దేవుడి పుష్ప ప్రసాదాల పట్ల జాగ్రత్త!
పువ్వులు పవిత్రమైనవి. పరిమళ భరితమైనవి. అలాంటి పువ్వులను దైవానికి సమర్పించి తిరిగి ప్రసాదంగా పొందడాన్ని భక్తులు శుభప్రదంగా భావిస్తుంటారు. అయితే దేవుడి దగ్గర పూలు తలలో పెట్టుకున్న తరువాత కొంత సేపటికి వాటిని తీసి పవిత్రమైన ప్రదేశాల్లో వదిలేయాలి. వివాహితులు ఆ పువ్వులను ధరించి ఎలాంటి పరిస్థితుల్లోను పడక గదిలోకి అడుగు పెట్టరాదని చెబుతోంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి మనకి పురాణాల్లో కనిపిస్తుంది.
దక్ష ప్రజాపతి కథ
పూర్వం దూర్వాస మహర్షి తపస్సుకి మెచ్చిన అమ్మవారు తన మెడలోని పూల హారాన్ని అతనికి బహుమానంగా ఇస్తుంది. ఆ పూలమాల వెదజల్లుతోన్న పరిమళానికి ముగ్ధుడైన దక్ష ప్రజాపతి దానిని తనకి ఇవ్వవలసినదిగా దూర్వాసుడిని కోరాడు. అమ్మవారి ప్రసాదంగా తనకి లభించిన ఆ పూలమాలను అత్యంత పవిత్రంగా చూసుకోమంటూ ఆయన ఆ మాలను దక్ష ప్రజాపతికి ఇచ్చాడు. ఆ రాత్రి దక్ష ప్రజాపతి ఆ పూలమాలను తన పడక గదిలోని మంచానికి అలంకరించాడు.
ఆ విధంగా చేసిన దోషమే ఆయన్ని శివ ద్వేషిగా మార్చింది. శివుడి కారణంగానే శిరస్సును కోల్పో వలసి వచ్చింది. కనుక దైవానికి భక్తితో సమర్పించిన పువ్వులు తిరిగి ప్రసాదంగా స్వీకరించినప్పుడు వాటిని పవిత్రంగా చూసుకోవాలి. పవిత్రమైన ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలని శాస్త్రం చెబుతోంది.
మానస