నుదుట బొట్టును ఏ వేలితో పెట్టుకుంటే ఏం ఫలితమో తెలుసా ?
నుదుట బొట్టును ఏ వేలితో పెట్టుకుంటే ఏం ఫలితమో తెలుసా ?
నుదుట బొట్టు.. భారతీయ సంప్రదాయం. దాదాపు హిందూ ధర్మాన్ని పాటించే అందరూ బొట్టు పెట్టుకుంటారు. ఒకరు నామం, మరొకరు విభూతిరేఖలు, మరొకరు కుంకుమ, గంధం ఇలా రకరకాలుగా నుదుట బొట్టు/భస్మం లేదా తిలక ధారణ చేస్తారు. అయితే దీనివెనుకు పలు రహస్యాలు దాగి ఉన్నాయని పెద్దలు చెప్తారు.
బొట్టు పెట్టుకోవడం వల్ల అందంగా కనిపించడమే కాకుండా.. ఆరోగ్యానికి ప్రయోజనకరమే. కుంకుమ బొట్టు పెట్టుకుంటే.. దాని ద్వారా సూర్యకిరణాలు శరీరమంతా ప్రసరించి.. నూతనోత్తేజాన్నిస్తాయి. డీ విటమిన్ను తొందరగా శరీరం తీసుకునే శక్తి వస్తుంది అని చెప్తారు. హిందువుల సంప్రదాయం ప్రకారం మహిళలు, ముఖ్యంగా పెళ్లైన ముత్తైదులు తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఐదోతనానికి బొట్టు చిహ్నం కాబట్టి పెళ్లైన ముత్తైదువులు ఎల్లవేళలా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు లేని ముఖం అందవిహీనంగా కనిపించడమే కాదు..శుభ కార్యాలు చేయటానికి అర్హత లేదని హిందూ సంప్రదయం చెబుతోంది. మహిళలు ఉదయాన్నే స్నానం చేయగానే ముందుగా బొట్టు పెట్టుకుని పూజ చేయాలని పెద్దలు చెబుతుంటారు.
బొట్టు పెట్టుకోవడం మంచిది, సంప్రదాయం అని అందరికీ తెలుసు. కానీ.. బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం..? ఎలా పెట్టుకుంటే మంచిది అన్న విషయంలో చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే అసలు బొట్టు ఎందుకు ధరించాలి ? నుదుటి మీదే ఎందుకు పెట్టుకోవాలి ? ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? అన్న సందేహాలను తీర్చుకుందాం…
గౌరవసూచకం బొట్టు పెట్టటం మర్యాదకి గుర్తింపు. అందుకే ఎవరినైనా ఆహ్వానించడానికి ముందుగా బొట్టు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు బొట్టు పెట్టి గౌరవిచమూ హిందూ సంప్రదాయం. బొట్టు పెట్టుకునేటప్పుడు ఏం స్మరించాలి ? సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే అని జగన్మాతను స్మరించుకుంటూ నుదుటన బొట్టు పెట్టుకుంటే మంగళకరం.. శుభకరం.
ఏ వేలితో ఏం ప్రయోజనం ?
బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతుంటారు. కొందరు మధ్య వేలు మంచిదని.. మరికొందరు ఉంగరపు వేలు మంచిదని. అయితే ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుంది. మధ్య వేలితే పెట్టుకుంటే ఆయువు, సంపద వస్తాయని ప్రతీతి. ఒక చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదు. బొటన వేలితో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.నుదుటనే ఎందుకు ? బొట్టు నుదుటిపైనే పెట్టుకోవాలనే సంప్రదాయం వెనక కారణాలున్నాయి. జ్ఞాపక శక్తికి, ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య తిలకము పెడతాము.
ఆరోగ్యానికి కుంకుమ బొట్టుపై సూర్యకాంతి ప్రసరించి.. శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది. అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేదా విభూతి నుదుట రాయడమూ మంచిదే.
స్త్రీలకే కాదు ధర్మాన్ని పాటిస్తూ.. భగవంతున్ని నమ్ముతున్నారనడానికి బొట్టు ప్రతీకగా చెప్పవచ్చు. కాబట్టి కుంకుమ పెట్టుకోవడం స్త్రీలకే పరిమితం కాలేదు. పురుషులు కూడా పెట్టుకుంటే సంప్రదాయం పాటిస్తున్నారని తెలియజేస్తుంది. బొట్టు పెట్టుకోవడం మూఢాచారం కాదు. పెద్దలు, మనకోసం పాటించిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం. ఇది భారతీయులకే ప్రత్యేకం. ఇక బొట్టుతోపాటు కొందరు నుదుట తిలకంతో నామం, గోపిచందనంతో నామం, భస్మధారణ, గంధధారణ చేస్తారు ఇవన్నీ కూడా ఆయా సంప్రదాయాలకు చిహ్నంగా ధరిస్తారు. ఏ రకంగానైనా బొట్టు పెట్టుకోవడం ముఖ్యమని సనాతన ధర్మం చెప్తుంది.
సేకరణ
నాగమణి