Online Puja Services

ఆది శంకరాచార్య గురించి కొన్ని అద్భుత విషయాలు..

3.144.4.54

హిందూ మత పరిరక్షణ కొరకు అవతరించిన సరళ సిద్ధాంతవేత్త
ఆది శంకరాచార్యులు.  ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం.


శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్!
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్!!


ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్టితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం

దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే !
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః !!


దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (- శివరహస్యము నుండి).

కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః !
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా !!

శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి). జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ,శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ, కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం, ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది. ( క్రీస్తు పూర్వం అని రాసుకోడానికి చింతిస్తున్నాను, శంకరుల శకం శంకరుల పూర్వం అని రాసుకోగలిగే రోజు వస్తే బాగుండు )

ఆయన తన రెండవ ఏటనే రాయడం, చదవడం l గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవసంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు.కారణజన్ములైన శంకరాచార్యులవారు, సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవిందభగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.

ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది. ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా, ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ. “ కనకధారా స్తవం ” ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.

శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహం మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు .ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని, అనుమతినివ్వమనీ ప్రార్థించారు.తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ, ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు. దీనిని ఆతురన్యాసం అని అంటారు.సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను మెసలి వదిలివేసింది.

గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.

ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి, శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు.ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.

ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు, ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు.

ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ, అనేక, ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం మొదలైనవి. ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ,ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు. తల్లికిచ్చిన మాట కోసం తల్లి అవసాన దశలో " శ్రీకృష్ణభగవానుని " లీలలను చూపించి సంతోష పరచాడు !! ఆనాటి కట్టుబాటులను ఎదిరించి తాను సన్యాసి అయినా కన్నతల్లి అంత్యేష్ఠిని స్వయంగా నిర్వహించాడు !! ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారిలభట్టు, మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు,పద్మపాదుడు, సురేశ్వరుడు, పృధ్వీవరుడు మొదలైన వారు.

వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు. హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన, ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ, అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు, ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకథారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.ఈయన 108 గ్రంథాలు రచించారు.

శృంగేరి .. బదరి .. పూరీ .. ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరులవారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే, ఇక శంకరులవారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. శంకరుల చిన్నతనంలో ఆయన  నన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. ధర్మసంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీ లో గోవర్ధన మఠం, దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో శారదా మఠం, పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం, ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ, ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.

మఠము-పీఠము :-

సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి (వందల సంవత్సరాల)నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది

" అధ్వైతసిద్ధాంతాన్ని " ప్రచారం చేశారు !! దేశంలో నాలుగు వైపుల నాలుగు ప్రధానమైన పీఠాల్ని నెలకొల్పి దేశ సమగ్రత ను ఆధ్యాత్మికతను కాపాడారు !!


1- తూర్పున పూరీ క్షేత్రంలో గోవర్ధన పీఠం - రుగ్వేదం !!

2- దక్షిణాన శృంగేరీ క్షేత్రంలో శారదా పీఠం - యజుర్వేదం!!

3 - పశ్చిమాన ద్వారకలో ద్వారక పీఠం - సామ వేదం !!

4 - ఉత్తరాన బదరి క్షేత్రంలో జ్యోతిష్ పీఠం-యజుర్వేదం!!


నలుగురు శిష్యులను నాలుగు పీఠాలకు అధిపతులను చేసారు. '’కంచికామకోటి '’ పీఠాన్ని స్థాపించి తానే స్వయంగా కొన్ని రోజులు పీఠాన్ని అధిరోహించి హిమాలయాలకు వెల్లి చిన్న వయసులోనే 32 సంవత్సరాలకే తనువు చాలించారు !!

చతుర్మఠాలు

ద్వారకా మఠము :- ఈ మఠము శంకరులచే,దేశానికి పశ్చిమంగా, మొదటగా స్థాపించబడింది.దీనిని కాళికామఠమనీ, సిద్ధేశ్వరమఠమనీ, పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు.

గోవర్ధన మఠము:- దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు.ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో

శృంగేరీ మఠము :- ఇది దక్షిణామ్నాయమఠమని, శారదాపీఠమనీ పిలువబడుతుంది.కర్ణాటక రాష్ట్రములోని శృంగేర(శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది

జ్యోతిర్మఠము :- దీనిని ఉత్తరామ్నాయ మనీ, బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం; పీఠ దేవత నారాయణుడు.శంకర మఠము{కంచికామకోటి పీఠము) :-

సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా, శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది.ఉన్నది ఒక్కటే పరబ్రహ్మస్వరూపం అనే అధ్వైతం నుప్రభోధించారు !!ఇది జ్ఞానమార్గంలో ఉత్కృష్ఠ స్థాయిలో వున్న వారికే ఈ సత్యం అవగతమౌతుంది కనుక సామాన్య జనం కోసం అనేక దేవీ దేవతల పై అష్టకాలు స్తోత్రాలను రచించాడు ! ముందు విగ్రహారాధన చేయమన్నారు !!ప్రస్థాన త్రయం అంటే భగవద్గీత - బ్రహ్మసూత్రాలు -

ఉపనిషత్తలు ! వీటికి భాష్యం (వేదాంత- వ్యాఖ్యానం)రాశారు !

శివుడు - అంబిక - గణపతి - విష్ణువు - సూర్యులను ఆరాధించి తరించాలని వేదోక్త " పంచాయతన "పూజ పద్ధతిని ప్రవేశ పెట్టి విగ్రహారాధనకు ఆలంభనగా నిలిచారు!!

ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళుతుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. ఎనిమిది రోజులపాటు చర్చ జరిగిన తరువాత వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది సాక్షాత్తు వ్యాసుడే అని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు తెలిపగా, శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమే అని ప్రశంసించాడు. వేదవ్యాసుడు వెళ్ళిపోతుండడం చూసి శంకరులు 'నేను చెయ్యవలసిన పని అయిపొయింది. నాకు ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించ'మని వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు 'లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులు అనేకమందిని ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్చానురక్తి అర్థాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకు ఇచ్చిన ఎనిమిది సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరొక 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక అని దీవించి అంతర్థానం అయ్యాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్షు ఎనిమిది సంవత్సరాలు, తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు , వ్యాసమహర్షి అనుగ్రహంవల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన 32 వఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.


ముగింపు

అలాంటి శంకరులవారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడంకన్నా పుణ్యమేముంటుంది ? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి. పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానధర్మాలు చేయాలి. వారి పిల్లల ఉన్నత విద్యకు ... ఉపనయనాలకు ఆర్ధికపరమైన సహాయ సహకారాలను అందించాలి. ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ, దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి.

ఆదిశంకరులు అవతరణకు ముందు దేశంలో ఏ పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి.అప్పుడు శంకరుడు అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి.ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి. ఆయన మనకు స్ఫూర్తి.ఆయన మనలోనే, మనతోనే ఉన్నారు. అందుకే మనము ఈ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. సనాతన ధర్మం మన తల్లి. తల్లి రుణం తీర్చుకో వలసిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మాన్ని తెలుసుకొని, ఆచరించి, శక్తిని సంపాదించి, స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి. ధర్మాన్ని కాపాడు. ధర్మాన్ని విస్మరిస్తే జాతి అధోగతి పాలు కాక తప్పదు. కలియుగంలో గురువైన శ్రీ ఆదిశంకరాచార్యులు రక్ష సదా మనపై ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని అనుసరించు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి, అడుగడుగునా భక్తిభావ సుమాలను వికసింపజేసిన అపరశంకరులు..శ్రీఆదిశంకరులు

అలాంటి శంకరుల వారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడంకన్నా పుణ్యమేముంటుంది ? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి.

ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ, దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి. ఈ విధంగా చేయడం వలన పాపాలు నశించి ... విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.

- Suhasini Nallana

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore