Online Puja Services

సృష్టి - దృష్టి,

18.191.176.192
పరమేశ్వరుడికి తన సృష్టిపై అంతులేని ప్రేమ. మనుషులు మూర్ఖత్వంతో, అజ్ఞానంతో స్వజాతి వినాశనానికి ఎంత ప్రయత్నిస్తున్నా భగవంతుడు రక్షిస్తూనే ఉంటాడు. చంటిబిడ్డ కాలితో తన్నినా తల్లిదండ్రులు ఆ కాలును ముద్దు పెట్టుకుంటారే గాని కినుక వహించరు. జగత్తు సర్వస్వం ఈశ్వరమయం. ప్రతిచోటా పరమేశ్వరుడు ఉంటాడన్నాక ఇక ‘ప్రాణుల్లోనూ ఉంటాడు’ అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. వేమన దృష్టిలో ప్రతి జీవీ శివస్వరూపమే! ‘జీవిని చంపడం అంటే శివుడిని చంపడమే!’ అని వేమన విస్పష్టంగా చెప్పాడు.
 
పాశ్చాత్య ఆధ్యాత్మిక దృష్టిలో ఆరువేల సంవత్సరాల క్రితం మనుషుల్ని భగవంతుడు సృష్టించాడు. భారతీయుల దృష్టిలో కొన్ని లక్షల సంవత్సరాలు దాటింది. భారతీయుల దృష్టే సత్యసమ్మతంగా ఉందని ఆధునిక విజ్ఞానశాస్త్రం స్పష్టం చేస్తున్నది. ఈ సృష్టిని గురించి మన పురాణాలు పేర్కొన్నాయి. శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ రుద్రుడిని, ఇంద్రుడిని, సనక సనందనాదులను, దేవర్షులను, ప్రజాపతులను, సిద్ధ, గంధర్వ, కిన్నర, కింపురుష, విద్యాధరులను, చతుర్వర్ణాల మనుషులను, జంతువులను, చెట్లను ఇతర స్థావరాలను... సృష్టించాడు. విత్తనాలనుంచి చెట్లు పుడతాయి. వీటిని ఉద్బీజాలు అంటారు. చెమటనుంచి పుట్టిన సూక్ష్మ క్రిములు స్వేదజాలు... ఇవి గాక- అండజాలు, పిండజాలు లక్షల రకాలు... సృష్టిలో కనిపిస్తాయి.
 
భారతదేశంలో పుట్టిన ప్రతి ఆధ్యాత్మిక మార్గమూ ‘అహింసే పరమ ధర్మం’ అని చెబుతుంది. భగవంతుడి ప్రేమమార్గాన్ని వ్యాప్తిచేసే సూత్రం ఇది. శంకరాచార్యుల అద్వైతం, బుద్ధుడి కరుణా దృష్టి... ఈ మార్గంలోనే పయనిస్తున్నాయి. ప్రకృతి ప్రియులకు సృష్టిలోని ప్రతి చెట్టు, పుట్ట, పిట్ట... సౌందర్య నిలయాలే! ఏ ప్రాణీ తనను తాను అసహ్యించుకోదు - ఒక్క మనిషితప్ప! నల్లగా ఉన్నామనో, పొట్టిగా ఉన్నామనో వేదన చెందేవారు ఎందరో ఉన్నారు. భగవానుడే నల్లటివాడిగా, పొట్టివాడిగా అవతారాలెత్తాడు! ఆయన చేసిన పనుల వలన లోకాలు సుఖించాయి. అందువల్ల నల్లనయ్యను భక్తితో పూజిస్తాం. ఆయన బోధించిన భగవద్గీత మనకు మోక్షమార్గం. చరిత్రలో ఎందరో అందవిహీనంగా ఉండే మహాత్ములు కనిపిస్తారు. కానీ వారి ఔన్నత్యం భౌతికసౌందర్యాన్ని మించి పోయి ఉంటుంది. వారి రూపురేఖలు మన హృదయంపై చెరగని ముద్ర వేస్తాయి. ఇక వారి అందాన్ని గురించి పట్టించుకోం. ఎవరైనా ఆ మహాత్ముల చక్కదనాన్ని గురించి తక్కువచేసి వ్యాఖ్యానిస్తే సహించం.
 
సామాన్యంగా కథారచయితలు, కవులు కల్పనను ఇష్టపడతారు. అందువల్లనే వారి రచనల్లో సత్యం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయినా వారిని అసత్యవాదులు అనలేం. మనకు అర్థంకాని జీవిత సత్యాలనెన్నింటినో రచయితలు సులభంగానూ రసరమ్యంగానూ తెలియజేస్తారు. పురాణ ఇతిహాసాల్లోనూ ఇదే రీతి. కల్పనల సహాయంతో క్లిష్ట సమస్యలకు సులభ పరిష్కారాలను సూచించారు మన రుషులు. వారిది పవిత్ర దృష్టి. వాళ్ల సృష్టి కూడా పవిత్రమైనదే! వారి కల్పనలు లోకానికి శుభం చేకూరుస్తాయి. లోకశ్రేయస్సు కోసం చేసే కర్మలు, చెప్పే మాటలు, రాసే రాతలు... అన్నీ సత్యంగానే భావించాలి. మానసిక వైద్యులు రోగికి ఉపశమనం కలిగించడానికి చెప్పే మాటలను సత్యాలుగా భావిస్తేనే మేలు కలుగుతుంది. విద్యార్థులతో ఉపాధ్యాయులు చెప్పే విషయాలను గ్రహించాలంటే వాళ్లకు శ్రద్ధాభక్తులు అవసరం. గురువును దైవం అనే దృష్టితో చూస్తేనే అది సాధ్యం.
 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha