Online Puja Services

భార్య - భర్త

3.143.7.5
భార్య గురించి, భార్యాభర్తల సంబంధం గురించి మహాస్వామి వారు
 
వేదము ప్రతిపాదించిన శాస్త్రకర్మలు చేసితీరవలసిందే. ఇందుకోసం మానవుడు బ్రహ్మచర్యాశ్రమము తరువాత వేరొకరి సహాయం తీసుకొనవలసిందే. ఆ సహాకురాలు నీకు భగవంతుడు ఇచ్చిన బహుమానం. అది ఎప్పటికి నీనుండి విడదీయలేని ఆస్తి. ఆమె ఉపయోగం నీకు కేవలం వండిపెట్టడానికి, నీ ఇంద్రియాలకు తృప్తి నివ్వడానికి మాత్రమే కాదు. ఆమెను “ధర్మ-పత్ని”, “యజ్ఞ-పత్ని” అని శాస్త్రాలు కొనియాడాయి. కేవలం ధర్మాచరణకు ఆమె భర్తతో ఉండాలి. భర్తకు అటువంటి ధర్మానురక్తి కలిగించడం ఆమె కర్తవ్యం. ధర్మపత్నిగా ధర్మాచరణయందు ఆయన పక్కన ఉండాలి. మానవాళి సంక్షేమానికి చేసే యజ్ఞయాగాది క్రతువులందు ఆమె భర్తను అనుగమిస్తూ ఆయనకు సహాయం చెయ్యాలి.

ఆమె తన భర్తకు కేవలం వంట చేసి, అతని ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చినా ఆమె ప్రపంచ క్షేమాన్ని కోరుకున్నట్టే. అది ఎలాగంటే ఆమె కేవలం తన భర్తకు మాత్రమే వంట చెయ్యదు. ఆమె చేసిన వంట వల్ల అతిథులు, అన్నార్తులు, పశుపక్ష్యాదులు కూడా ఆధారపడతాయి. ఇలా ఆమె వల్ల ‘అతిథిసేవ’ ‘వైశ్వేదేవము’ కూడా జరుపబడతాయి. ఆమెకు పుట్టిన పిల్లలు కేవలం తన భర్తకు ఇచ్చిన సుఖానికి ప్రతిఫలములు కాదు. ఆమె వైదిక ధర్మాన్ని పెంపొందించడానికి వారిని కంటుంది. కుమారుల పెంపకం కూడా భవిష్యత్ ధార్మిక ప్రయోజనాలకోసమే. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మము వివాహ వ్యవస్థకి ఇంతటి లక్ష్యం ఆపాదించలేదు.

మన సనాతన ధర్మంలో స్త్రీపురుష సంబంధం కేవలం ప్రాపంచిక విషయ సుఖాలకోసం కాదు. ఆ పవిత్ర సంబంధం వల్ల ఆత్మోన్నతి, మానవ ఉద్ధరణ లభిస్తాయి. వేరే మతాల్లో కూడా దేవుని సాక్షిగానే వివాహాలు జరుగుతాయి కాని మన వివాహ వ్యవస్థ అంత ఉన్నతమైన వ్యవస్థ కాదు వారిది. మన సనాతన ధర్మంలో వివాహం, భర్తను ఉత్తమ స్థితికి తీసుకునివెళ్ళి భార్యకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదించడమే. ఇంతటి మహోన్నత వ్యవస్థ వేరే సంప్రాదాయాలలో లేదు. వేరే దేశాలలో స్త్రీ పురుష సంబంధం కేవలం కుటుంబం లేదా కేవలం సమాజిక ఒప్పందం మాత్రమే. కాని ఇక్కడ వారిది ఆత్మ సంబంధం. కాని ఈ సంబంధం కూడా ప్రాపంచిక విషయాలనుంచి ఆత్మను దూరం చేసి ఆత్మోన్నతి పొందేది అయ్యుండాలి. ఇందులో విడాకులు అన్న పదానికి తావు లేదు. అది తలవడం కూడా పాపమే.

మూడు ముఖ్యమైన సంస్కారములు కలగలిసి వివాహము అనే సంప్రదాయం ