Online Puja Services

ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఏమిటి సంబంధం?

3.145.45.205

*ఆశీర్వచనం ఎందుకు చేస్తారు.....*

*ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఏమిటి సంబంధం.....*

*పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి.....*

భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు.  విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని,  పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు "గో బ్రాహ్మణో శుభంభవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు" అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు.

అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా ? అవి ఫలిస్తాయా ?  తప్పకుండా ఫలిస్తాయి...

సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలుగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి. అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు. గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు, వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి... అక్షింతల సంకేతం..... సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్బం లోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. 

ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం ? 
అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా ? 

మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి ? 

బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట. బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుబానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు. మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారంనుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది.

మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఏంతో ప్రాధాన్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్యమధ్యలో ”అక్షతాన్ సమర్పయామి” అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్రదాయం. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు.

మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది. బియ్యంలో తగినంత పసుపు, నాలుగు చుక్కలు నెయ్యివేసి అక్షతలను తయారుచేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారుచేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి.....

సేకరణ: రుక్మిణి శాస్త్రి 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha