Online Puja Services

అసలు – వడ్డి

13.58.38.184

అసలు – వడ్డి

మహాస్వామి వారి దర్శనానికి ఆరోజు చాలామంది భక్తులు వరుసలో వేచియున్నారు. కొంత సమయం గడిచిన తరువాత మహాస్వామి వారు తమ తలను తిప్పి భక్తుల మధ్యలో నిలబడియున్న ఒక ఇరవై సంవత్సరముల వయస్సు ఉన్న అబ్బాయి వంక చూసారు. అబ్బాయి వంక కొద్దిగా తీక్షణంగా చూసి, తమ సేవకుడైన రాముని పిలిచారు. రాము తన నోటికి చేతిని అడ్డుగా పెట్టి మహాస్వామి వారి ముందు వచ్చి నిలబడ్డాడు.

”రాము ఈ వరుసలో పదిహేనవ వాడు, కొంచం చిన్నగా ఉండి చామున చాయతో ఉన్న అబ్బాయిని చూసావా? ఆ అబ్బాయికి సరిపోయే ఒక చొక్కా మరియు ఫ్యాంటు బట్టను తీసుకునిరా. కార్యాలయంలో డబ్బు తీసుకుని మన మఠం దగ్గర ఉన్న ముదలియార్ బట్టల దుకాణంలో నుండి తీసుకునిరా” అని ఆజ్ఞాపించారు. రాము ఈ మాటలకు కొద్దిగా ఆశ్చర్యపోయి కంగారు పడ్డాడు. మహాస్వామి వారిని ఎందుకు అని ప్రశ్నించరాదని వాటిని తీసుకురావడానికి వెళ్ళాడు. ”రాము ఇలా రా“ అని మళ్ళా మహాస్వామి వారు పిలిచారు. “వస్త్రాలలో కొత్తగా వచ్చిన రకం పేరు నీకు తెలుసా” అని అడిగారు.

“తెలుసు పెరియావ”

“ఏది దాని పేరేంటో చెప్పు” అని అన్నారు. ”అది టెర్రీ కాటన్ పెరియావ.”

“భేశ్! ఆ రకంలో ఒక మంచి ఖరీదైనది తీసుకుని రా”

పదిహేను నిముషాల తరువాత రాము వాటిని తీసుకుని మహాస్వామి వారి వద్దకు వచ్చాడు. మహాస్వామి వారు రాము తెచ్చిన ఆ బట్టలను చూసి ఆనందపడ్డరు.

”భేశ్ భేశ్ చాలా బావుంది.” అని రాముని అభినందించారు. “రాము ఒక పని చెయ్యి. ఒక వెదురు బుట్ట తీసుకుని దానిని పళ్ళతో నింపి, ఒక పూర్ణ ఫలమును ఈ బట్టలను దానిపైన ఉంచు. మేనేజరు దగ్గరకు వెళ్ళి మహాస్వామి వారికి కావాలి అని అరువేల ఏడువందల (6700) రూపాయలను తీసుకుని వచ్చి, కవరు లో పెట్టి ఆ పళ్ళెములో ఉంచు. ఏమిచేయవలెనో నేను తరువాత చెబుతాను.”

రాముకు చెప్పి మహాస్వామి వారు మళ్ళీ భక్తులను పలకరిస్తున్నరు. రాము మహాస్వామి వారు చెప్పినట్టు డబ్బులు తీసుకుని వచ్చాడు. దాన్ని పళ్ళెంలో పెట్టవలసినదిగా మహాస్వామి వారు సైగ చేసారు.

ఇప్పుడు మహాస్వామి వారి ముందు ఇంతకుముందు చూసిన అబ్బాయి నిలబడ్డాడు. మహాస్వామి వారిని దర్శించుకొని, సాష్టాంగం చేసి నించున్నాడు. మహాస్వామి వారు రాముకేసి చూసారు. రాము పరుగున వచ్చి నిలబడ్డాడు.

”రాము ఆ పళ్ళాన్ని తీసుకో”

రాము అలాగే తీసుకున్నడు. స్వామి వారు మందహాసము చేస్తూ “పళ్ళాన్ని ఆ అబ్బాయికి ఇచ్చి తనకి తన కుటుంబానికి నా ఆశీస్సులు అని చెప్పు” అన్నారు. ఆ అబ్బాయికి ఇవేమి అర్థం కావటంలేదు. అతను మహాస్వామివారిని చూసి, తికమక పడుతూ అటు ఇటు చూసి ఏం చేయాలో తెలియక అలా నిలుచుండిపోయాడు.

మహాస్వామి వారు అతని గందరగోళ పరిస్థితిని అర్థం చేసుకుని, “రాము ఏమి కంగారుపడవధ్ధని చెప్పు. ఇది శ్రీమఠం తరుపున తనకి తన కుటుంబానికి ఇస్తున్న ఆశీస్సులు అని చెప్పు. ఆ కవరులో ఉన్న డబ్బుని జాగ్రత్తగా ఇంటిలో ఇమ్మను” అని అన్నారు.

ఆ అబ్బాయి ఏమి అర్థం కాకపోయినా తల పంకించి, మహాస్వామి వారికి నమస్కరించి, ఆ ఆశ్చర్యకర బహుమతిని తీసుకుని వెళ్ళిపోయాడు.

పదిహేను నిముషములు గడచిన పిదప, భక్తులంతా వెళ్ళిపోయిన తరువాత మహాస్వామి వారు వారి గదిలోకి వెళ్ళి కూర్చుని రాముని పిలిచారు.

”రాము, ఆ అబ్బాయికి అలా బహుమతి ఇచ్చినందుకు ఎందుకు నువ్వు ఏమి అడుగలేదు?”

రాము సంకోచిస్తూ “పెరియావ నేను ఇటువంటి వాటి గురించి మిమ్మల్ని ఎలా ప్రశ్నించగలను. నేను ఇక్కడ మీ పాదసేవ చేస్తూ మీ ఆజ్ఞాను పాటించడమే నా విధి” అని అన్నాడు.

”సరే సంతోషం. నన్ను నువ్వు కారణం అడుగవలసిన పని లేదు. నీకు నేనే చెప్తాను.”

“ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. అప్పుడు మన మఠం ఖర్చులకు తగినంత డబ్బు ఉన్నింది కాదు. అప్పుడు నేను ఉత్తర దేశానికి పరివారంతో సహా యాత్రకు బయలుదేరాను. ఒక శుభముహూర్తంలో బయలుదేరి మఠం ముందుకు వచ్చాము. శ్రీమఠానికి ఎదురుగా ఒక చెట్టియార్ గారి పచారి కొట్టు ఉండేది. మఠానికి కావలసిన సరుకులు ఖాతాలో అక్కడే తీసుకునేవాళ్ళం.

నన్ను మఠం బయట చూడగానే చెట్టియార్ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. ఉత్తరీయాన్ని నడుముకు చుట్టుకుని సాష్టాంగం చేసాడు. నేను యాత్రకు వెళ్తున్నాను అని తెలిసి, నన్ను నమస్కరించడానికి వచ్చాడేమో అని నేను అనుకున్నాను.

“ఏంటి చెట్టియార్లు బావున్నారా? వ్యాపారం ఎలా జరుగుతోంది?” అని అడిగాను.
అతను నమ్రతతో “పర్లేదు పెరియావ. కాని రాబోవు కాలం చాలా గడ్డుగా తోస్తున్నది. మీరు ఉత్తర భారత యాత్రకు వెళ్తున్నరని, ఆరు మాసముల తరువాతే వస్తారని విన్నాను.“

”అవును చెట్టియార్లు నిజమే. ఐదు ఆరు నెలలు తరువాతే మళ్ళీ తిరిగివచ్చేది.” అతను కొద్దిసేపు అలోచించి, కొంచం సంకోచిస్తూ, ఇలా అన్నాడు. “అది కాదు స్వామి. మా దుకాణంలో ఈ మఠానికి ఒక ఖాతా ఉంది. ఈ విషయం మీకు కూడా తెలుసు. నలుగైదు నెలలు సరుకులు ఇచ్చిన వాటికి ఇంకా డబ్బులు రాలేదు. నాకు కూడా నాలుగు నెలలు గా అద్దె కట్టడానికి కూడా చలా ఇబ్బందిగా ఉంది. కేవలం నా సమస్యను మీకు చెపుదామని వచ్చాను. మీరు యాత్రకు వెళ్ళిరండి.” అని చెప్పి నమస్కారం చేసాడు.

అందుకు నేను “చెట్టియార్లు, నేను యాత్ర ముగించుకుని వచ్చిన వెంటనే నీ డబ్బులు ఏర్పాటు చేయమని చెప్తాను.” అని నేను యాత్ర కొనసాగించాను.

”నేను ఆరు నెలల తరువాత యాత్ర ముగించుకుని వచ్చి మఠం ఎదురుగా చూస్తే వారి దుకాణానికి తాళం వేసి ఉంది. విచారిస్తే మూడు నెలల క్రితం చెట్టియార్లు కాలధర్మం చేసారని, వారికి సంబంధించిన వివరాలు ఏమి తెలియవని చెప్పారు. వాళ్లకు ఇవ్వవలసిన బాకి గురించి విచారిస్తే, ఎనిమిది వందలా డెబ్బైఅయిదు రూపాయలా ముప్పవలా అని చెప్పారు. నేను ఈరోజు అసలు వడ్డీతో సహా తీర్చాను. ఏమంటున్నానో నీకు అర్థం అయ్యిందా? నీవు పళ్ళెం ఇచ్చిన ఆ అబ్బాయి ఎవరో కాదు, ఆ చెట్టియార్ల మనుమడు. వాళ్ళ తాతగారికి ఉన్న అప్పు మనవడికి వడ్డీతో సహా తీర్చేసాను. ఇక బెంగ లేదు” అని ముగించారు.

రాము ఇదంతావిని నిచ్చేష్టుడయాడు. మరొక శిష్యుడు అటు రావడంతో రాము మహాస్వామి వారి వద్ద సెలవు తీసుకుని మఠం ప్రవేశద్వారం వద్దకు వెళ్ళాడు.“

ఆక్కడ ఆ అబ్బాయి తనకు ఇచ్చిన వెదురు పళ్ళెం చేతిలో పెట్టుకుని నించున్నాడు. తన్ని చూడగానే రాముకు సంతోషం వేసింది. చాకచక్యంగా ఆ అబ్బాయి నుండి విషయం తెలుసుకున్నాడు.

ఆ అబ్బాయి “అవును నేను మా నాయనమ్మ నాన్నలు చెప్పగా విన్నాను. చలాకాలం క్రితం మాకు ఇక్కడ శ్రీమఠం ఎదురుగా ఒక పచారీ కొట్టు ఉండేదని, మా తాత గారు హఠాత్తుగా చనిపోవడతో అప్పుల వల్ల దుకాణం మూసివేసి, మా బంధువులు ఉన్న క్రిష్ణగిరి లో స్థిరపడ్డారు అని.

ఇప్పుడు మా నాన్నగారికి అక్కడ ఒక పచారి కొట్టు ఉంది. మా స్నేహితులతో కలిసి ఇక్కడకు వచ్చాను. మహాస్వామి వారు ఎందుకు ఇలా చేసారో నాకు అర్థం కావడంలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.”

మహాస్వామి వారి దూరదృష్టికి, కారుణ్యానికి రాము ఆశ్చర్యపోయాడు. తను కన్నది విన్నది స్మరించుకుంటూ మఠంలోనికి నడిచాడు. మహాస్వామి వారు ఒక్కరే కూర్చుని ఉన్నారు. రాముని చూసి నవ్వారు. రాముకి ఆ నవ్వు అర్థంకాలేదు. మహాస్వామి వారు రాముని పిలిచి “నేను చెప్పిన విషయం పైన నీకు నమ్మకం కలగలేదు కదూ! అందుకే నువ్వు మఠం ముందు ఆ అబ్బాయిని అడిగి నిర్ధారించుకున్నావు.” అని గట్టిగా నవ్వారు.

రాము పశ్చాత్తాప పడుతూ మహాస్వామి వారిని క్షమించమని అడిగాడు. మహాస్వామి వారు చిరునవ్వుతో చెయ్యెత్తి రాముని అశీర్వదించారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore