరు కుమారులు పుట్టారు.  వారు పెరిగి పెద్దవారు అయ్యారు. 
 
భరద్వాజుడు ఎప్పుడూ ధ్యాన సమాధిలో ఉండి,  కుమారుని విద్యావిషయాలు పట్టించుకోలేదు. రైభ్యుడు తన కుమారులిద్దరినీ విద్వాంసులుగా తీర్చి దిద్దుకున్నాడు.
 
వారుభయులూ వివిధ ప్రాంతాలలో పర్యటించి తమ విద్యతో అందరి ప్రశంసలూ పొందుతున్నారు. ఇది చూసిన యవక్రీతునికి విచారం కలిగి, వారి వలే తాను కూడా విద్యావంతుడై విశేషఖ్యాతి సంపాదించాలనుకున్నాడు. అదే ఊహతో తపస్సు ప్రారంభించాడు. యవక్రీతుని తీవ్రనిష్ఠను  గ్రహించి దేవేంద్రుడు వచ్చి,  
 
"స్వామీ! విద్య అనేది గురుముఖతః అధ్యయనం చేయక తప్పదు.  అప్పుడుకానీ వేద వేదాంగ విజ్ఞానంతో మనసు పరిపక్వం కాదు. ఈ ప్రయత్నంమాని  ఉత్తమ గురువును ఆశ్రయించు" అన్నాడు.  ఆ మాట యవక్రీతునికి నచ్చలేదు.  తపస్సు చేస్తూనే ఉన్నాడు.  ఉచిత రీతిని వీనికి ఉపదేశించాలని ఇంద్రుడు ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి, గుప్పెడుతో ఇసుక తీసి  నదిలో పోస్తున్నాడు.  యవక్రీతుడు నదీ స్నానానికి వచ్చి, ఏమిటీ పని?  ఎందుకు చేస్తున్నావు?  అని అడిగాడు. వృద్ధుడు నవ్వుతూ  "ఈ నదికి అడ్డంగా గోడ కడుతున్నాను" అన్నాడు. 
 
యవక్రీతుడు నవ్వి,  "ఇంతటి నదికి గుప్పెడు గుప్పెడు  ఇసుకతో  గోడకట్టడం ఈ జీవితంలో సాధ్యమా!"  అన్నాడు.
 
అప్పుడా వృద్ధుడు, నాయనా!  గురుశుశ్రూష లేకుండా వేద విద్య అంతా నేర్చుకోవాలనుకోవడం కంటే, నేను చేసేది అవివేకం కాదు అని జవాబు ఇచ్చాడు.
 
ఓహో!  సురపతీ!  మీరు ఎలా అయినా సరే నాకు వేదవిద్య అనుగ్రహించి విశేషఖ్యాతి కలిగించాలి అని ప్రార్థించాడు.  ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదని ఇంద్రుడు అనుగ్రహించాడు.  
 
యువక్రీతుడు సర్వవేదశాస్త్ర విద్యావిదుడు అయ్యాడు. మరుక్షణంలో తపోదీక్ష విడిచి తండ్రి దగ్గరకు వచ్చి జరిగిన విషయాలన్నీ వివరించాడు.  
 
అప్పుడు భరద్వాజుడు,  నాయనా!  ఈ విధంగా విద్య సాధించడం వల్ల అది అహంకారం కలిగిస్తుంది.  అహంకారం ఆత్మనాశనకారణం, నాయనా! 
 
ఇంత చిన్న వయస్సులో తీవ్ర తపస్సు చేసి వరాలు పొందడం మరింత అహంకార హేతువు అవుతుంది.  అయినా ఒక మాట విను,  నీవు ఎప్పుడు రైభ్యుని ఆశ్రమ పరిసరాలకు వెళ్ళిబోకు.  ఆయన కుమారులతో వైరం తెచ్చుకోకు అన్నాడు.  
 
యవక్రీతుడు వివిధ ప్రదేశాలు పర్యటించాడు.  
 
అలా ఉండగా ఒకనాడు అది వసంతమాసం.  పూల వాసనలతో ప్రకృతి పరమరమణీయంగా, ఉల్లాసకరంగా ఉంది.  అటువంటి సమయంలో యవక్రీతుడు రైభ్యుని ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు.  ఆశ్రమంలో ఆ మహర్షి కోడలు ఒంటరిగా కనిపించింది.  యవక్రీతుడికి మనసు చెదిరింది.  ఇంద్రియాలు వశం తప్పిపోగా, ఆ ఇల్లాలిని బలాత్కరించి భోగించి వెళ్ళిపోయాడు.  
 
ఆశ్రమానికి వచ్చిన రైభ్య మహాముని ఆ విషయం విని తీవ్ర క్రోధంతో, తన శిరస్సు నుండి రెండు జటలు తీసి, హోమం చేసి, ఒక సుందరాంగిని, ఒక రాక్షసుని సృష్టించాడు.  వారిద్దరూ ఆ మహర్షి ఆదేశం ప్రకారం యవక్రీతుని  సమీపించారు.
 
ఆ సుందరీమణి తన కోర చూపుతో, చిరునవ్వుతో, లావణ్య దేహ ప్రదర్శనతో యవక్రీతుని లొంగదీసి, వాని చేతిలోని పవిత్ర జలపూర్ణమైన కమండలువు తీసుకుని వెళ్ళిపోయింది. అంతతో అతని  శక్తి నశించగా, ఆ రాక్షసుడు తన శూలంతో యవక్రీతుని తరిమి పొడవబోయాడు. సరిగ్గా భరద్వాజుని ఆశ్రమం ద్వారం దగ్గరే వానిని సంహరించాడు. 
 
అది చూసి భరద్వాజుడు, "నాయనా! అనాయాసంగా, లభించిన విద్య ఇటువంటి అనర్ధాలే తెస్తుందని చెప్పినా విన్నావు కావు." అని గోలు గోలున విలపించి, ఆ తీవ్రవేదనలో రైభ్యుని శపించి, తానుకూడా అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేశాడు. శాపగ్రస్తుడైన రైభ్యుడు ఆయన కుమారుని చేతులలోనే మరణించాడు.
 
అప్పుడు ఆర్యావసువు సూర్యుని ఉపాసించి, తన తండ్రిని, భరద్వాజ యువక్రీతులను బతికించాడు.
 
పునరుజ్జీవితుడైన యవక్రీతుడు, తన ఎదురుగా ఉన్న దేవతలను ఉద్దేశించి;,  "నేను కూడా ఈ రైభ్యుని వలెనే  తపస్సు చేసి, వేద వేత్తను అయ్యాను కదా!  అయినా ఈయన నా కంటే గొప్పవాడు ఎలా అయ్యాడు!"  అనగా దేవతలు.....,  
 
నాయనా!  ఆయన గురు శుశ్రూషక్లేశాలతో వేదవిద్యను సాధించాడు. కనుక అంత శక్తిశాలి అయ్యాడు.  అది లేకుండా నువ్వు సాధించావు. ఆ శక్తి నీకు రాదు.  "విద్య గురుముఖతః నేర్చుకోవాలి" నాయనా!  అని వారు వెళ్ళిపోయారు
 

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya