అష్టాదశ శక్తిపీఠం-15 జ్వాలాయాం వైష్ణవీదేవి
అష్టాదశ శక్తిపీఠం-15
జ్వాలాయాం వైష్ణవీదేవి
శ్రీ వైష్ణవీ దేవి ధ్యానం
తుహినాద్రి స్థితామాతా జ్వాలాముఖీతి విశ్రుతా
జ్వాలా మాలా ప్రభాదేవీ జ్ఞాన వైరాగ్య వర్ధినీ
భారతదేశమున వాయువ్యమూలంగా హిమవన్నగ పర్వత ప్రాంగణంలో ఒదిగియున్న ప్రదేశం హిమాచలప్రదేశ్, పరమశివుని వెండికొండగా పేర్కొనబడిన దివ్యధామం హిమాలయం. హిమాచల స్వరూప స్వభావాన్ని బట్టి ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విభజించవచ్చును. దక్షిణ ప్రాంతము కొంత ఉష్ణంగాను, ఉత్తర ప్రాంతము శీతలముగా వుంటుంది. చలికాలము నందు అతిశీతలమై, హిమపాతం జోరుగా పడుతూ వుంటుంది. హిమాచలప్రదేశం చాలాభాగము పర్వతప్రాంతమే. ప్రపంచములోనే అత్యధిక గ్రామీణ ప్రాంతములతో నిండిన రాష్ట్రం.
భారతమాతను వసుంధరగా సస్యశ్యామలంగా మారుస్తూ, తమ విద్యక్తి ధర్మంగా ప్రవహించే జీవనదులు జన్మస్థలమైన పుణ్యస్థలి హిమాచలప్రదేశ్, ఉత్తరాన జమ్ము-కాశీర్మర్, ఆగ్నేయముగా ఉత్తరప్రదేశ్, దక్షిణాన హర్యానా, పడమట పంజాబు సరిహద్దు రాష్ట్రాలు మరియు తూర్పున టిబెట్టు సరిహద్దు రేఖలున్నాయి. చీనాట్, రావి, బియాన్, సట్లెజ్, యమున నదులు హిమాచలప్రదేశ్‌ను సస్యశ్యామలము చేస్తున్నాయి. చద్విక్ జలపాతం, కుఫ్రి, డల్హౌసి, కసౌలి, లాహపుల్, స్పితి, సిమ్లా, కులూ, మనాలి మొదలగు పర్యాటక స్థలాలతో నిండి ఉంటుంది.
జ్వాలాముఖి, తారాదేవి, ధర్మశాల, రేణుక, నైనాఏవి, బైద్యనాథ్, మహాదేవ్, పార్వతీలోయ, త్రిజోకనాథ మొదలగు పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తాయి. గ్రామీణ ప్రాంత అందాలు, ప్రకృతి సౌందర్యాలు, పర్వత సోయగాలు, పర్యాటకులకు స్వాగతమిస్తున్నాయి.
హిమాచలప్రదేశ్ ఉత్తరప్రాంతమును క్రీ.శ. 550 సంవత్సరము పూర్వము నుంచి రాజపుత్రులు రాజ్యమేలారు. 2-5 శతాబ్దాల మధ్య గుప్తుల రాజ్యపాలనలో ఉండేది. హిందూరాజుల అంతఃకలహాల మూలంగా ఒక్కొక్క మెట్టూ పరాయిపాలకుల హస్తాలలోకి జారిపోయింది. మహమ్మద్ గజనీ దండయాత్ర చేసి దోచుకోగలిగినంత దోచుకున్నారు.
టర్కీ సుల్తానులు, తురుష్కులు దండయాత్రలు చేసి సిరులన్నీ తరలించారు. ముస్లిం వంశీయులు వారి కోటలు నిర్మించి, తమ కోశాధికారులను నియమించారు. 16వ శతాబ్దంలో మొగలు వంశపు చక్రవర్తులు దండయాత్రలు చేసి, తమ సామ్రాజ్యంలోనికి తెచ్చారు. మొగలు పతనానంతరము సిక్కులు రాజ్యమేలారు.
