నమస్కార ప్రియుడు :
సూర్యోపాసనలో మరో ముఖ్యమైన అంశం సూర్య నమస్కారాలు.
‘నమస్కార ప్రియో భానుః.. అభిషేక ప్రియో శివః’ అంటుంది వేదం. అంటే పరమ శివుడు అభిషేక ప్రియుడైతే.. సూర్యుడు నమస్కార ప్రియుడన్నమాట. సూర్యోదయ సమయంలో.. భానుడి కిరణాలు నేరుగా శరీరానికి తాకే విధంగా సాగించే యోగ ప్రక్రియ మనసును, శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది. యోగ సాధనలో సూర్యనమస్కారాలకు అంత్యంత ప్రాధాన్యం ఉంటుంది.
సూర్యభగవానుడి ఆరాధనలో విశేషమైనది ఆదిత్య హృదయ స్తోత్రం. రామాయణానుసారం రావణుడితో యుద్ధం చేస్తూ అలసిన శ్రీరాముడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించాడట. త్రికరణ శుద్ధితో సూర్యుణ్ని ఉపాసించిన రాముడు మనోబల సంపన్నుడై.. రణంలో రావణుడిని సంహరించాడు.
‘‘భానో భాస్కర మార్తాండ చండరశ్మే దివాకర!
ఆరోగ్యమాయుర్విజయం శ్రియఃమోక్షంచ దేహిమే!!’’ అనే సూర్య మంత్రాన్ని అనుసరించి సూర్యోపాసన ఆరోగ్యం, ఆయుర్దాయం, విజయం, మేధాశక్తిని ప్రసాదిస్తుంది.
- డా।। పార్నంది రామకృష్ణ