అమర్నీతి నాయనారు
అమర్నీతి నాయనారు
అమర్నీతి నాయనారు చోళరాజ్యమున ప్రసిద్ధినందిన పజైయ్యరాయికి చెందిన వైశ్య కులజుడు. అ గ్రామం చాలా సారవంతమైనది. చుట్టూ తోటలతో లతలతో పచ్చగా శోభాయమానంగా ఒప్పుతూండేది. అమర్నీతి నాయనారు బంగారం, రత్నాలు, పట్టు వస్త్రముల వ్యాపారి. విదేశాలనుండి వస్తువులను తెప్పించి వ్యాపారం చేస్తుండేవాడు. ఆయన ఆర్జన ఎంతో నీతిమంతముగా ఉండేది. వ్యాపారం కలిసి రావడంతో మంచి ధనవంతుడయ్యాడు. వ్యాపారము చేస్తున్నా, ఇహలోక వ్యాపకాలున్నా, నాయనారు మనసు శివుని మీదే వుండేది. పరమశివ భక్తుడు. శివభక్తులను తన గృహమునకు పిలిచి వారిని అర్చించేవాడు. వారలకు కౌపీనము, దుస్తులు మొదలగునవి ఇచ్చి, షుష్టుగా భోజనము పెట్టి, ఏమైనా కానుకలు ఇచ్చి, వారు సంతసించునట్లుగా చేసి సాగనంపేవాడు.
పండుగలలో పబ్బాలలో తిరునల్లూరు దేవాలయమునకు దైవ దర్శనమునకు వెళ్లేవాడు. అక్కడ శివుని ముందు భావయుక్తంగా పంచాక్షరిని జపిస్తూ శివుని అర్చించేవాడు. కొన్నాళ్లకి పండుగలకు మాత్రమే తిరునల్లూరు దేవాలయమునకు వెళ్ళటంతో సంతృప్తినందక - ఆ వూరిలోనే నివసిస్తే - నిరంతరము శివ దర్శనము చేయవచ్చని, శివభక్తుల సేవకు వీలవుతుందని తలచి - తిరునల్లూరుకు తన బంధువులతో సహా వెళ్లి, అక్కడే స్థిరపడి - దైవదర్శనమునకు వచ్చెడి శివభక్తులకు వుండుటకు వీలుగా ఒక మఠం కట్టించాడు. ప్రతి దినము వారిని తన ఇంటికి పిలిచి, వారలకు కౌపీనము మొదలగునవి ఇచ్చి సంతసింపజేసేవాడు.
నాయనారు భక్తితత్పరతకు పరమశివుడు పరవశించి పోయాడు. ముఖ్యముగా కౌపీనములను ఇచ్చుచుండుట, శివభక్తులయెడ వాత్సల్యము, ఔదార్యము శివుని ఆకర్షించినవి. అతని ఔదార్యాన్ని అందరిచేత ప్రశంసింపజేయాలని, అతనికి తన శుభాశీస్సులను ఇయ్యటానికి శివుడు నిశ్చయించాడు. అందుకని ఒకరోజున బ్రహ్మచారి వేషంతో జటతో, విభూతి పుండ్రములు, భుజం మీద దండంతో శివుడుఅమర్నీతి నాయనారు మఠంకి విచ్చేశాడు. బ్రహ్మచారి దండానికి చివర 2 కౌపీనములు, విభూతిసంచి కట్టబడి వున్నాయి. ఆయన ముఖం తేజోవంతంగా ఉంది. కళ్లు ప్రకాశమానంగా వున్నాయి. ఠీవిగా మఠంలోకి ప్రవేశించాడు. అమర్నీతి నాయనారు పరమానందంతో అతిథిని ఆహ్వానించి అర్చించాడు. బ్రహ్మచారి - అమర్నీతి నాయనారుతో, "మీరు మహాత్ములు. ప్రతి ఒక్కరు మీ దానాలకి, ముఖ్యముగా కౌపీనముల దానాలకు మిమ్మలను అభినందిస్తున్నారు. మీ దర్శనానికి వచ్చాను." అని అన్నాడు. అమర్నీతి నాయనారు - బ్రహ్మాచారిని తన వద్దనుండి బిక్షను స్వీకరించవలసిందిగా అర్థించాడు. బ్రహ్మచారి ఒప్పుకొని, "నేను నదికెళ్లి స్నానము చేసి నిత్య కర్మానుష్టానము చేసి వస్తాను. వర్షము వస్తోంది. వర్షమునకు నా కౌపీనములు తడిసిపోయాయి. అందుకని ఈ పొడి కౌపీనమును జాగ్రత్త పరచండి. నేను వచ్చి తీసుకుంటాను. అది చాలా విలువైంది, ప్రత్యేకమైనది గూడ. అందుచే దానిని భద్రముగా ఉంచండి" అని చెప్పి స్నానానికి నదికి వెళ్లాడు.
బ్రహ్మచారి నదికి వెళ్లాడు. అమర్నీతి నాయనారు ఆ కౌపీనమును భద్రపరిచాడు. పరమశివుడు దానిని మాయం చేశాడు. బ్రహ్మచారి స్నానము చేసి వచ్చి, తన పొడి కౌపీనమును ఈయమని కోరాడు. తన రెండో కౌపీనము వానకు తడిసిపోంది. అందుకని పొడిదానిని అడిగాడు. అమర్నీతి నాయనారుకు తాను భద్రపరచినచోట కౌపీనము కనిపించలేదు. అంతటా వెదికాడు. ఎక్కడా కనిపించలేదు. అందుకని వణుకుతూ బ్రహ్మచారికి ఇంకొక కౌపీనముతో నిలబడి పరిస్థితిని చెప్పాడు. బ్రహ్మచారి నాయనారు మాటలను అంగీకరించలేదు. వినలేదు. నాయనారు చాలాధనము దానికి బదులుగా యిస్తానన్నాడు. బ్రహ్మచారి, "ధనాన్ని నేనేమి చేసికొంటాను? అవసరం లేదు, నా అవసరం కౌపీనము మాత్రమే" అన్నాడు. బ్రహ్మచారి ఇంకా ఇలా అన్నాడు. "మీకు కౌపీనము కనిపించనిచో, నా ఇంకో కౌపీనమునకు సరితూగే వేరొక కౌపీనమును ఈయండి" అన్నాడు. అమర్నీతి నాయనారుకు కొంచెం స్వస్థత కలిగింది. వెంటనే త్రాసును తెప్పించాడు. బ్రహ్మచారి కౌపీనమును ఒక తక్కెటలో ఉంచాడు. రెండో తక్కెటలో తాను ఇవ్వదలచిన కౌపీనమును పెట్టాడు. బ్రహ్మచారి కౌపీనమే ఎక్కువ బరువు చూపింది. అమర్నీతి నాయనారు ఏమిపెట్టినను బ్రహ్మచారి కౌపీనమే బరువుగా కనిపించింది. అమర్నీతి నాయనారుకు ఆశ్చర్యము కలిగింది. ఇదంతా శివలీలయని గ్రహించాడు. తన సంపద యావత్తు బ్రహ్మచారి కౌపీనమునకు సరితూగలేదు. పరమ శివుని కౌపీనము వేదమును తలపింపజేస్తుంది. దాని పోగులు శాస్త్రాలు.
అమర్నీతి నాయనారుకు ఏమీ పాలుపోలేదు. బ్రహ్మచారి కాళ్లమీద పడ్డాడు. "స్వామీ! నన్ను, నా భార్యను, నా పుత్రుని గూడ మీ కౌపీనమునకు సమమవుతాయేమో తూచండి" అని అర్థించాడు. బ్రహ్మచారి అందుకు అంగీకరించాడు. అమర్నీతి నాయనారు తన కుటుంబముతో సహా తక్కెటలో కూర్చుంటూ, "నేను శివభక్తులను భక్తితో, చిత్తశుద్ధితో, సేవించుచున్నట్లయితే, ఈ త్రాసు ఇప్పుడు సరితూగుగాక" అన్నాడు. త్రాసు ఆశ్చర్యకరంగా సరితూగింది. అమర్నీతి నాయనారు పుణ్యం బ్రహ్మచారి కౌపీనమూనకు తుల్యమయింది. అచ్చట చేరిన ప్రజలందరూ ఆశ్చర్య చకితులయ్యారు. వారు అమర్నీతి నాయనారు పాదములపైబడి ప్రశంసించారు. దేవతలు ఆ కుటుంబముపై పారిజాత సుమ వృష్టి కురిపించారు. బ్రహ్మచారి అంతర్థానమైనాడు. పార్వతీపరమేశ్వరులు వృషభ వాహనముపై ప్రత్యక్షమై, నాయనారును అనుగ్రహించారు. పరమేశ్వరుడుఅమర్నీతి నాయనారును ఉద్దేశించుచు, "నీ కౌపీన దాతృత్వము, శివభక్తుల నిరుపమాన సేవ మమ్మల్ని అలరించాయి. నీవు, నీ భార్య, నీ పుత్రుడు - ముగ్గురూ నా లోకంలో శాశ్వతంగా నివసించండి" అన్నారు. శివానుగ్రహం వల్ల తక్కెడ దివ్యవిమానంగా మారి, అమర్నీతి నాయనారును, అతని భార్యను, మఱియు అతని పుత్రుని శివలోకానికి చేర్చింది.