పితృయజ్ఞాలు ఎందుకు చేయాలి?పితృదేవతారాధనా రహస్యాలు
ప్రపంచంలోని అన్ని సుఖాలు అనుభవించడానికి కారణమైన శరీరాన్ని ఇచ్చిన తల్లి తండ్రులను అర్చించకపోతే ఏంజరుగుతుంది?
శ్రద్ధగా అర్చిస్తే ఏం లభిస్తాయి?
ఇది మానవ జన్మ ఎత్తిన అంతా తెలుసుకోవాలి. ఏ కులంలో పుట్టినా, ప్రపంచంలోని ఏ మతానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఆడైనా మగైనా పితృదేవతల అనుగ్రహమో లేక ఆగ్రహమో తప్పించుకోలేరు. ఇదే సత్యం.
అమ్మానాన్నలకు కృతజ్ఞతలతో ఉండడం మానవుల కనీస ధర్మం. దీని వలన ఈ భూమి మీద, అనంతరం స్వర్గంలో కూడా సుఖభోగాలు లభిస్తాయి.
ఇదే విషయాన్ని స్మృతి చంద్రిక ఈ విధంగా చెబుతోంది.
శ్రాద్ధాత్పరతరం నాన్యచ్ఛేయస్కరముదాహృతమ్|
తస్మాత్సర్వప్రయత్నేన శ్రాద్ధం కుర్యాద్విచక్షణః ||
అరోగః ప్రకృతిస్థశ్చ చిరాయుః పుత్రపౌత్రవాన్|
అర్థవానర్థకామీ చ శ్రాద్ధకామో భవేదిహ ||
పరత్ర చ పరం తుష్టిం లోకాశ్చ వివిధాన్ శుభాన్|
శ్రాద్ధకృత్సమవాప్నోతి యశశ్చ విపులం నరః||
పితృయజ్ఞాలను మించినది, శ్రేయస్సు కలిగించే యజ్ఞం మరొకటి లేదు. కనుక అన్ని ప్రయత్నాలూ చేసి పితృదేవతార్చనలు చేసే తీరాలి.
ఆరోగ్యం, ఆయువు, పుత్ర సంతానం, మనుమలు కలగడం, ధనం లభించడం, ధనేతరమైనవి లభించాలనే కోరికలతో పితరులను అర్చించినందువల్ల వెంటనే అవి పొందవచ్చు. దేవతలు సర్వసంతుష్టులు అవుతారు.
యాజ్ఞవల్క్యుడు:
ఆయుః ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ|
ప్రయచ్ఛంతి తథా రాజ్యం ప్రీతా నృణాం పితామహః||
ఆయుస్సు, సంతానం, ధనం, విద్య, స్వర్గం, మోక్షం, సుఖం, రాజ్యం వంటివి పితృదేవతార్చనలతో పొందవచ్చని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.
యముడు:
యే యజన్తి పితౄన్ దేవాన్ బ్రాహ్మణాన్ సహుతాశనాన్|
సర్వభూతాంతరాత్మానం విష్ణుమేవ యజన్తి తే ||
ఆయుః పుత్రాన్ యశస్స్వర్గం కీర్తిం పుష్టిం బలం శ్రియం|
పశూన్ సుఖం ధనం ధాన్యం ప్రాప్నుయాత్పితృపూజనాత్||
ఎవరైతే పితరులను, దేవతలను, బ్రాహ్మణులను అగ్నిసహితంగా అర్చిస్తారో వారు విష్ణువును పూజించినట్లేనని సాక్షాత్తూ యముడు చెప్పాడు. అంతేకాక ధనం, ధాన్యం, కీర్తి, బలం, సంపదలు, పశుసంపదలు, సుఖం, బిడ్డలు, స్వర్గం కూడా కలుగుతాయని యముడు కుండబ్రద్దలు కొట్టిమరీ చెబుతున్నాడు.
పితృయజ్ఞాలు చెయ్యకపోతే ఏం జరుగుతుంది?
హారీతస్మృతి ఈ విధంగా చెబుతోంది.
న త్తర వీరా జాయన్తే నారోగా న శతాయుషః|
న చ శ్రేయోऽ ధిగచ్ఛన్తి యత్ర శ్రాద్ధం వివర్జితమ్ ||
ఆదిత్యపురాణం, బ్రహ్మపురాణం:
న శాన్తి పితరశ్చేతి కృత్వా మనసి యో నరః|
శ్రాద్ధం న కురుతే (మోహాత్) తత్ర తస్య రక్తం పిబన్తి తే||
ఎవరైతే పితరులను అర్చించరో వారికి నిత్య రోగాలు, అల్పాయువు, సకల క్లేశాలు, అశాంతి, మానసిక సమస్యలు, వ్యసనబానిసత్వం మాత్రమే కాక వారి రక్తం కూడా పీల్చివేతకుగురవుతారని ఆదిత్యపురాణం, బ్రహ్మపురాణం చెబుతున్నాయి.
సకల దేవతార్చనలలోకీ అమ్మానాన్నలను అర్చించడం అతితేలికైనపని. దీన్ని కేవలం ఏడాదికి మ్రొక్కుబడిగా ఒక్కసారి మాత్రమే చేయడం కాదు. ప్రతి రోజూ అర్చించాలని సనాతన ధర్మం శాసిస్తోంది. ఇందులోని విశేషం ఏమంటే ఎవరు ఎంత వరకూ చేస్తే అంతవరకూ ఫలం లభిస్తుంది. అన్య దేవతలను ఆరాధించిన దాని కన్నా ఎన్నో రెట్ల ఫలం వెంటనే వస్తుంది. అయితే దీని పై అనవసర అనుమానాలు రేపి ప్రజలను కర్మభ్రష్టులను కొందరు వాచాలకులు చేస్తున్నారు. వీరు శంకరాచార్యులవారు తన్ని తరిమిన చార్వాకులు కన్నా ప్రమాదరమైనవారు. ప్రవాచాలకులు. సంప్రదాయబోధకుల ముసుగులో ఉన్న రాక్షసులు. సనాతన ధర్మవిధ్వంసకులు. వీరిని జాగ్రత్తగా కనిపెట్టి దూరం చేయవలసిన బాధ్యత ప్రతీ హిందువుపైనా ఉన్నది.
నేడు 90 శాతం మందికి వస్తున్న కష్టాలకు కారణం తల్లితండ్రులను అర్చించకపోవడమే. కనుకనే ఆంధ్రవ్యాసుల వారు అన్ని కులమతప్రాంతలింగాలవారికీ సులభతరంగా నిత్య, నైమిత్తిక, కామ్యాది పితృపూజలు సులభతరం చేశారు. దీన్ని ఆడామగా వయోభేదం లేకుండా తల్లితండ్రులు సజీవులై ఉన్నవారు, పరమపదించినవారు కూడా చేయవచ్చు.
అమ్మానాన్నాలను ఎప్పుడు ఏవిధంగా సేవించాలో సనాతనధర్మం ఇలా చెప్పింది.
వారాల ప్రకారం ఫలాలు:
ఆదిత్యవారే త్వారోగ్యం చంద్రే సౌభాగ్యమేవ చ|
కౌజే సర్వత్ర విజయం సర్వాన్ కామాన్ బుధస్య తు ||
విద్యామభీష్టం జీవే తు ధనం వై భార్గవే పునః|
శనైశ్చరే లభేతాయుః ప్రతిపత్సు సుతాన్ శుభాన్ ||
అని కూర్మపురాణం కంఠోక్తిగా ఏ వారం నాడు అమ్మానాన్నలను సేవిస్తే ఏ ఫలం దక్కుతుందో చెబుతోంది.
1) ఆది వారం అమ్మానాన్నలను పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది. కనుక ఆరోగ్యం కావాలనుకునే వారు అమ్మానాన్నలను ఆదివారం అర్చించాలి.
2) సోమవారం పితరులను అర్చిస్తే సౌభాగ్యం కలుగుతుంది. అంటే ఆడవారు తమ అత్తమామలను, అమ్మానాన్నలను అర్చిస్తే సౌభాగ్యం కలుగుతుంది. మగవారు అర్చిస్తే సంపదలు కలుగుతాయి.
3) కుజవాసరం అంటే మంగళవారం నాడు అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకుంటే సర్వవిజయాలు సొంతం అవుతాయి.
4) బుధవారం అమ్మానాన్నలను పూజిస్తే సర్వకోరికలూ తీరుతాయి.
5) గురువారం తల్లితండ్రులను సేవిస్తే ఏ విద్య కావాలంటే ఆ విద్య సొంతం అవుతుంది.
6) ధనం కోరుకునేవారు శుక్రవారం పితరులను అర్చించాలి.
7) శనివారం అమ్మానాన్నలను అర్చిస్తే ఆయువు కలుగుతుంది.
దీని తరువాత ఏ నక్షత్రం నాడు అమ్మానాన్నలను పూజిస్తే ఏ ఫలం ద్రక్కుతుందో కూడా ఈ విధంగా మహాభారతం, కూర్మపురాణం చెబుతున్నాయి.
1)అశ్విని: వాహనాలు కావాలనుకున్న వారు అశ్వినీ నక్షత్రం ఉన్నప్పుడు తల్లి తండ్రుల సేవ చేయాలి.
2)భరణి: ఆయువు కావలసిన వారు భరణిలో అమ్మానాన్నలను అర్చించాలి.
3)కృత్తిక: అగ్నిసహితంగా కుమారునితో కలసి పితరులను కృత్తిక ఉన్నప్పుడు అర్చిస్తే రోగశోకాలు లేనివాడవుతాడు.
4)రోహిణి: సంతానం కావాలనుకున్నవారు తమ పితరులను రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు ప్రార్థించాలి.
5)మృగశిర: బ్రహ్మతేజస్సు కలుగుతుంది.
6)ఆర్ద్ర: శౌర్యం కావాలనుకున్నవారు ఆరుద్రా నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను పార్వతీపరమేశ్వరులుగా అర్చించాలి. అంటే పోలీసులు, సైన్యం, అగ్నిమాపకదళం, భద్రతాదళాలు, అంగరక్షకులు వంటి వృత్తులలోని వారు ఈ రోజు తమ తల్లితండ్రులను పూజించాలి. దీని వల్ల శూరత్వం కలిగి తమ శౌర్యవృత్తుల్లో రాణిస్తారు.
7)పునర్వసు: ధనం, భూమి కావాలనుకున్న వారు పునర్వసులో పెద్దలను సేవించాలి.
8)పుష్యమి: తాతముత్తాలను పుష్యమి నాడు సేవిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పుష్టికలుగుతుంది.
9)ఆశ్రేష: ఈ నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను ప్రసన్నం చేసుకుంటే ధీరులైన పుత్రసంతానం, సర్వ కోరికలూ తీర్చే కుమారులు కలుగుతారు.
10)మఖ: తన దాయాదులలో మేటి కావాలనుకున్న వారు మఖనాడు పితరుల అర్చన చేయాలి.
11)పుబ్బ: పాపనాశనం, సౌభాగ్యం పుబ్బ వల్ల కలుగుతాయి.
12)ఉత్తర: సంతానధనాలు ఉత్తరానక్షత్రం వల్ల కలుగుతాయి.
13)హస్త:తన కులంలో శ్రేష్ఠత్వం హస్తా నక్షత్రం ద్వారా పొందుతారు.
14)చిత్త: అందమైన కొడుకులు కావాలనుకున్న వారు చిత్తా నక్షత్రంలో పెద్దలను సేవిస్తే సౌందర్యంకల పుత్రులు అనేకం కలుగుతారు.
