Online Puja Services

ఏ రోజు ఏ వ్రతం చేయాలి?

18.118.37.85

ఏ రోజు ఏ వ్రతం చేయాలి? వాటి శుభఫలాలు

వారానికున్న ఏడురోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. దాని ప్రకారం ఒక్కో దేవతకూ ఒక్కో రోజు ప్రీతికరమైనది. అందుకే ఏ రోజున ఏ దేవుడిని లేదా దేవతను పూజించాలో, మన జనన మరణాలపై ప్రభావం చూపే గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైన రోజు ఏదో, వ్రతం ఏదో ముందుతరాలవారు చెప్పారు. మనమూ వారిని అనుసరిద్దాం! ఆ శుభఫలాలను అందుకుందాం! రోజుకో దేవతారాధనతో జీవితాలను సుగమం, శ్రేయోదాయకం చేసుకోవడం అత్యంత సులువు.

ఆదివారవ్రతం

చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతానక్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారంనాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారంనాడు ఉపవాసం ఉండి, సూర్యారాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. అయితే దీనిని ఒక వ్రతంలాగ ఆచరించాలి. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారంనాడు ఆరంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలూ ఆచరించాలి. అలా ఆచరించలేనివారు కనీసం 12 వారాలైనా చేయాలి.

వ్రతవిధానం:

ఆదివారంనాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి. ఆపైన గంగాజలాన్ని, లేదా శుద్ధోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయణుడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారమూ ఉపవాసం ఉంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.

సోమవార వ్రతం

అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు సోమవార పూజ శ్రేష్ఠమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారం నాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాలపాటు ఈ వ్రతాచరణ చేయాలి.

వ్రతవిధానం

చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో ‘ఓం నమశ్శివాయ’అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివపార్వతుల అష్టోత్తరం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పూవులు, శ్వేతగంధం, బియ్యంతో చేసిన పిండివంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండిఉంగరాన్ని ధరించాలి. పూజాసమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరివారంలో దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతోపాటు పాలు, పెరుగు, తెలుపురంగు వస్తువులను లేదా ఫలాలను దానం చేయాలి.

మంగళవారం

ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులను అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి మంగళవారవ్రతం ఆచరించాలి.

వ్రతవిధానం:

ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. కనీసం 21 వారాలపాటు చేయాలి. ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్ధిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు తదితర రోగాలు, దీర్ఘవ్యాధులు, రుణబాధలు ఉపశమిస్తాయి. రాగిపాత్ర, ఎరుపు రంగు పూలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలనకోసం ఈ వ్రతాచరణ చేసేవారు కుజాష్టోత్తరం లేదా మూలమంత్రం పఠించాలి.

బుధవారవ్రతం


స్థితికారకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందగోరేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు ఈ వ్రతాచరణ చేయాలి.

వ్రతవిధానం

ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజచేసేవారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చద్రాక్ష మొదలైన ఆకుపచ్చరంగులో ఉండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి. పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పండ్లు, పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డిని తినిపించడం శ్రేష్ఠం. ముడి పెసలతో చేసిన పదార్థాలను లేదా పిండివంటలను నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.

గురువారవ్రతం

మానసికప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపారజ్ఞానం, పాండిత్య అభివృద్ధిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి. ఇందుకోసం దక్షిణామూర్తి, షిర్డిసాయి, రాఘవేంద్రస్వామి, దత్తాత్రేయుడు లేదా తమ గురువును ఆరాధించాలి. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైన విద్యాఉద్యోగ ప్రతికూలతలు, అవమానాలు, అవహేళనలనుంచి తప్పించుకోవాలనుకునేవారు గురువార వ్రతం చేయాలి.

వ్రతవిధానం

ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడేళ్లపాటు చేయాలి. స్నానానంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి, కంచులోహ పాత్రలో పసుపు అక్షతలను, పసుపు పూవులను, పసుపును, పసుపు కలిపిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్

పును వినియోగించకూడదు, ఒక పూట తప్పనిసరిగా ఉపవాసం ఉండి, స్వామికి నివేదించిన పదార్థాలను స్వీకరించాలి.

శుక్రవార వ్రతం

దుర్గ, లక్ష్మి, సంతోషిమాత, గాయత్రి తదితర దేవతల అనుగ్రహాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి శుక్రవార పూజ శ్రేష్ఠమైనది.

వ్రతవిధానం

ఈ పూజను శ్రావణమాసం లేదా ఏమాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే తొలి శుక్రవారంనాడు ఆరంభించి 16 వారాలపాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లనితల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి.

శనివారవ్రతం


వేంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందగోరేవారు, శని, రాహు, కేతు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు శనివార వ్రతం చేయాలి.

వ్రతవిధానం

శ్రావణమాసం లేదా పుష్యమాసంలో వచ్చే తొలి శనివారంనాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాలపాటు వ్రతాచరణ చేయాలి. వేంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహసంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వులనూనె, గేదెనెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్నా, రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో సరిపెట్టుకోవాలి. ఆఖరివారం ఉద్యాపనగా నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం ఇవ్వాలి.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore