ఇదీ ఉపపాండవుల కథ!
మహాభారతంలో పాండవులకు ఉన్న ప్రాముఖ్యత ఉపపాండవులకు కనిపించదు. పాండువులకు ద్రౌపది వల్ల కాకుండా ఇతర భార్యల వల్ల కలిగిన అభిమన్యుడు, ఘటోత్కచుని వంటి వీరులకు దక్కిన ప్రాధాన్యతా ఉండదు. అయినంత మాత్రాన వీళ్లు తక్కువవాళ్లని కాదు. పరాక్రమంలో పాండవులంతటివారే! కురుక్షేత్ర సంగ్రామంలో తమ వీరత్వాన్ని రుచిచూపినవారే! అలాంటి ఈ ఉపపాండవుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవిగో...
జన్మవృత్తాంతం
హరిశ్చంద్రుని సత్యసంధతను పరీక్షించేందుకు, విశ్వామిత్రుడు అతడి కుటుంబాన్ని నానా కష్టాలూ పెట్టిన కథ తెలిసిందే! వారి నుంచి సకల సంపదలూ తీసుకోవడమే కాకుండా, రాజ్యం నుంచి కూడా వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తాడు. విశ్వామిత్రుని కరకుదనాన్ని ముల్లోకాలూ ముక్కున వేలేసుకుని చూస్తుండిపోతాయి. కానీ దేవలోకం నుంచి ఇదంతా గమనిస్తున్నా ‘విశ్వులు’ అనే అయిదుగురు దేవతలు మాత్రం, విశ్వామిత్రుని వంటి రాజర్షికి ఇలాంటి ప్రవర్తన తగదంటూ వారించారు. దాంతో అహం దెబ్బతిన్న విశ్వామిత్రడు వారిని నరులుగా జన్మించమని శపించాడు. ఆ తరువాత వారి వేడుకోలుని మన్నించి మరుసటి జన్మలో ఎలాంటి భవబంధాలలోనూ చిక్కుకోకుండా మరణిస్తారని కాస్త ఉపశమనాన్ని కలిగించాడు. అదిగో అలా నరులుగా జన్మించిన విశ్వులే ఉపపాండవులు!
పాండవులలాగే ఉపపాండవులు కూడా అయిదుగురే! వీరిలో...
- ధర్మరాజుకీ ద్రౌపదికీ జన్మించినవాడు ప్రతివింధ్యుడు. వింధ్యపర్వతానికి సాటి అయినవాడు కాబట్టి ఇతనికి ఈ పేరు వచ్చిందట. ఇతనికే శ్రుతవింధ్యుడని కూడా పేరు ఉంది. ధర్మరాజు తనయుడు కాబట్టి, ఆయన తరువాత హస్తినాపురాన్ని ఏలే అర్హత కలిగినవాడు. కురక్షేత్ర సంగ్రామంలో చిత్రసేనుడనే వీరుని సంహరించాడు.
- ఉపపాండవులలో రెండోవాడు నకులునికీ, ద్రౌపదికీ పుట్టిన శతానీకుడు. పాండురాజుకి కుంతీదేవి, మాద్రి... ఇద్దరు భార్యలు అన్న విషయం తెలిసిందే! వీరిలో కుంతీదేవి కుమారులలో పెద్దవాడైన ధర్మారాజుతో ద్రౌపది తన తొలి సంతానాన్ని కంటే, మాద్రి పెద్ద కుమారుడైన నకులునితో తన రెండో బిడ్డను పొందేందుకు సిద్ధపడింది. అందుకని శతానీకుడు ఉపపాండవులలో రెండోవాడయ్యాడు. ఆ పెద్దరికంతోనూ, పరాక్రమంతోనూ... కురుక్షేత్ర సంగ్రామంలో పాండవ వీరుడు దృష్టద్యుమ్నుని సేనకు నాయకత్వం వహించాడు.
- భీమసేనుడికీ, ద్రౌపదికీ జన్మించిన శుతసోముడు పాండవులలోకెల్లా భీకరునిగా పేరుగాంచాడు. అందుకే అర్జునుడికి సైతం ఇష్టుడయ్యాడు. కురుక్షేత్ర యుద్ధంలోని ఒకానొక సందర్భంలో ద్రోణునీ, అశ్వత్థామనీ నిలువరిస్తాడు ఈ శుతసోముడు.
- సహదేవునితో ద్రౌపదికి జన్మించినవాడు శ్రుతసేనుడు. గొప్ప సేనలను కలిగినవాడు అని ఈ పేరుకి అర్థం.
- ఇక ద్రౌపదితో అర్జునుడికి జన్మించిన కుమారుడు శ్రుతకర్ముడు. ఉపపాండవులందరిలోకీ చిన్నవాడు కాబట్టి, చాలా గారాబంగా పెరిగినవాడు ఈ శ్రుతకర్ముడు. అయితే విశ్వామిత్రుడు సూచించినట్లుగానే, ఈ ఉపపాండవులంతా ఎలాంటి భవబంధాలలోనూ చిక్కుకోకుండా అర్ధంతరంగా చనిపోతారు.
అశ్వత్థామ చేతిలో...
కురుక్షేత్ర సంగ్రామం ముగింపుకి వచ్చేసరికి మహామహాయోధులంతా కుప్పకూలిపోతారు. ఇక కౌరవుల గురువైన ద్రోణాచార్యుని కూడా పాండవులు హతమారుస్తారు. అయితే ద్రోణునికి అబద్ధం చెప్పి, ఆయనతో అస్త్ర సన్యాసం చేయించి... పాండవులు ఆయనను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారన్న ఆవేశంతో రగిలిపోతాడు ద్రోణుని కుమారుడైన అశ్వత్థామ. తన పగకు ప్రతీకారంగా పాండవులను సమూలంగా నాశనం చేస్తానని బయలుదేరతాడు.
పాండవులను ఎలాగైనా చంపాలన్న కసితో ఉన్న అశ్వత్థామ యుద్ధనీతిని సైతం కాదని రాత్రివేళ వారిని చంపాలనుకుంటాడు. ఆ ఆవేశంలో ఓ చీకటివేళ పాండవుల గుడారంలోకి ప్రవేశించి అక్కడ నిద్రస్తున్న అయిదుగురినీ నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు. కానీ ఆ చీకటిమాటున అశ్వత్థామ చేతిలో హతులైనవారు పాండవులు కాదు... ఉపపాండవులే!
అలా మహాభారతంలో ఉపపాండవుల కథ ముగుస్తుంది. ఉపపాండవులను అకారణంగా, అధర్మంగా పొట్టన పెట్టుకున్నందుకు చిరకాలం రోగాలతో జీవచ్ఛవంగా బతకమన్న కృష్ణుని శాపాన్ని పొందుతాడు అశ్వత్థామ.