15)స్వాతి: వ్యాపారాల వృద్ధిని స్వాతి కలిగిస్తుంది. (ఉద్యోగాలలో వృద్ధి కూడా కలుగుతుంది.)
16)విశాఖ: స్వర్ణరజతాలు పొందవచ్చు. అలాగే అనేక మంది పుత్రులు విశాఖ నక్షత్రం నాడు అమ్మానాన్నలను సేవిస్తే కలుగుతాయి.
17)అనూరాధ: రాజ్యాధికారం, మంచి మిత్రులను అనూరాధ ద్వారా పొందవచ్చు.
18)జ్యేష్ఠ: సర్వసమృద్ధి, కోరుకున్న రంగంలో అధిపతి కావాలంటే జ్యేష్ఠా నక్షత్రంలో పితరుల అర్చన చేయాలి.
19)మూల: ఆరోగ్యం, చేసే కృషి ఫలించాలంటే మూలా నక్షత్రంలో అమ్మానాన్నలకు మ్రొక్కాలి.
20)పూర్వాషాఢ: సమృద్దీ కీర్తిప్రతిష్ఠలు కలుగడానికి పూర్వాషాఢలోని పితృదేవతార్చన తోడుపడుతుంది.
21)ఉత్తరాషాఢ: నిశ్శోకవంతుడు, శుభగృహం (మంచి ఇల్లు) పొందాలి అంటే ఉత్తరాషాఢలో తాతముత్తాల ఆశీర్వచనాలు పొందాలి.
22)శ్రవణం: బ్రతికినన్నాళ్ళూ శ్రేష్ఠత్వం అనంతరం స్వర్గప్రాప్తి శ్రవణం నాటి మాతాపితరుల సేవ కలిగిస్తుంది.
23)ధనిష్ఠ: రాజ్యప్రాప్తి. నేడు రాజకీయాల్లో రాణించాలనుకున్న వారు ధనిష్ఠ నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను సేవించాలి. వారికి పదవీయోగం కలుగుతుంది.
24)శతభిషం:వైద్యులు హస్తవాసి కోసం అమ్మానాన్నలను శతభిష నక్షత్రం ఉన్న సమయంలో అర్చించాలి. మహాబలవంతులు అవుతారు.
25)పూర్వాభాద్ర: మేకలు గొర్రెలు వంటివి పొందవచ్చు. అంటే యానిమల్ హజ్బెండరీస్ కు చెందిన వారు పూర్వాభాద్రలో పితరులను అర్చించాలి. అలా అర్చిస్తే వారి అనుగ్రహంతో పశువుల మందలు వృద్ధిపొందుతాయి. అంటే ఇవి వ్యవసాయప్రధానులైన శూద్రవైశ్యులకు కూడా ఇవి చెప్పారని తెలుసుకోవాలి.
26)ఉత్తరాభాద్ర: గోసంపద వృద్ధి అవుతుంది.
27)రేవతి: వెండి బంగారం తప్ప ఇతర వజ్రవైఢూర్యాదులు పొందాలంటే రేవతిలో అమ్మానాన్నల ఆశీర్వాదాలు పొందాలి.
ఈ విధంగా ఏ నక్షత్రంలో పితృదేవతార్చన చేస్తే ఏ కోరికలు తీరుతాయో తెలుసుకున్న తరువాత, ఇక ఏ తిథి నాడు పితరుల అర్చన చేస్తే ఏ ఫలాలు దొరుకుతాయో చూద్దాం.
ఏ తిథినాడు పితృదేవతల అర్చన చేయాలి? ఏ కోరికలు తీరతాయి అనేది మహాభారతం స్పష్టంగా చెబుతోంది.
ధర్మరాజు అడిగిన మీదట భీష్ముడు ఈ రహస్యాలు చెప్పాడు.
1) ‘‘పితౄన్ పూజ్యదితః పశ్చాత్ దేవతాస్తర్పయంతి వై|
తస్మాత్ తాన్ సర్వయజ్ఞేన పురుషః పూజయేత్ సదా||
ముందుగా పితరులను పూజించి తరువాతే దేవతలను పూజించాలి‘‘ అనే మొదటి రహస్యాన్ని చెప్పారు.
కనుక అన్ని యజ్ఞాలు, పుణ్యకార్యాలలోనూ ముందుగా పితరులను పూజించాలని కుండబ్రద్దలు కొట్టి భీష్ముడు చెప్పాడు.
2) ‘‘ధన్యం యశస్యం పుత్రీయం పితృయజ్ఞం పరంతప‘‘
ఈ పితృయజ్ఞాలు పరమశుభకరం. ధనాన్నీ, కీర్తినీ, పుత్రులనూ కలిగిస్తాయని మహానుభావుడు భీష్ముడు చెప్పాడు.
3) ప్రతి పాడ్యమి నాడు పితరులను అర్చిస్తే మంచి ఇల్లు, అనుకూలవతి, అందమైన భార్య లభిస్తుంది. ఆమెకు బహుసంతానం కలుగుతుంది.
4) కుమార్తెలు కావాలనుకున్నవారు విదియనాడు పితరులను అర్చించాలి.
5) గుర్రాలు (వాహనాలు) కావాలనుకున్నవారు తమ తల్లితండ్రులను తృతీయనాడు అర్చించాలి.
6) చవితినాడు అమ్మా నాన్నలను అర్చిస్తే ఇంటిలోని కోడి, మేక, గొర్రె వంటి సంపదలు అభివృద్ధి అవుతాయి. దీనిని బట్టీ మాతాపితరుల అర్చన కేవలం కొన్ని కులాలకే పరిమితం కాదని గ్రహించాలి.
7) పుత్రసంతానం కావాలనుకున్నవారు ప్రతీ పంచమి నాడు పితరులను అర్చించాలి.
8) తేజస్సు, ఆకర్షణీయమైన దేహం కావాలనుకున్నవారు (నటీనటులు, చర్మబాహ్యసౌందర్యం ద్వారా వృత్తులలో ఉన్నవారు) షష్ఠినాడు అమ్మానాన్నలను అర్చించాలి.
9) వ్యవసాయంలో వృద్ధి కావాలనుకునే వైశ్యశూద్రాదులు సైతం సప్తమి నాడు పితరులను అర్చించాలి.
10) వ్యాపారాలు చేసేవారు అష్టమి నాడు అమ్మానాన్నలను పూజించాలి.
11) నవమినాడు పశుపాలనం చేసే (యానిమల్ హజ్బెండరీ) వారు తమ తల్లితండ్రులను అర్చిస్తే ఒంటి గిట్టలున్నజంతువులు వృద్ధిపొందుతాయి. వీరు కూడా బ్రాహ్మణేతరులుగా గుర్తించి సకల కులాలవారినీ ఉద్దేశించినవే ఈ పితృదేవతార్చనలు అని అంతా గ్రహించాలి.
12) దశమినాడు పితృదేవతార్చన వల్ల గోధనం వృద్ధి అవుతుంది. పూర్వం ప్రజలకు గోవులే ధనం. సమస్త వర్ణాల వారూ గోవులను సొమ్ములుగా భావించేవారు. నేటికీ శ్రీకాకుళం ప్రాంతాల్లో ఆవులను సొమ్ములు అని పిలుస్తారు.
13) ఏకాదశినాడు అమ్మానాన్నలను అర్చిస్తే బంగారం వెండీ తప్ప మిగిలిన ధనరాశులు అన్నీ పొందుతారు.
14) ద్వాదశినాడు అమ్మానాన్నలను అర్చించి అనుగ్రహం పొందితే బంగారం వెండి ధనరాశులు సొంతం అవుతాయి.
15) బంధుకోటిలో మేటివారు కావాలనుకొంటే త్రయోదశినాడు పితరుల అర్చన చేయాలి.
16) అమావాస్య నాడు అర్చిస్తే సకల కామితాలూ తీరుతాయి.
17) చతుర్దశినాడు విరామం. ఈ రోజు పితృదేవతార్చనలకు విరామం ఇవ్వాలి. ఈ రోజు తద్దినం తప్ప కామ్య శ్రాద్ధాలు చేయరాదు.
18) శుక్ల పక్షం కన్నా కృష్ణపక్షంలో చేసే పితరుల అర్చన విశేషఫలం ఇస్తుంది. మధ్యాహ్నం చేసే పితరుల అర్చన సర్వశ్రేష్ఠం.
పైవన్నీ భీష్ముడు చెప్పిన పితృదేవతార్చనా రహస్యాలు. ఏ తిథినాడు ఏ రకమైన వరాలు పొందుతారో చెప్పాడు.
మీ అమ్మనాన్నలను పూజిస్తే చాలు ఇవన్నీ కలుగుతాయని సకలశాస్రాలూ ఘోషిస్తూంటే అన్యదేవతారాధనలు చేసేవారి కన్నా పిచ్చివారు మరొకరు లేరు. అంతేకాదు. అమ్మానాన్నల అర్చనలను ద్వేషించేవారు, విమర్శించేవారు కుష్ఠురోగి కన్నా అసహ్యకరమైనవారు. వారిని కర్కశంగా దూరం చేసుకోండి. తమ తల్లి తండ్రుల అనుగ్రహం పొందలేక భయంకరమైన పితృదోషాలు, శాపాలున్న నీచులే తమ పాపఫలంగా పితృదేవతార్చనలు వ్యతిరేకిస్తారు. వారి సాంగత్యం మనకు కూడా దోషం అంటిస్తుంది.
అమ్మనాన్నలను విశ్వసించకుండా ఏ దైవాన్ని విశ్వసించినా అది వ్యభిచారం కన్నా నీచమైంది. ఆధ్యాత్మిక జీవితానికి అత్యవసరమైన భక్తి విశ్వాసం పితృదేవతార్చనలు విమర్శించే వారికి లేవని ఇట్టే గ్రహించాలి. అమ్మానాన్నల ప్రేమ పొందలేని వారి జీవితం వృథా. వారి భక్తి వృథా. వారి పూజలు వృథా అని సనాతనధర్మం నొక్కివక్కాణిస్తోంది. కారణాలు ఎంత బలమైనవైనా సరే అమ్మానాన్నలను ప్రసన్నం చేసుకోలేని వారు సర్వతోముఖంగా పతనమైన వారే.
దేవతా మూర్తుల చిత్రపఠాలతో సమానంగా అమ్మానాన్నల ఫోటోకు పూలదండవేసి, అగరుబత్తీ వెలిగించి, దీపం పెట్టి, కుంకుమ బొట్టువారి నుదుటన పెట్టి పూజించాలి. ఎవరి నట్టింట్లో తల్లితండ్రులు, తాత ముత్తాతల ఫోటోలు ఉంటాయో, పండుగలూ పబ్బాలతో పాటు ప్రతినిత్యం పూజలు అందుకుంటూ ఉంటారో వారింట సకల దేవతూ కొలువు ఉంటారు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి.
నేడు అందరికీ కోరికలు ఉన్నాయి. కానీ తీరికలే లేవు. కనుక వీటిని ఆధునిక జీవితానికి అన్వయించి సర్వశ్రేయోమార్గంగా సకల కులమతాల వారూ చేయగలిగిన శుభప్రదమైన మార్గాన్ని గురుదేవులు ఆంధ్రవ్యాసుల వారు ఏలూరిపాటి అనంతరామయ్యగారు ప్రసాదించారు.
ఏ ఏ కోరికలు తీరాలను కుంటే ఆయా వారాలు, నక్షత్రాలు, తిథులలో అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకుంటే చాలు. అతి తొందరగా వారికి కావలసిన కోరికలు తీరుతాయి. వీటిని కామ్యపితృయజ్ఞాలు అంటారు. అంటే కోరికలు తీర్చమని చేసే పూజలన్నమాట. ఇవి మన కోరికల బలం కొద్దీ ఎన్ని సార్లైనా చేయవచ్చు.
కోరికలు తీవ్రంగా ఉన్నవారు వారాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఆరున్నొక్క రోజులకు మనం ఎంచుకున్నది తిరిగి వస్తుంది. తిథి కేవలం 15 రోజులకు వస్తుంది. నక్షత్రం 27 రోజులకు వస్తుంది.
నిజానికి తిథి, వారం, నక్షత్రం కలిసే ఉంటాయి. కనుక తీరాలనుకున్న కోరికలు తీర్చే తిథి, వార, నక్షత్రాలు కలసి కానీ విడిగాగానీ వస్తే వాటిని వదులుకోరాదు. కేవలం తిథి, వారం, నక్షత్రం వచ్చినా సేవించాలి. లేదా మనకు కావలసిన తిథివారం, వారంనక్షత్రం, నక్షత్రం తిథి వచ్చినా వదలకుండా సేవించాలి. మనకు కావలసిన తిథి, వారం, నక్షత్రం కృష్ణపక్షంలో వస్తే అది మహాపుణ్యకాలంగా భావించి విశేషంగా పితరులను అర్చించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చతుర్దశినాడు కామ్యయజ్ఞాలు చేయరాదు. కేవలం తద్దినాలు మాత్రమే పెట్టాలి.
ఇవి పరమశ్రేయోమార్గదేవతా పూజలు. అన్ని కులమతాలలోని చిన్నాపెద్దా ఆడామగ వారూ ఈ ఫలాలు పొందాలంటే ఈ విధంగా అమ్మానాన్నలను సేవించాలి.
పైన చెప్పిన కోరికలు తీరాలనుకున్నవారు తమకు అనుకూలమైన తిథి, వార, నక్షత్రాలను ఎన్నుకొని అవి వచ్చిన ప్రతీ రోజూ ఈ విధంగా చేయాలి.
1) ముందు రోజు నిషేధపదార్థలు తీసుకోరాదు. తినరాదు. బ్రహ్మచర్యం వహించాలి.
2) ఆ రోజు ఉదయమే తలకు స్నానం చేసి స్వధానామాన్ని ఎన్నిసార్లు మదిలో తలచుకోగలిగితే అన్ని సార్లు తలచుకోవాలి.
3) తల్లితండ్రులు బ్రతికి ఉన్నవారు లేని వారు వారికి నమస్కారం చేసుకొని స్వధా, మాతా, పితృస్తోత్రాలు చదువుకోవాలి.
4) తల్లి తండ్రులు లేని వారు తూర్పు వైపునకు తిరిగి రెండు చేతులూ పైకి ఎత్తి ‘‘ నాకు ఫలానా కోరిక ఉంది దయచేసి నా వంశంలోని తాతతండ్రులు తీర్చాలని కోరుతున్నాను. నేను నా శక్తి కొలదీ గోసేవ చేస్తాను.‘‘ అనే అర్ధం వచ్చే విధంగా ప్రార్థించాలి.
5) మీకు దగ్గరలో ఉన్న ఆవుకు ఒక రోజు గ్రాసం అంటే ఒక రోజుకు సరిపడా మేతను రెండుపూట్లా వేయాలి. అంటే పచ్చగడ్డి, ప్రత్తిగింజలు, గానుగ నుంచీ వచ్చిన నూపప్పు, పల్లీపప్పు వంటి పప్పుచెక్కలు, (తెలగపిండి), చిట్టూ తవుడూ వంటివి వేయాలి. దూడ ఉంటే దానికి కూడా సరిపడా వేయాలి.
6) ఈ విధంగా కులమతజాతిలింగభేదాలు లేకుండా ఎవరైనా తమ కోరికల సాధనకు చేయవచ్చు. కోరికల సాధన బలంగా ఉన్నవారు తమకు దగ్గరలో ఉన్న స్మార్తబ్రాహ్మణులను సంప్రదించండి.
సేకరణ
మానస
సేకరణ
మానస