పూలు - పాదుకలు
పూలు - పాదుకలు
కంచి మఠం దగ్గర కామాక్షి అని పూలు అమ్మే ఒకావిడ ఉండేది. ఆమె పరమాచార్య స్వామివారిని అప్పా(నాన్న) అని పిలిచేది. రోజూ స్వామివారికి ఒక బుట్టెడు పూలతో అర్చన చేసేది. అప్పుడు స్వామివారు ఆమెతో, “ఇన్ని పూలను ఎందుకు వాడుతున్నావు? వీటిని నీవు అమ్మితే డబ్బు వస్తుంది కదా!” అని చెప్పేవారు. “డబ్బు అంత గొప్పదా అప్పా? ఈ పూలతో నీకు అర్చన చేస్తే దానికంటే గొప్పదే నాకు లభిస్తుంది” అని బదులిచ్చేది.
పరమాచార్య స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తే, స్వామివారిని ఎవరూ లేపకూడదని శ్రీమఠంలో ఒక నియమం ఉండేది. కాని ఈ నియమానికి కామాక్షి మినహాయింపు. ఆమె ఎంత పొద్దుపోయిన తరువాత అయినా రావచ్చు. ఎందుకంటే, తన వ్యాపారం మొత్తం పూర్తైన తరువాతనే రావాలని మధ్యలో రాకూడదని స్వామివారే ఆజ్ఞాపించారు. అంతటి కరణాసాగరులైన స్వామివారు తనకోసమని ఆమెకు అన్నం పెట్టే వ్యాపారాన్ని వదిలితే ఒప్పుకుంటారా?
ఒకరోజు సాయింత్రం స్వామివారు, తొమ్మిదిగంటల వార్తలను విని తనకు వచ్చి చెప్పే నాగరాజు మాటలను వింటున్నారు. మఠం బాధ్యతలు, నియమాలతో పాటు ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం స్వామివారికి అలవాటు. వార్తలను విశ్లేషించి, స్వామివారు నిద్రకు ఉపక్రమించేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. ఆరోజు జాన అనే ఒక భక్తురాలు వెల్వెట్ తో చేసిన పాదుకలను తీసుకుని స్వామివారి దర్శనానికి వచ్చింది. స్వామివారు రోజంతా వాటిని వేసుకునే ఉన్నారు. రాత్రి దాకా వాటిని వదలలేదు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు స్నానాల గదికి వెళ్ళారు. స్వామివారికి వార్తలు చెప్పే నాగరాజు, “ఈరోజు స్వామివారు పాదుకలను విడువగానే, వాటిని నేను తీసుకుంటా; నా వద్ద స్వామివారి పాదుకలు లేవు” అని తనలో తాను అనుకున్నాడు. స్వామివారు పాదుకలను విడువకుండానే కూర్చున్నారు. అప్పుడే పూలమ్మే కామాక్షి వచ్చి, స్వామివారికి నమస్కరించింది. స్వామివారు వెంటనే పాదుకలను వదిలి, ఆమెకు ఇచ్చి, “ఇవి నీకే. తీసుకెళ్ళు” అని అన్నారు.
నాగరాజు బాధపడుతూ, “ఎప్పుడు నేను ఏమి తలచినా, దైవం మరొకలా తలుస్తుంది” అని వెళ్ళిపోయాడు. పూలమ్మే ఆ పేదరాలికి స్వామివారి అవ్యాజ కరుణ వల్ల కలిగిన భాగ్యం అది. ఎంతోమంది ఆ పాదుకల కోసం ఆమెను ప్రలోభపెట్టాలని చూశారు. వాటికోసం లక్ష రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాని వాటికి ఆమె లొంగలేదు. తన అవసరాలు అన్నీ స్వామివారే చూసుకున్నారు. ఆమె ఇంటిలో పెళ్లిళ్లకు స్వామివారు బళ్ల నిండా సామాను పంపేవారు.
స్వామివారు సిద్ధి పొందిన తరువాత కూడా, ఆమె సాయంత్రాలలో స్వామివారి అధిష్టానానికి పూలతో అర్చన చేసేది. కాని స్వామివారు ఉన్నంత వరకు, ఆమెను ఉత్తి బుట్టతో పంపలేదు; అందులో కొన్ని పళ్ళను ఉంచేవారు. స్వామివారి సిద్ధి తరువాత ఖాళీ బుట్టను చూసి చాలా బాధపడేది. “అప్పా! నువ్వు ఉండిఉంటే, ఖాళీ బుట్టతో నన్ను పంపేవాడివా?” అని ఏడ్చింది. అప్పుడే, తనని విస్మయానికి గురి చేస్తూ, ఎవరో అధిష్టానం నుండి తనవైపు విసిరినట్టుగా ఒక మందార పువ్వు బుట్టలో వచ్చి పడింది.
ఈనాటికి ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. స్వామివారు ‘ప్రత్యక్ష రూపం’తో ఏనాటికి మనల్ని ఆశీర్వదిస్తున్నారు.
తన్ను నమ్మినవారిని ఎన్నటికీ వదిలిపెట్టరు; ఇదే నలుగు వేదాల తీర్పు.
--- శ్రీ గణేశ శర్మ.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।