Online Puja Services

దైవంతో అనుబంధం

52.14.209.100
దైవంతో అనుబంధం
 
భగవంతుడితో మనలో చాలామందికి వ్యాపారబంధమే తప్ప ప్రేమానుబంధం లేదు. సాధారణంగా మన మొక్కులన్నీ ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలోనే సాగుతుంటాయి.
 
‘నా ఈ కోరిక తీరిస్తే నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతాను. ఈ కానుకలిస్తాను. ఈ పూజలు చేయిస్తాను...’- ఇలా ఉంటాయి మనలో చాలామంది దైవ వ్యవహారాలు.
 
భగవంతుడితో నవవిధ భక్తులనే తొమ్మిదిరకాల అనుబంధానికి ఆస్కారం ఉంది. వాటిలో ఏ ఒక్క అనుబంధం దృఢంగా ఉన్నా ఆయన మనల్ని వదలడు. లేకపోతే... మనకు దొరకడు. భగవంతుడు సర్వేశ్వరుడనే విశ్వాసం ఉంటేనే చాలదు. మనం చేసే యాంత్రిక పూజలూ వాటంతటవే అక్కరకు రావు.
 
దైవాన్ని తండ్రిగా ఆరాధిస్తే మనం ఒక మంచిబిడ్డగా జీవించాలి. ఆయన్ను ఏ రూపంలో ఆరాధించినా ఈ పద్ధతి పాటించాలి. దైవకుమారుడినని చెప్పుకొన్న ఏసు తన జీవన విధానం ద్వారా దైవగౌరవం పొందాడు. శ్రీరామ పాదసేవకుడిగా ఉన్న ఆంజనేయుడు భక్తుడిగాను, దేవుడిగాను పూజలందుకుంటున్నాడు.
 
సంకీర్తనలతో అన్నమయ్య, త్యాగయ్యలు దైవాన్ని మెప్పించి, తమ సన్నిధికి రప్పించుకొన్నారు. తులసీదాసు తన ‘రామచరితమానస్‌’ ద్వారా శ్రీరాముడి మనసు దోచాడు. మూఢభక్తితో కన్నప్ప తన రెండు నేత్రాలను శివుడికి సమర్పించి దివ్యసాక్షాత్కారం పొందాడు. తన శరీరంలోని భాగాలనే రుద్రవీణగా చేసి రావణుడు ముక్కంటిని మెప్పించాడు.
 
సుదీర్ఘమైన కాలవాహినిలో ఎందరో భక్తులు పూజాపుష్పాల్లా తేలియాడి, పరమాత్మలో లయించిపోయారు. వారు ఇప్పుడు లేరు. కానీ, వారి గాథలు శిలాక్షరాల్లా నిలిచి ఉన్నాయి.
 
ఈ గాథలన్నీ భగవంతుడితో మన అనుబంధం ఎలా ఉండాలో చెబుతాయి. నిత్యమూ లక్షల సంఖ్యలో ప్రజలు దేవాలయాలను దర్శించుకుంటూ ఉంటారు. భగవంతుడికి వారు ఏమి ఇస్తున్నారు, ఏమి తీసుకెళ్తున్నారు? కోరికల జాబితా ఇస్తున్నారు. తమ కోరికలు తప్పక నెరవేరతాయనే గట్టి నమ్మకాన్ని వెంట తీసుకువెళ్తున్నారు. అంతే!
 
దీన్ని దైవంతో అనుబంధమని ఎలా చెప్పగలం? ప్రాపంచిక బంధాలనే సంకెళ్లతో మనం భగవంతుడి ఎదుట నిలబడుతున్నాం. భక్తిపూర్వకంగానే అనుకుంటూ కనులు మూసి చేతులు జోడిస్తున్నాం. మనసు మెల్లిగా కోరికల జాబితా విప్పుతుంటుంది. దేవుడు మాటమాటకు, ప్రతి భక్తుడి బూటక భక్తికీ నవ్వలేక, శిలాదరహాసం వెలయిస్తాడు. ఆ మందహాస మర్మం మనకు అర్థంకాదు.
 
ఈ భ్రమాభరిత భక్తినాటకం నుంచి మనం బయటపడాలి. నిలువుదోపిడి ఇచ్చినట్లు, మనసునంతా ఖాళీ చేసి ఆయన పాదాలముందు గుమ్మరించాలి. కోరికలన్నీ శూన్యం చేసుకున్నట్లు, నీలాలు లేని తలతో నిలబడినట్లు ఆయన ఎదుట నిస్సహాయుడిగా, ‘నీవే దిక్కు’ అన్నట్లు చేతులు జోడించి నిలబడిపోవాలి. మనం దైవానుగ్రహం కోసం ఎంతగా నిరీక్షిస్తామో, భగవంతుడు మంచి భక్తుడి కోసం అలాగే ఎదురుచూస్తాడు.
 
పరిపక్వత చెందిన మనసే ఫలంగా కోరికలు లేని సమర్పణాభావాలు సుగంధ పుష్పాలుగా, సర్వలోక క్షేమమే మహత్వాకాంక్షగా నిర్మల నివేదనగా సమర్పించాలి.
 
అలా అతికొద్దిమంది మాత్రమే చేయగలరు.
 
ఆ కొద్దిమందిలో మనం ఎందుకుండకూడదు? తిరుమలలో ఒక గదినుంచి మరో గదికి వెళ్తూ చివరికి స్వామి దివ్య సన్నిధికి చేరుకుంటాం. మన మనసు అనుక్షణమూ అన్నమయ్య ఆర్తిని అనుభవిస్తూ దైవంతో అనుబంధానికి తపించాలి. వెన్న తినే వేలుపు ఆయన.  వెంటనే మన ఆర్తికి కరిగిపోతాడు. తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చినట్లు భావించి ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటాడు.
 
అదే అసలైన అనుబంధం!
 
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore