Online Puja Services

అమ్మవారి గాజులు

3.148.108.144

అమ్మవారి గాజులు

వివిధ క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ కొలువైవున్న ఆయా దైవాల మహిమలను గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది. దైవంపట్ల విశ్వాసం గల వాళ్లు ఆ సంఘటనలు నిజంగానే జరిగి ఉంటాయని భావించి అనుభూతిని పొందుతారు. కొందరేమో తేలికగా కొట్టిపారేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి పోయే వాళ్లు వ్యక్తం చేసే అభిప్రాయాలను స్థానికులు ఎంత మాత్రం పట్టించుకోరు. తమ ఊళ్లో ఆవిర్భవించిన దైవం పట్ల ... ఆ దైవం చూపిన మహిమల పట్ల వాళ్లు పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

'ఏదులాబాద్' క్షేత్రం విషయంలోనూ మనకి ఈ విషయం స్పష్టమవుతూ వుంటుంది. రంగారెడ్డి జిల్లా -ఘట్ కేసర్ మండలంలోని ఈ గ్రామంలో 'శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి' ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి అమ్మవారు, ఈ ప్రాంతానికి చెందిన దేశికాచార్యులు అనే భక్తుడితో కలిసి విల్లిపుత్తూరు నుంచి వచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది. అమ్మవారి ఆదేశం మేరకు ఆయనే ఆలయం నిర్మించాడు.

ఒకసారి ఈ ఆలయ ప్రాంగణంలో 12 సంవత్సరాల లోపు వయసుగల ఎనిమిది మంది ఆడపిల్లలు ఆడుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో మట్టి గాజులు అమ్మే వ్యక్తి అటుగా రావడంతో, అరుగుమీద కూర్చుని పారాయణం చేసుకుంటోన్న దేశికాచార్యుల దగ్గరికి ఆ పిల్లలు పరుగెత్తి తమకి గాజులు వేయించమని అడిగారు. వాళ్ల ముచ్చట తీర్చడం కోసం ఆ గాజుల అబ్బాయిని పిలిచి వాళ్లందరికీ గాజులు తొడిగి తన దగ్గరికి డబ్బుల కోసం రమ్మని చెప్పాడు.

కొంత సేపటికి తిరిగివచ్చిన గాజుల అబ్బాయి, మొత్తం తొమ్మిది మంది పిల్లలకి గాజులు తొడిగినట్టు చెప్పాడు. అక్కడ ఎనిమిది మంది పిల్లలే ఉండటంతో దేశికాచార్యులు ఆలోచనలో పడ్డాడు. పిల్లలను అడగ్గా మొదటి నుంచి తాము ఎనిమిది మందే ఆడుకుంటున్నట్టుగా చెప్పారు. గాజులబ్బాయి మాత్రం తాను నిజమే చెబుతున్నాననీ, ఒకమ్మాయి గాజులు వేయించుకున్న తరువాత గుళ్లోకి వెళ్లడం చూశానని అన్నాడు.

దాంతో గుళ్లోకి వెళ్లి చూసిన దేశికాచార్యులకి అక్కడ ఎవరూ కనిపించలేదు. యథాలాపంగా అమ్మవారి వైపు చూసిన ఆయన, అమ్మవారి మూలమూర్తికి మట్టిగాజులు కొత్తవి వుండటం చూశాడు. అమ్మవారి చేతికి వున్నవి ... గాజులబ్బాయి దగ్గరివి సరిపోల్చి చూశాడు ... అవే గాజులు. అంతే దేశికాచార్యులకి విషయం అర్థమైపోయింది.

విషయం తెలుసుకున్న గాజులబ్బాయి సంతోషంతో పొంగిపోయాడు. సాక్షాత్తు అమ్మవారి చేతికి గాజులు తొడిగే అవకాశం తనకి లభించడమేవిటంటూ ఆ ఆనందాన్ని తట్టుకోలేక పొర్లి పొర్లి ఏడ్చాడట. ఆ క్షణమే ఈ సంగతి ఊరంతా తెలిసిపోయింది. ఆనాటి నుంచి అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఆమెకి ఎంతో ఇష్టమైన మట్టిగాజులను సమర్పించుకోవడం ఆనవాయతీగా వస్తోంది.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore