Online Puja Services

సాధువు చెప్పిన తత్వం

3.17.73.81
ఒక సాధువు తంబూరా మీటుకుంటూ ఓ తత్త్వాన్ని పాడుతూ వీధుల వెంట వెళుతున్నాడు. ధనం మీద ఆశ ఉంటే విభేదమనీ, మనుషుల మధ్య చిచ్చు పెడుతుందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ అతడు పాడుతున్నాడు.
 
రాజమందిరం పై విహరిస్తున్న రాజుకి ఆ తత్త్వం వినబడింది. ఆయనకది బాగా నచ్చింది.
 
ఆ సాధువును రాజసభకు తీసుకు రావలసిందిగా సేవకులను ఆదేశించాడు.
 
రాజసభలో ఆ తత్త్వాన్ని మరోసారి పాడించి సభాసదులందరితో సహా విని ఆనందించాడు.
 
రాజు ఆ సాధువుకి బంగారం, రత్నాలు బహూకరించాడు. వద్దని తిరస్కరించాడు సాధువు.
 
ఏంచేస్తూ ఉంటావని అడిగిన రాజుకి, తాను బట్టలు నేసె వాడినని జవాబిచ్చాడు ఆ సాధువు.
 
పోనీ, పనిలో సహాయపడేది ఇస్తానని చెప్పి రాజు, రత్నాలు పొదిగిన బంగారు కత్తెరను బహూకరించాడు. దానిని కూడా సాధువు మర్యాదపూర్వకంగానే తిరస్కరించాడు.
 
"సరే ఏం కావాలో నువ్వే కోరుకో" అన్నాడు రాజు. "రాజా! మీరు ఇంతగా బలవంతం చేస్తున్నారు కాబట్టి, ఒక సూది ఇవ్వండి చాలు" అన్నాడు సాధువు.
 
ఏమిటి ఈ దారిద్ర్యం? రాజు అంతటి వాడు ఏదైనా కోరుకో మంటే ఏ మాత్రం విలువ చేయని సూదినా కోరుకోవడం???
 
రాజు ఆశ్చర్యంతో ఆ సాధువుని అడిగాడు.
 
"మహారాజా! కత్తెర వస్త్రాన్ని రెండుగా చింపుతుంది.నాకు రెండు ముక్కలను కుట్టి కలిపే సూది కావాలి.అలాగే ధనం మనుషుల మధ్య విబేధాన్ని సృష్టిస్తుంది.. మనుషులను కలిసి ఉంచే మంచి మాటలు కావాలి. ఆ ఐక్యమత్యమే దేశానికి వెన్నెముక "అన్నాడు........
 
ధనమెచ్చిన మదమెచ్చును
మదమొచ్చిన దుర్గుణంబు మానకహెచ్చున్ 
ధనముడిగిన మదముడుగును 
మదముడిగిన దుర్గుణంబు మానును వేమా!
 
భావం:-
ధనము అధికమైతే గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగిన వెంటనే చెడ్డగుణాలు అలవడతాయి.
 
అదే విధంగా ధనం పొయిన వెంటనే గర్వం పోయి, చెడ్డగుణాలు తగ్గుతాయి. కాబట్టి ధనం రాగానే స్థిరమైన మనస్సుతో గర్వాన్ని తలకెక్కించుకోకూడదు.
 
- పెద్దింటి రమణ ప్రసాద్

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi