Online Puja Services

కనకధారా స్తోత్రం ఎలా పుట్టింది?

3.142.201.93

ఒకరోజు గురువుగారు శంకరుడిని పిలిచి – “నాయనా! నువ్వు నాలుగు ఇళ్ళకు వెళ్ళి భిక్షాన్నాన్ని తీసుకురా” అన్నారు. శంకరులతో పాటుగా కొందరు స్నేహితులు కూడా బయలుదేరారు. ఇది శంకరుల జీవితంలో మధురాతిమధురమైన ఘట్టం. శంకరులు, అతని స్నేహితుడు – ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందుకు వెళ్ళి “భవతి భిక్షాం దేహి” అన్నారు. ఆవిడ పరమ దరిద్రురాలు. ఎంత దారుణమైన స్థితి అంటే వంటిమీద కట్టుకోవడానికి సరియైన వస్త్రం లేదు. తినడానికి తిండిలేదు. ఒకరికి దానమివ్వడానికి ఇంట్లో కనీసం ఉప్పు కూడా లేదు. అంత దరిద్రంలో ఉన్న ఆ స్త్రీ ఇంటిముందుకు శంకరులు వెళ్ళారు. దానం చాలామందికి చేస్తూ ఉంటాం. కానీ పుచ్చుకునే వాడు నిరాపేక్షగా, ఎటువంటి కోరికా లేకుండా తీసుకుంటే దాని ఫలితం వేరుగా ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి బ్రహ్మచారి తన ఇంటి ముందుకు వచ్చాడని ఆ పేద స్త్రీ గ్రహించింది. కానీ ఆమె దగ్గర భిక్ష వేయటానికి ఏమీ లేదు. ఒకవైపు వచ్చిన వాడు వెళ్ళిపోతాడేమోనని భయం. మరోవైపు వేయటానికి ఏమీలేదనే ఆదుర్దా. ఇల్లంతా వెతికింది. ఏమీ దొరకలేదు. నిస్సహాయ స్థితిలో శంకరుని దగ్గరకు వచ్చి – “నా ఖర్మయ్యా! నీలాంటి వాడు వచ్చి ‘భవతి భిక్షాం దేహి’ అన్నాడు. నీ చేతిలో ఇలా వేయటానికి నా దగ్గర ఏమీ లేదు. ఇవ్వాలని ఉంది. కానీ ఇవ్వటానికి ఏమీ లేదు...” అని కన్నీరు పెట్టుకుంది.

శంకరుడి మనస్సు కరిగింది. ఆ స్త్రీకి ధనం ఎవరివ్వాలి? లక్ష్మీదేవి ఇవ్వాలి. ఎనిమిదేళ్ళ వయస్సులో లక్ష్మీదేవిని స్తుతిస్తూ – శంకరుడు ‘అంగఃహరేః పులకభూషణ మాశ్రయంతి..” అంటూ కనకధారా స్తోత్రాన్ని ఆశువుగా స్తుతించారు. లక్ష్మీదేవి ప్రత్యక్షమయింది. అప్పుడు శంకరులు “అమ్మా నాకేం అక్కరలేదమ్మా, చూశావా దరిద్ర భ్రాహ్మణి...ఎంత బాధ పడుతోందో? ఆవిడకి ఏదైనా కొద్దిగా సంపద కలిగేటట్లు అనుగ్రహించు” అని ప్రార్థించారు. అప్పుడు లక్ష్మీదేవి “శంకరా! నిన్ను చూసిన తర్వాత ఆమెకు ఏదైనా చేయాలనిపిస్తోంది. కానీ ఆవిడ గతజన్మలలో ఉన్నదంతా పాపమే. దాని ఫలితమే ఈ దరిద్రం. ఆమె ఏదైనా పుణ్యం చేస్తే నేను సంపద ప్రసాదిస్తా” అంది. శంకరులు ఆలోచించారు. ఈ దరిద్ర స్త్రీతో “ఇల్లంతా వెతికి చిన్న ఉసిరికాయైనా దొరికితే నాకు భిక్ష వేయి అది చాలు నీ పాపాలు పోవడానికి” అన్నారు. ఈ స్త్రీ ఇల్లంతా వెతికి ఒక ఎండిపోయిన ఉసిరికాయను దానం చేసింది. లక్ష్మీదేవి ఆమె ఇంట్లో బంగారు ఉసిరికలు కురిపించింది. ఇప్పటికీ ఆ ఇల్లు కేరళలో ఉంది. ఈ స్త్రీ వారసులు ఇంకా అక్కడే నివసిస్తూ ఉంటారు.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore