Online Puja Services

సన్యాసి - తొమ్మిదో తిరుకళ్యాణం

3.147.68.201

సన్యాసి - తొమ్మిదో తిరుకళ్యాణం

అది సాయం సంధ్యా సమయం. శ్రీమఠంలో మహాస్వామి వారి దర్శనం కోసం చాలామంది భక్తులు వేచియున్నారు. మహాస్వామి వారు తమ గదిలోనుండి బయటకు వచ్చి మామూలుగా వారు కూర్చునే స్థలంలో గోడకు చేరి కూర్చొనారు. ఒక్కొక్కరుగా భక్తులు వస్తూ మహాస్వామి వారికి సాష్టాంగం చేసి, వారిని ప్రార్థించి తమ కష్టాలను తీర్చవలసినదిగా కోరుకుంటున్నారు. మహాస్వామి వారు వారికి తగిన సూచనలను ఇచ్చి వారిని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపుతున్నారు.

రాత్రి 8:30 అయ్యేటప్పటికి భక్తులు అందరూ మహాస్వామి వారి దర్శనం ముగించుకుని వెళ్ళిపోయారు. వారు గదిలోకి వెళ్ళడానికి లేస్తూ ఉండగా తొందర పడుతూ దంపతులు వచ్చారు. వారి వెంట ఒక అమ్మాయి కూడా వచ్చింది. వారు మహాస్వామికి సాష్టాంగం చేసి వారితో పాటుగా తెచ్చిన నాలుగు పెద్ద సంచులలో నుండి పదార్థాలను తీసి అక్కడ ఉన్న పెద్ద పళ్ళెంలో పెట్టి మహాస్వామి వారికి సమర్పించారు.

మహాస్వామి వారు ఆ పళ్ళాలలో ఉన్న కలకండ, జీడిపప్పు, పిస్తా, బాదం, ఎండు ద్రాక్ష, ఖర్జూరం మొదలైనవాటిని కొద్దిసేపు చూసారు. తరువాత వాటిని తెచ్చినవారిని చూసి చాలా సంతోషంతో. ”అరెరె! మన విశ్వనాథన్! అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు? నీ భార్య కూడా వచ్చిందా? భేశ్, భేశ్! చాలా సంతోషం. అందరూ బావున్నారా? ఏమి! ఎందుకు ఇవన్నీ తీసుకుని వచ్చావు? పెళ్ళి గురించి ఏమైనా శుభవార్తతో వచ్చావా? నీ పక్కన నిలుచున్నది నీ కూతురు కదూ? ఓహో పెళ్ళి సంబంధం కుదుర్చుకుని వచ్చావా? విశ్వనాథా మరి ఈ పళ్ళాలలో వివాహ పత్రిక లేదే?” అని మహాస్వామి అడిగారు.

అంతే! ఆ ముగ్గురూ మహాస్వామి పాదాలపైపడి గట్టిగా రోదిస్తూ గట్టు తెగిన నదిలాగా ఏడవడం మొదలుపెట్టారు.

మహాస్వామి వారికి అర్థం కాలేదు. కొంచెం అలోచించి ఆప్యాయతతో “ఏంటి విశ్వనాథా! నేనేమైనా తప్పు మాట్లాడానా? ఎందుకు చిన్నపిల్లలులాగా ఏడుస్తునారు?”

వెంటనే విశ్వనాథన్ గట్టిగా లెంపలేసుకుని ఆత్రుతగా “శివ శివా! అపచారం అపచారం! అలాంటిదేమి లేదు పెరియవ. మీరు పెళ్ళి నిశ్చయమైందా? పెళ్ళి పత్రిక ఏది? అని అడగగానే మేము మా బాధని ఆపుకోలేకపోయాము. పెరియవ ! ఈమెకిప్పుడు 25 సంవత్సరాలు. మేము తనకి పెళ్ళి చేయాలని 17వ సంవత్సరము నుండే సంవత్సరానికి రెండు నెలలు ఇక్కడ ఉండి అబ్బాయిని వెతుకుతున్నాము. కానీ ఇంతవరకూ ఒక్క సంబంధము కూడా కుదరలేదు. ఏదో కారణంచేత తప్పిపోతున్నాయి. చదువు, అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నా అదృష్టం లేదు” అని మళ్ళా ఏడవడం మొదలుపెట్టాడు.

అప్పుడు రాత్రి 9:30 అయింది. మహాస్వామివారికి పరిస్థితి అర్థమైంది. అతన్ని స్థిమితపరచడానికి “సరే బాధపడకు. రండి వచ్చి మీ ముగ్గురు ఇక్కడ కూర్చోండి” అని వారి ముందున్న స్థలం చూపించారు.

ముగ్గురూ అక్కడ కూర్చున్నారు. మహాస్వామి వారు మాట్లాడుతూ “విశ్వనాథా! నాకు తెలుసు నువ్వు ఎన్నో దేవాలయాలకి, చెరువులకి, ఎందరో పేదలకి దాన ధర్మాలు చేసావు. నీకు ఇంతటి మానసిక వేదనా! సరె, నువ్వు అమెరికా వెళ్ళి స్థిరపడి ఎన్ని సంవత్సరములు అయింది”

“20 ఏళ్ళు పెరియవ” విశ్వనాథన్ బదులిచ్చాడు.

మహాస్వామి వారు అమ్మాయిని చూపిస్తూ చిరునవ్వుతో “ఈమె నీ ఒక్కగానొక్క కూతురు కదా? ఏమిటి పేరు?” అని అడిగారు. విశ్వనాథన్ నోటికి తన చేతిని అడ్డంగా పెట్టుకొని “తన పేరు అపర్ణ. ఔను పెరియవ ఈమె ఒక్కతే” అని అన్నాడు.

”ఈమె జాతకాన్ని ఎవరైనా జ్యొతిష్కులకు చూపించావా?”

“చాలా మందికి చూపించాము స్వామి. ప్రతిఒక్కరూ ఏదో దోషము ఉందని చెప్తూ కొన్ని నివారణలు చెప్పారు. వారు చెప్పినవన్నీ చేసాము.”

మహాస్వామి వారిని “ఏమేమి చేసారు?” అని అడిగారు.
“పితృదోష పరిహారార్థం రామేశ్వరంలో తిల హోమం. కంజనూర్లో శుక్రప్రీతి, తిరునాగేశ్వరంలో రాహుప్రీతి, ఆలంగుడిలో గురుప్రీతి, కుర్తాళం దగ్గర్లోని తిరుమనంజరిలో ప్రత్యేక పూజ, తిరునల్లార్ లో నళతీర్థం లో స్నానం మరియు శనిప్రీతి ఇలా ఎన్నో చేసాము పెరియవ”

అతను ముగించేలోగా మహాస్వామి వారు అడ్డుపడుతూ ”అయినా ఫల ప్రాప్తి లేదు అంటావు” అని వెంటనే విశ్వనాథన్ భార్యతో “అమ్మాయి పెళ్ళికి కావలసిన నగలు అన్నీ చేయించారా?” అని అడిగారు.

“అన్నీ సిధ్ధము చేసాము పెరియవ ” అని ఆమె బదులిచ్చింది.

”భేశ్, భేశ్! ఎన్ని సవర్ల బంగారం పెడుతున్నారు అమ్మయికి” అని అడిగారు.

”ముప్పై సవర్లతో ఆభరణములు చేయించాము. దానితో పాటు రెండు సెట్లు ఇరవై ఇరవై సవర్లతో చేయించాము” అని విశ్వనాథన్ అన్నాడు.

”ఆ 20 సవర్ల రెండు సెట్లు ఎవరికోసం?”

“పెరియవ అపర్ణ పెళ్లి కుదిరితే తన పెళ్ళితో పాటు మరొ ఇద్దరు పేద అమ్మాయిలకు కూడా మొత్తం ఖర్చు మేమే భరించి పెళ్ళి చేద్దామని అనుకున్నాము. అందుకే వేరే ఆభరణాలు కూడా చేయించాము. కానీ అపర్ణ పెళ్ళే కుదరటం లేదు పెరియవ ” అని విశ్వనాథన్ భోరున విలపించాడు. అప్పుడు సమయం 10:30 కావస్తోంది.

మహాస్వామి వారు కొంచెం తీవ్రంగా అలోచించి విశ్వనాథన్ తో “ఎన్నిరోజులలో మీరు అమెరికా తిరిగివెళ్ళాలి?”
అని అడిగారు.

”ఇరవై రోజుల తరువాత పెరియవ ”

“భేశ్, భేశ్!” మహాస్వామి సంతోషించి “మీరు భోజనం ముగించారా?” అని అడిగారు.

“ఇంకా లేదు” అని విశ్వనాథన్ అన్నాడు.

మహాస్వామి వారు వంటవాడికి కబురుపంపి వాడు రాగానే “ఏముంది?” అని అడిగారు. ”అన్నం ఉప్మా గుమ్మడికాయ సాంబార్ ఉంది” అని అన్నాడు.

మహాస్వామి విశ్వనాథన్ కుటుంబాన్ని వంటశాలలోకి వెళ్ళి భోజనం చేసిరమ్మని ఆదేశించారు. వారు వచ్చేవరకు స్వామి వారు అక్కడే ఉన్నారు. అప్పుడు రాత్రి 11 గంటలు అయింది. వారు విశ్వనాథాన్ని ఆప్యాయంగా చూస్తూ “విశ్వనాథా నీకు గొప్ప హృదయం ఉంది. నీ కుమార్తె పెళ్ళితో పాటు ఇంకో ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి చేయాలని నగలు కూడా సిధ్ధపరచుకుని ఉన్నావు. నీది చాలా విశాల హృదయం. కామాక్షి నిన్ను తప్పక రక్షిస్తుంది.” అని అతన్ని అనునయించారు.

తరువాత అతనితో “ఒక పని చెయ్యి. రేపు ఉదయం కుటుంబ సమేతంగా తిరువణైకోయిల్ వెళ్ళు. అక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారికి, జంబుకేశ్వరునికి అభిషేకం చేయించు. అక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారి చెవులకి సువర్ణ శ్రీచక్ర తాటంకాలు అలంకరించబడి ఉంటాయి. మీ అమ్మాయి అపర్ణకు చెప్పు కళ్ళు ఆర్పకుండా ఆ తాటంకాలను చూస్తూ తనకు వివాహము త్వరగా జరగాలని కోరుకొమ్మను. అది చేసిన తరువాత”

విశ్వనాథన్ ఉత్సాహంతో స్వామివారి మాటలకు అడ్డుపడుతూ “పెరియవ మా ఇంటి దైవం ఆ అఖిలాండేశ్వరి అమ్మవారే” అని చెప్పాడు.

”భేశ్! అలాగైతే మరీ మంచిది. రేపు ఉదయమే మీరందరూ వెళ్ళి ఈ పని చెయ్యండి. అక్కడి నుండి తిరుమల వెళ్ళి స్వామి వారికి కళ్యానోత్సవం చేయించి స్వామిని ప్రార్థించండి. అంతా సరిపోతుంది. మీరు తెచ్చిన ఈ పదార్థములన్నీ ఆ అఖిలాండేశ్వరి అమ్మవారికి సమర్పించండి” అని మహాస్వామి లేచి నిలబడ్డారు.

వారందరూ స్వామికి సాష్టాంగం చేసారు. విశ్వనాథన్ స్వామి వారి వైపు చూసి సంకోచిస్తూ “పెరియవ నా కుమార్తెకి 17 సంవత్సరాల వయసప్పటి నుండి నేను ఎప్పుడు ఇక్కడకు వచ్చినా తిరుమల శ్రీనివాసునికి కళ్యాణం చేయిస్తున్నాను. ఇప్పటి దాకా ఎనిమిది సార్లు చేయించాను” అని అన్నాడు.

”సరే విశ్వనాథా! పోయేదేముంది. ఈ సన్యాసి కోసం తొమ్మిదో సారి చేయించు. (సరి విశ్వనాథ అథనాళ ఎన్న కొరంజుడా పొరథు? ఇంథ సన్యాసి సొల్రథుకాగ ఒంబతవథు థడవయ్యై నడతి వయ్యైన్)” అని మహాస్వామి నవ్వుతూ తమ గది లోపలికి వెళ్ళిపోయారు.

రెండురోజుల తరువాత విశ్వనాథన్ కుటుంబం మహాస్వామి వారు చెప్పినట్టు తిరువణైకోయిల్ లో అభిషేకము, తాటంక దర్శనము కావించుకొని తిరుమలకు వెళ్ళారు.

ఆ రోజు కళ్యాణం చేయించే ఆర్జిత భక్తులు చాలా మంది ఉన్నారు. కళ్యాణం జరిగే చోట భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. విశ్వనాథన్ కుటుంబం ఆ హాల్ మధ్యలో ఒక మూలలో కూర్చొని ఉన్నారు. అక్కడ ఉన్న వైఖానస అర్చకులు స్వామి వారి కళ్యాణాన్ని వేదోక్తమంత్రాలతో అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. వారి మంత్రోచ్చారణ తారాస్థాయికి చేరి ప్రాంగణమంతా ధ్వనిస్తోంది.

విశ్వనాథన్ భారమైన హృదయంతో “తండ్రి శ్రీనివాస! ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? నీవు నీ కళ్యాణాన్ని ప్రతిరోజు ఇంత వైభవంగా జరిపించుకుంటావు. మరి నా కూతురు అపర్ణ ఏం తప్పు చేసిందని తనకి తగిన వరుణ్ణి ఇచ్చి పెళ్ళి జరిపించటంలేదు” అని గట్టిగా ఏడుస్తున్నాడు. అతని భార్య కూతురు కూడా శోకిస్తున్నారు.

విశ్వనాథన్ కి దగ్గరలో ఒక కుటుంబం కూర్చొని ఉంది. ఆ కుటుంబ యజమానికి ఒక యాభై యాభైఐదు సంవత్సరముల వయస్సు ఉంటంది. అతను ఆప్యాయంగా విశ్వనాథన్ వెన్ను నిమురుతూ “అయ్యా నా పేరు వైద్యనాథన్. మాది మద్రాసు. నేను చాలాసేపటి నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను. ఇంత వైభవంగా ఆ శ్రీనివాసుని కళ్యాణం జరుగుతూ ఉంటే ఆనందంగా వీక్షించకుండా ఎందుకు మీరు ఏడుస్తున్నారు?” అని అనునయించారు.

విశ్వనాథన్ ఆయన మాటలకు కొంచెం నెమ్మదించి, తన బాధనంతా ఆయనతో పంచుకుని కాస్త కుదుటపడ్డాడు. వైద్యనాథన్ వెనుకకు తిరిగి అపర్ణను చూసాడు. అతనికి అమ్మాయి మంచి గుణవంతురాలు అనిపించింది.
వైద్యనాథన్ అతన్ని “మీ గోత్రమేంటి” అని అడిగాడు. ”వథుల గోత్రం”

“మాది శ్రీవత్స. మరి మీ అమ్మాయి వయస్సెంత?” అని అడిగాడు.

”ఇప్పుడు 25 సంవత్సరాలు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు” అని విశ్వనాథన్ అడిగాడు. అందుకు వైద్యనాథన్ ”ఈ కళ్యాణం అయిపోనివ్వండి. మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీతో మొత్తం చెప్తాను” అన్నాడు.

కళ్యాణం ముగించుకొని అందరూ ప్రసాదం తీసుకొని వైద్యనాథన్ ఉంటున్న అతిథి గృహానికి విశ్వనాథన్ కుటుంబాన్ని పిలిచుకొని వెళ్ళాడు. అక్కడ విశ్వనాథన్ తో “మేము తంజావూరు ప్రక్క మేలట్టూర్ వాళ్ళం. నేను ఇప్పుడు మద్రాసులోని రక్షణ పద్దుల శాఖలో పని చేస్తున్నాను. నాకు ఒక్కడే కొడుకు. పేరు శ్రీనివాసన్. వయస్సు 26 సంవత్సరములు. వాడు అమెరికాలో ఫోర్డ్ మోటార్స్ లో పనిచేస్తున్నాడు. రేపు తను సెలవు పైన మద్రాసుకు వస్తున్నాడు. గత మూడేళ్ళుగా అమ్మాయి కోసం వెతుకుతున్నాము. మేము కామకోటి మఠానికి భక్తులం. మూడు నెలల క్రింద మహాస్వామి వారిని దర్శించి, అబ్బాయికి పెళ్ళి కావట్లేదు అని అడిగితే తిరుమలకు వెళ్ళి శ్రీనివాసునికి కళ్యాణం చేయించమన్నారు. ఆ అదృష్టం ఇప్పుడు వచ్చింది. ఆయన అనుగ్రహం ఉంటే మీ అమ్మాయి మా కోడలు అవుతుంది” అని చెప్పాడు.

వాళ్ళు పిల్లల జాతకములను తీసుకుని తిరుమలలోనే ప్రముఖ జ్యోతిష్కులకు చూపించారు. ఆశ్చర్యంగా వారి ఇద్దరి జాతకాలు పది అంశాలలో కూడా చక్కగా కుదిరాయి. ఇరుకుటుంబాల వారు సంతోషంగా ఆ రాత్రికే చెన్నై బయలుదేరారు.

మరుసటి రోజు శ్రీనివాసన్ అమెరికా నుండి వచ్చాడు. అతనికి అపర్ణ నచ్చింది. అపర్ణకు కూడా అబ్బాయి నచ్చాడు. పదిహేను రోజుల్లో ముహూర్తాలు పెట్టుకుని చెన్నైలోని రాజేశ్వరి కళ్యాణ మండపంలో వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నారు. ఇరు కుటుంబాల వారు మహాస్వామి వారి దర్శనానికి కంచికి వచ్చారు. ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంవల్ల రాత్రి 9 గంటలకు మహాస్వామి వారి దర్శనం లభించింది. విశ్వనాథన్ వైద్యనాథన్ కుటుంబాలు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి, విశ్వనాథన్ మహాస్వామి వారికి తను తెచ్చిన పదార్థములను సమర్పించాడు. వైద్యనాథన్ వారి వెనుక నిలుచున్నాడు.

విశ్వనాథన్ కొంచెం సెపు మహాస్వామి వారు చూసి చిన్నగా నవ్వి, “ఏం విశ్వనాథా! ఈ సన్యాసి కోసం తొమ్మిదో సారి శ్రీనివాసునికి కళ్యాణం చేయించగానే ఫలం సిధ్ధించి అమ్మయి వివాహం నిశ్చయమైందా? భేశ్ భేశ్ నీ కుమార్తె అపర్ణ చాలా అదృష్టవంతురాలు.” అని గట్టిగా నవ్వారు.

వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మహాస్వామి వారు ”విశ్వనాథా ఆ రోజు నువ్వు బాధపడడం చూసి అలోచించి, మీ అమ్మాయికి జన్మాంతర వివాహ ప్రతిబంధక దోషం ఉన్నదని గ్రహించాను. దాని పరిహారం కొరకే అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంక దర్శనము, తొమ్మిదో సారి శ్రీనివాసునికి తిరుకళ్యాణము చేయించమని చెప్పాను. అర్థమయిందా!” అని అన్నారు.

మహాస్వామి వారు మళ్ళా “నీకు కాబొయే వియ్యంకులు ఎవరు? వాళ్ళది ఏవూరు?” అని అడిగారు. విశ్వనాథన్ వెనుక నిల్చున్న వైద్యనాథన్ ముందుకు వచ్చి స్వామికి సాష్టాంగం చేసి, “నేనే పెరియవ వీరికి కాబోయే వియ్యంకుడిని. అంతా మీ అనుగ్రహం” అన్నాడు.

మహాస్వామి వారు ముక్కు మీద వేలేసుకుని “ఎవరు? ఓహ్ మేలట్టూరు వైద్యనాథన్! ఏం వైద్యనాథా మూడు నెలల క్రితం నువ్వు వచ్చి అమెరికాలో ఉన్న మీ అబ్బాయికి సంబంధం కుదరటంలేదు అన్నావు. నిన్ను తిరుమల వెళ్ళి శ్రీనివాసుని కళ్యాణం చేయించుకోమన్నాను కదా? ఎప్పుడు జరిపించావు కళ్యాణం?” అని అడిగారు.

”ఇద్దరమూ ఒకే రోజే శ్రీనివాసుని కళ్యాణం చేయించుకున్నాము పెరియవ . సంబంధం కూడా అక్కడే నిశ్చయించుకున్నాము. అంతా మీ అశీర్వాదము పెరియవ ” అని మాటలు గాద్గదికమై మహాస్వామికి చెప్పాడు.

“సంతోషంగా ఉండండి” అని మహాస్వామి వారు వారిని మనస్పూర్తిగా దీవించారు. అప్పుడు సమయం పది గంటలు అయింది. మహాస్వామి వారు నవ్వుతూ “ఆలస్యమవుతోంది విశ్వనాథా! వాళ్ళు చెప్పారు మఠంలో ఈరోజు కూడా అన్నం ఉప్మా, గుమ్మడికాయ సాంబారు చేసారు. మీరందరూ ఇక్కడే ఫలహారం చెయ్యండి” అని చెప్పి పంపించారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam 

#కంచిపరమాచార్యవైభవం

 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore