Online Puja Services

అమరశిల్పి జక్కన

3.22.194.5

అమరశిల్పి జక్కన 

మనకు సినిమా ద్వారా పరిచయమైన పేరు... ఇతని గురించి ఏ చరిత్ర పుస్తకమూ మనకు పాఠాలు నేర్పలేదు....పాశ్చాత్యులు కళ్ళు తెరువక ముందే... విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లో ... డ్రిల్ బిట్ లేకుండా ఇంత అద్భుతాన్నీ సుసాధ్యం చేసిన మన అమరశిల్పి జక్కన్న చెక్కిన శిల్పాలు మనకు ఎన్నో విషయాలు తెలుపుతున్నాయి. 

జక్కన ఎందుకు అమరశిల్పి అయ్యాడో బేలూర్ హలెబీడు దేవాలయ శిల్పాలు చూసాక కానీ అర్థం కాలేదు..మనకు తెలిసినంత వరకు ఒక శిల్పం అంటే… ఒక దేవతా మూర్తి అవయవాలన్నీ సక్రమంగా రూపొందించి చుట్టూ ఒక ఆర్చి లాంటిది పెట్టేస్తే సరి… ఇక శిల్పం పూర్తయినట్టే. హలేబీడు , బేలూరు లోని శిల్ప సంపదను చూస్తే అవి ఒక్క అంగుళం కూడా వదలకుండా లతలు, అల్లికలతో, విచిత్రమైన డిజైన్లతో నిండి ఉండడం స్పష్టంగా చూడవచ్చు. ఆ స్త్రీ మూర్తుల మెడలో అలంకరించిన హారాలు, చెవి రింగుల్లోని పూసలతో సహా… చేతి వేళ్ళకు వుండే గోళ్ళను, ఆఖరికి జుట్టు కొప్పులోని వెంట్రుకలను కూడా శిల్పంలో స్పష్టంగా చూపించడం అంటే… మనుషులకు ఎవరికైనా సాధ్యమయ్యే పనే కాదు... ఒక చిన్న పొరపాటు జరిగినా చెక్కిన శిల్పం అంతా వృథా అయిపోయే శ్రమ తీసుకుని, పొరపాటుకు తావు లేకుండా కొన్ని వందల కొద్దీ శిల్పాలు ఎలా చెక్కగలిగారో ఆరోజుల్లో... … అవి కూడా ఇంకెవరికీ అనుకరించడానికి కూడా వీలు లేనంత అద్భుతంగా చెక్కిన ఆ మహానుభావుని మేథస్సు, సాధన, కళా నైపుణ్యం, అంకితభావం అనిర్వచనీయం... 

దేవలోకంలో నివసించే ఏ యక్షుడో, గంధర్వుడో శాపవశాన ఇలా కొన్నాళ్ళు భూమిపైకి వచ్చి... ఇలాంటి వాడు ఒకడు ఈ భూమిపై, ఈ మనుషుల్లో కలిసి తిరిగాడని మనం నమ్మడానికి గుర్తుగా ఈ శిల్పాలు చెక్కి వెళ్లిపోయాడని అనిపిస్తుంది. మొనాలిసాను ఒక్కదాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు డావిన్సి గురించి ప్రపంచమంతా డబ్బా కొడుతున్నారు, సినిమాలు తీస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు... పికాసోను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. మరి మనలో కలిసి తిరిగిన ఒకడు... మన ఊరి చావిట్లో పడుకుని, మన ఇంట్లో చద్దన్నం తిని, మన నేలపై అతి సామాన్యంగా తిరిగిన ఒకడు ఇంతటి అసామాన్యుడని ఈ రాళ్ళకు కూడా అర్థమై అతనికి దాసోహం అన్న తరువాత కూడా మన మట్టి బుర్రలకు ఎందుకు తెలియడంలేదు..?ఒప్పుకున్న ఒప్పుకోకున్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని... ఎలుగెత్తి చాటరా జక్కన్న శిల్పాల్ని..

జక్కన్న ఆచారి (Jakkanna) క్రీ.శ. 12వ శతాబ్దంలో కర్ణాటకలోని హోయసల రాజులకాలం నాటి శిల్పి. కర్ణాటక రాష్ట్రం, హసన్ జిల్లా బేలూరు మరియు హళిబేడులో గల ఆలయాల శిల్పకళ జక్కన్నచే రూపుదిద్దుకున్నదే. బేలూరు చెన్నకేశవ ఆలయంలో గల శిల్పాలు ఇతని కళావిజ్ఞకు తార్కాణం. 

జక్కనాచారి కర్ణాటకలోని తుముకురు దగ్గర కైదల అనే గ్రామంలో జన్మించాడు. వీరి జీవితం అంతా ప్రేమ మరియు కళలకు అంకితం చేసిన ధన్యజీవి. ఇతడు నృపహయ అనే రాజు కాలంలో జీవించాడు. వివాహం చేసుకున్న అనతికాలంలోనే శిల్పకళ మీద అభిరుచితో దేశాటన కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. సుదూర ప్రాంతాలు ప్రయాణించి ఎన్నో దేవాలయాలు నిర్మించి శిల్పకళలో నిమగ్నమై భార్యను మరియు కుటుంబాన్ని మరిచిపోయాడు.

జక్కనాచారి భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది; అతడే ఢంకనాచారి. చిన్నప్పుడే శిల్పిగా తీర్చిదిద్దబడిన ఢంకన తండ్రిని వెదుకుతూ దేశాటనం మీద వెళతాడు. బేలూరులో అతనికి శిల్పిగా అవకాశం లభిస్తుంది. అక్కడ పనిచేస్తున్న సమయంలో జక్కన చెక్కిన ఒక శిల్పంలో లోపం ఉన్నదని ఢంకన గుర్తిస్తాడు. కోపగించిన జక్కన్న లోపాన్ని నిరూపిస్తే కుడి చేతిని ఖండించుకుంటానికి ప్రతిజ్ఞ చేస్తాడు. పరీక్షించిన తరువాత ఆ శిల్పంలోని లోపం నిజమైనదేనని నిరూపించబడుతుంది. ప్రతిజ్ఞా పాలన కోసం జక్కన్న తన కుడి చేతిని తానే నరుక్కుంటాడు. ఆ సమయంలోనే వీరిద్దరు తండ్రీకొడుకులని గుర్తిస్తారు. జక్కన్న తండ్రిని మించిన తనయునిగా ప్రసిద్ధిపొందుతాడు.

అనంతరం జక్కనాచారికి క్రిడాపురలో చెన్నకేశవ దేవాలయం నిర్మించమని ఆనతి లభిస్తుంది. అది పూర్తయిన తరువాత అక్కడి దేవుడు అతని కుడి చేతిని తిరిగి ప్రసాదిస్తాడని చెబుతారు. ఈ సంఘటన ప్రకారం, క్రిడాపురను కైడల అని వ్యవహరిస్తున్నారు. కన్నడంలో 'కై' అనగా చేయి అని అర్థం.

ఇంతటి ప్రసిద్ధిచెందిన కళాకారుని జ్ఞాపకార్ధం కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం అదే రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ శిల్పులు మరియు కళాకారులకు జక్కనాచారి అవార్డులు ప్రదానం చేస్తుంది.

 

 

 

 

 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha