అష్టాదశ శక్తిపీఠం-10 పీఠికాయాం పురుహూతికా
అష్టాదశ శక్తిపీఠం-10
పీఠికాయాం పురుహూతికా
శ్రీ పురుహూతికా దేవి ధ్యానం
పురుహూతీ సతీమాతా పీఠికాపుర సంస్థితా
పుత్రవత్పాలితా దేవి భక్తనుగ్రహదాయినీ
ఆంధ్రలో ఈశాన్యం దిక్కుగా తూర్పుగోదావరి జిల్లా వుంది. పచ్చనిపైరులు, గలగలా పారుతున్న పంట కాలువలు, ఉధృతంగా ప్రవహించే గోదావరినది మరియు సముద్రతీర ప్రాంతాలతో నేత్రపర్వంగా జిల్లా దర్శినమిస్తుంది. సముద్రమూ, గోదావరి నది కలిసే ప్రదేశానికి అతిసమీపంలో నున్న ప్రాచీన పట్టణం ”కాకినాడ పట్టణం”. తూర్పు కోస్తా ప్రాంతపు రేవులలో కాకినాడ రేవు ప్రాచీనమైనది. పిఠాపురం సంస్థానాదీశులు కాకినాడ పట్టణమును ప్రణాళికాబద్ధమైన రీతిలో తీర్చిదిద్దారు.
జిల్లా కేంద్రమైన కాకినాడ పట్టణమునకు ఉత్తరదిశవైపుగా సుమారు 19 కి.మీ. దూరమున పిఠాపురం అను చిరుపట్టణము వుంది. ఇది చుట్టుప్రక్కల ప్రాంతములకు ముఖ్య కేంద్రం. పిఠాపురం సంస్థానాదీశుల పాలనలో వైభవముగాను, శోభాయమానంగా విలసిల్లిన రాజక్షేత్రం. నాటి మహారాజుల భవనములు కట్టడాలు చరిత్ర గర్భంలో కలిసిపోయినాయి. వీటితోపాటు శ్రీపురుహూతిక పీఠం కూడ కాలగర్భంలో కలిసిపోయి వుండవచ్చు. సతీదేవి యొక్క పీఠభాగము (పిరుదులు) పడిన ప్రదేశముగా ప్రసిద్ధి చెందినది.
ఈ క్షేత్రం ప్రాచీనకాలము నందు శ్రీపీఠంగా, పురుహూతికాపురంగా, పురుహూతికా పట్టణముగా వాడుకలో వుండేది.
అష్టాదశ శక్తి పీఠములలో పదవపీఠం అయిన శ్రీ పురుహూతికా మూలస్థానము శ్రీ కుక్కుటేశ్వరాలయ ప్రాంగణము నందు ఈశాన్యం వైపుగా వుంది. గర్భగుడి నందు అమ్మవారు శాంతి రూపములో దర్శనమిస్తుంది. శ్రీ పురుహూతికాదేవిని ఇంద్రుడు మున్ముందుగా ఆరాధించారు. గయాసురుడు కూడ ఆరాధించిన శక్తిగా ప్రసిద్ధి చెందినది.
అమ్మవారి మందిరము 1995 సంవత్సరము నందు జీర్ణోద్ధరణ జరిగింది.
1998 సంవత్సరం నందు ఆలయ పునర్నిర్మాణమునకు శంఖుస్థాపన జరిగింది. అమ్మవారికి నిత్యపూజలు జరుగుతుంటాయి. కుంకుమార్చనలు మొదలగునవి భక్తులు భక్తి శ్రద్ధలతో చేస్తారు. అమ్మవారి మంటపం నందు నాలుగు ప్రక్కల, గర్భగుడి గోడల మీద అష్టాదశ శక్తి పీఠములను పొందుపర్చినారు.
ఆశ్వీజమాసంలో దేవి నవరాత్య్రుత్సవాలు ఘనంగా జరుగుతాయి. విజయదశమినాడు జమ్మి ఉత్సవం వైభముగా జరుగుతుంది.
పిఠాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దేశంలోని ప్రాచీన పుణ్యతీర్థములలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచినది. క్షేత్రం నందలి శ్రీ కుక్కుటేశ్వరుడు స్వయంభూలింగముగా వెలిసారు. పిఠాపురం కాశీతో సమానమైనది. దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు. శ్రీ వ్యాసభగవానులు సతీసమేతంగా కాశీనగరం విడిచి, దక్షిణకాశీ అయిన పిఠాపురం నందలి పాదగయ తీర్థమున స్నానముచేసి, శ్రీహుంకారిణి సహిత శ్రీకుక్కుటేశ్వరుని దర్శించుకున్నారు.
శ్రీ అగస్త్యులు కూడా సతీసమేతంగా ద్వాదశ క్షేత్రయాత్ర సలుపుతూ భీమమండలం నందలి శ్రీ కుక్కుటేశ్వరస్వామిని మరియు శ్రీ పురుహూతికాదేవిని కొలిచినారు. 14వ శతాబ్దం వాడైన శ్రీనాథకవి సార్వభౌముడు తన కావ్యమునందు ఈ క్షేత్రమును పీఠికాపురం, పీఠాపట్టణము మరియు పిఠాపురముగా వర్ణించాడు. శ్రీకుక్కుటేశ్వరక్షేత్రం కాశీ, కేదార, కోణార్క, కుంభకోణములకు సాటియగు మోక్షదాయమని వర్ణించాడు.
ఇక్కడ జరిపే దానం, హోమం, అధ్యయనం, శ్రాద్ధం, దేవతార్చనలు, వ్రతాలు మొదలగునవి కోటి రెట్లు ఫలితములిచ్చునని భీమేశ్వరపురాణం నందు వివరించాడు. కుక్కుటేశ్వర శతకం అను కావ్యమును శ్రీకూచిమంచి తిమ్మకవి స్వామివారికి అంకితమిచ్చాడు. శ్రీ వారణాసి వేంకటేశ్వరకవి, శ్రీ దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి కవి, శ్రీ ఓరుగంటి వెంకటశాస్త్రికవి మొదలగు కవులు తమ కవితా భక్తి కుసుమాలతో స్వామిని అర్చించుకుని ధన్యులైనారు.
సర్వేజనా సుఖినోభవంతు
- రామ కృష్ణంరాజు గాదిరాజు