18వ శతాబ్దంలో సిక్కురాజైన రాజారంజిత్‌సింగ్ మరణం తరువాత అనగా 19వ శతాబ్దంలో బ్రిటీష్‌వారి పాలనలోనికి వచ్చింది. 1947 సంవత్సరములో భారతస్వతంత్ర దేశంఅయిన పిమ్మట 32 సంస్థానాలు, రాచరికపు రాజులను విలీనం చేసి, కేంద్రపాలిత రాష్ట్రంగా ఏర్పాటుచేశారు.
1960వ సంవత్సరములో పంజాబులోని కొన్ని ప్రాంతాలు, అంతకు ముందున్న ప్రాంతములతో కలిసి హిమాచలప్రదేశ్‌గా ఏర్పాటు జరిగింది. ఉత్తర – పశ్చిమాన గల కాంగ్రా ప్రాంతము మొదటి నుంచి దృఢమైన రాజ్యంగా ఉండేది. రాజపుత్రులు, మొగలు వంశీయులు, సిక్కుల పాలనలో మహావైభవోపేతంగా, సిరులకు నిలయంగా తులతూగుచుండేది. కాంగ్రా పట్టణములోని దేవి వజ్రేశ్వరి ఆలయ సంపదను మహమ్మద్ గజనీ, తుగ్లక్‌లు కొల్లగొట్టుకుపోయినట్లుగా చరిత్ర చాటుతుంది. కాంగ్రా చుట్టుప్రక్కల ప్రాంతముల నందు అనేక హిందూ దేవాలయములు ఉండేవి. వీటిలో జ్వాలాముఖి ఆలయం పురాణ ప్రసిద్ధి చెందినది.
హిమాచలప్రదేశ్ ఉత్తర ప్రాంతమునందు కాంగ్రా జిల్లా కలదు. జిల్లా ముఖ్య కేంద్రముగా కాంగ్రా పట్టణము ఉంది. దీనికి సుమారు 35 కి.మీ. దూరమున జ్వాలాముఖి క్షేత్రం వుంది. ఇది సతీదేవి పిరుదులు పడిన ప్రదేశముగా ఖ్యాతి పొందినది. మరికొంతమంది సతీదేవి శరీరకలాల్లోని నాలుక తెగిపడిన ప్రదేశముగా భావించుచున్నారు. క్షేత్రం అష్టాదశశక్తి పీఠాలలో పదిహేనవదిగా ప్రసిద్ధి చెందినది. శివాలికి పర్వతశ్రేణిలో, కలిందర్ పర్వతం చెంత జ్వాలాముఖి ఆలయం వుంది.
కొండమీదకు మెట్లు మార్గం నిర్మాణం జరిగింది. ఆలయంలో వేంచేసిన దేవిని విద్వేశ్వరీదేవిగా కొలుస్తారు. భక్తులు మాతను వైష్ణవీదేవిగా కూడా పిలుస్తారు. ఆలయం రాతిదర్వాజా గుండా చూస్తే వెలుగుతున్న మహాజ్వాలను చూడగలము. ఈ మహాజ్వాలను పాలు, నేయితో తయారుచేసిన పదార్ధాలను నివేదనగా సమర్పించుకుంటారు. ఆలయప్రాంగణములోని హోమగుండం నిరంతరం అగ్నితో ప్రజ్వరిలుతూంటుంది. భక్తులు అమ్మకు సమర్పించు నివేదనలు హోగుండమునకు సమర్పించుట ఆచారముగా వస్తుంది. నివేదనలు తిరిగి ప్రసాదంగా భక్తులకు పంచుతారు. ఆలయములోని జ్వాలల చుట్టూ ప్రదక్షిణలు జరిపి, భక్తి శ్రద్ధలతో జ్వాలాముఖిని ఆరాధించుతారు.
సర్వేజనా సుఖినోభవంతు
- రామ కృష్ణంరాజు గాదిరాజు