సబ్జాతో ఆరోగ్యం
సబ్జాతో ఆరోగ్యం
-వేసవిలో చలువ
-సబ్జాలకు పెరుగుతున్న డిమాండ్
-ఔషధ, పోషకాలు మెండు
-250 గ్రాములు రూ.110 వరకు..
ఒంటికి చలువ.. వేసవి తాపానికి సాంత్వన వెరసీ సబ్జా గింజల వాడకం రోజు రోజుకూ పెరుగుతోంది. ఎండ నుంచి ఉపశమనాన్ని పొందడానికి అప్పటికప్పుడు తయారు చేసే శీతల పానీయల్లో ప్రధానమైనది సబ్జా. ఇటీవల కాలంలో ఇంట్లో తయారు చేసుకునే ప్రతి పానీయాలల్లో ఇవీ కనిపిస్తున్నాయి సబ్జాలు. ఆరుబయట మార్కెట్‌లో టీ వ్యాపారులు 12 రకాల ప్రత్యేక టీలు తయారు చేస్తున్న వారు తాము తయారు చేసే ప్రతిదానిలో సబ్జాలు వాడుతున్నారు. చెరుకు రసం, ఐస్‌క్రీమ్‌లు, బేకరీలు, పండ్ల రసాలు, మిక్స్‌డ్ ప్రూట్ జ్యూస్ ఇలా ఒంటి చల్లదనానికి తయారు చేసే పానీయం ఏదైనా సరే సబ్జా గింజలను వాడాల్సిందే. వీటి రుచి, సువాసనను కస్టమర్లు ఫిదా అయిపోతున్నారు. సబ్జాల వినియోగం వేసవిలో మరింత పెరిగిందని వ్యాపారులు చెపుతున్నారు.
• చల్లని.. వేడి పానీయాల్లో వినియోగం..
గతంలో మన పెద్దలు సబ్జా గింజలు నానబెట్టి షర్బత్ పానీయంలో కలిపి వాడే వారు. ఇప్పుడు శీతల వేడి పానీయాల్లో ఏవైనా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో గ్రీన్, పుదీనా, బ్లాక్ టీలల్లో సబ్జాల వాడకం బాగా పెరిగింది. వీటితో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న పార్కులకు ఉదయం, సాయంత్రం నడవడానికి వచ్చే వారికి పుట్‌పాత్‌పై చిరువ్యాపారులు అందిస్తున్న వివిధ రకాల జావల్లో కూడా సబ్జాలు కలుపుతున్నారు. ప్రస్తుతం సబ్జాల వినియోగం పెరగడంతో అని షాపుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నారు. గతంలో సబ్జాలకు పది షాపులు తిరిగితే ఏదో ఒక షాపుల్లో దొరికేవి. కానీ నేడు ఆ పరిస్థితి లేదు సబ్జాలు అన్ని షాపుల్లో అందుబాటులో ఉంటున్నాయి.
• సబ్జాలు విక్రయాలు ఇలా....!
అన్నిరకాల పానీయాల్లో సబ్జాల వాడకం పెరగడంతో మార్కెట్‌లో సబ్జాలకు గిరాకీ పెరిగింది. జన రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వివిధ రకాల వ్యాపారులు వాడే సబ్జాలు రోజుకు ఐదు కేజీల నుంచి ఎనిమిది కేజీల వరకు పెరిగిందని పలువురు దుకాణాదారులు చెపుతున్నారు. నగరంలో ఆయా ప్రాంతాలను బట్టి సబ్జాలు కేజీ మూడొందల రూపాయల నుంచి నాల్గొందల వరకు ధర పలుకుతుంది. అయితే చిరు వ్యాపారులు కొనుగోలు చేసే షాపుల్లో 250 గ్రాములు 110 రూపాయల వరకు ధర పలుకుతుంది. .
• సబ్జా గింజల్లో ఔషధ గుణాలు...
సబ్జా గింజలు వాడటంతో చలవే కాదు. శరీరంలో వేడిని తగ్గింస్త్తుంది. మలబద్ధకం తగ్గించి, జీర్ణ శక్తిని పెంచుతుంది, పోషక విలువలను, రక్తాని శుద్ధి చేసి మచ్చలను తగ్గిస్తుంది. అధిక బరువు డిప్రెషన్, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలతో పాటు చాలా రోగాల సమస్యలకు సబ్జా గింజలు చెక్ పెడుతాయి. సబ్జాలను ఆహారంగా కాకుండా పానీయంలో కొన్ని కలుపుకోని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వేసవిలో శరీరంలోని జీర్ణక్రియలో పలు మార్పులు జరుగుతాయి. వాటిని నియంత్రించే శక్తి సబ్జాలకు ఉంటుంది.
• సబ్జాల అమ్మకం పెరిగింది...!
ప్రజలకు ఇప్పుడు సబ్జా ప్రాధాన్యం గురించి తెలిసింది. అందరూ వాటిని వాడుతున్నారు. అందుకే సబ్జా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. సబ్జా వాడకం వ్యాపారుల్లోనే కాకుండా ఇళ్లల్లో కూడా పెరిగింది. గతంలో ఒకళ్లో ఇద్దరో సబ్జాని తీసుకుపోయే వారు. ప్రస్తుతం అందరూ వీటిని కొంటున్నారు..
- రాజేంద్రప్రసాద్ తాళ్లూరి