Online Puja Services

పంచ కోశములు - వివరణ

18.117.75.53
ప్రశ్నోపనిషత్తులో  పిప్పిలాద మహర్షి చెప్పినట్లుగా, ఆత్మ మానవుడి యందు అయిదు కోశాలచేత ఆవరించబడి వుంటుంది. అవి 

1.శరీరం (అన్నమయ కోశం)
 
2. జీవశక్తులచేత ఏర్పడిన ప్రాణమయ కోశం, 
 
3. మనస్సు (మనోమయ కోశం), 
 
4. బుద్ధి విజ్ఞాన మయ కోశం 
 
5. అజ్ఞానంచేత ఏర్పడిన ఆనందమయ కోశం.
 
పైన చెప్పిన అయిదు కోశములే మనయందు మూడు శరీరాలుగా వ్యవహరింపబడుచున్నవి.
 
1. స్థూల శరీరం- అనగా అన్నమయ కోశం, 
2. సూక్ష్మశరీరం అనగా ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు. 
3. కారణ శరీరం- అనగా ఆనందమయ కోశం.
 
మానవుడు జీవించి వున్నపుడు ఆత్మ (జీవాత్మ) కారణ శరీరంలోనూ, కారణ శరీరం సూక్ష్మ శరీరంలోనూ, సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోనూ నిబిడమైయున్నందున ఆత్మ మూడు శరీరాలలోను యున్నదని అర్థమవుతోంది.
 
అయితే మరణమనగానేమియని విచారించినపుడు స్థూల శరీరంనుండి సూక్ష్మ, కారణ శరీరాలు వేరుకావడమే. తిరిగి జన్మాంతర ప్రాప్తికి సూక్ష్మశరీరమే కారణమవుతున్నది. అంటే మరణం తరువాత జీవాత్మ, ప్రాణం వద్దకు అనగా సూక్ష్మ శరీరంలోని ప్రాణమయకోశం వద్దకు మరణ సమయంలో ఏ మనోభావంతో వుంటుందో అదే మనోభావంతో వస్తుందని ఉపనిషద్వువాచ. ఆ విధంగా ఆత్మ(జీవాత్మ) తనకు తగినపుడు పునర్జన్మను పొందుతోంది.
 
మరణం శరీరానికే కాని ఆత్మకు కాదు. జననం మరణానికి ప్రారంభమే తప్ప, మరేమి కాదు. పునర్జన్మ లేదంటే- తిరిగి మరణించవలసిన అవరంలేదని అర్థం. ఈ విధంగా ప్రాణంయొక్క రాకపోకలను ‘‘పునరపి జననం పునరపి మరణం- పునరపి జననీ జఠరే శయనం’’ అంతఃప్రకృతిని - సత్యం తెలుసుకొన్న ప్రాజ్ఞుడు పునరావృత్తి రహిత కైవల్యాన్ని పొందుతున్నాడని ఉపనిషద్ద్వచనం.
 
కొందరు పెద్దలు, మానవ శరీరము సప్తకోశ నిర్మితమని చెప్పియున్నారు. ఇట్టి సప్తకోశములను ఒకదానియందు మరియొకటి అయస్కాంత క్షేత్రమందు అయస్కాంతమున్నట్లు అమర్చబడినవని చెప్పియున్నారు. అన్నమయ కోశమునే భౌతిక దేహముగా కొందరు చెప్పియున్నారు. జ్ఞానమయ విజ్ఞానమయ కోశములను విజ్ఞానమయ కోశముగా చెప్పిరి.
 
ఏ విధముగా చెప్పినను ‘నేను’’అను జీవప్రజ్ఞ, ఈ కోశముల యందు మేల్కొనినప్పుడు ఆయా కోశములకనుగుణముగా ప్రతి స్పందించుచుండును. ఆవేశమునకు ఆనందమునకు లోనైనప్పుడు ఆనందమయ కోశమునందున్న వాడిగాను వ్యక్తమగుచున్నాడు. జీవప్రజ్ఞ ఏ కోశమునందు ప్రధానముగా మేల్కొనియుండునో ఆ కోశమే మిగిలిన కోశములపై ఆధిపత్యము కలిగియుండును.
 
1. అన్నమయ కోశము:- ఇది పైకి కనిపించే స్థూల శరీరమే. గింజను పైపొట్టు కప్పి వుంచినట్లు, గర్భస్త పిండమును మాయ కప్పి ఉంచినట్లు, స్థూల శరీరమైయున్నది.
 
‘‘అన్నాద్‌భవన్తి భూతాని వర్జన్యాదన్న సంభవః
 
యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః’’(3-14)అని భగవద్గీతలో చెప్పినట్లు, అన్నము (ఆహారము)వల్ల ఏర్పడిన మన శరీరము ప్రకాశవంతమైన ఆత్మను కవచం వలె కప్పి వుంచుతుంది. అందువల్ల స్థూల భౌతిక శరీరమే అన్నమయకోశం అనబడుతోంది.
 
2. ప్రాణమయ కోశము:- ప్రాణ అనగా స్థిరముగా నిరంతరము మన శరీరంలో ప్రవహించే జీవశక్తి. దీనిని ఓజస్సు అని కూడ అనుకోవచ్చు. మన శరీరంలోని 72000 నాడుల (వీటిలో 14 ముఖ్యమైనవి
అందులో పింగళ, ఇడ, సుషుమ్న అతి ముఖ్యమైనవి) ద్వారా ఈ ప్రాణశక్తి శరీరమంతా వ్యాపించి ఉంటుంది. పంచవాయువులు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు)గా పంచ ప్రాణములుగా సంచరిస్తూంటుంది. ఇది ప్రాణంతో తయారైంది కాబట్టి దీన్ని ప్రాణమయ కోశమన్నారు. దీనిని ‘‘ఆరా’’లేక ‘‘కీ’’ శక్తిఅని కూడా అంటారు.
 
3. మనోమయ కోశం:- పంచ జ్ఞానేంద్రియములు, మనసు. ఇది ప్రాణమయ కోశమునకు లోపల ఉండి, దుఃఖమోదాది అరిషడ్వర్గములు లేని ఆత్మను, అవి ఉన్నట్టు కప్పి ఉంచును. ఈ కోశము సూక్ష్మమైనది. ఇది భౌతిక శరీరానికి జ్ఞానవంతమైన ఆత్మకు మధ్య ఉంటుంది.
 
4. విజ్ఞానమయ కోశము:- ఇది పంచ జ్ఞానేంద్రియములు మరియు బుద్ధికలిసి ఏర్పడుతుంది. నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అనే (అహం+్భవం) నేను అనే భావన కలిగించి, తెలియరానట్టి, ఆత్మను, తెలియబరిచే దానిగా ఆవరించి ఉంటుంది. అట్టి విజ్ఞానంవల్ల ఏర్పడింది కాబట్టి, విజ్ఞానమయకోశమన్నారు.
 
5. ఆనందమయ కోశము:- ఆత్మ, సుఖ దుఃఖములు, ప్రియాప్రియములు మొదలగు ద్వంద్వాలకతీతముగా ఉంటుంది. అట్టి ఆత్మను అవన్నీకల దానినిగా భ్రమింపచేస్తుంది. అందువల్ల దీన్ని ఆనందమయ కోశమన్నారు.
 
- రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి  

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore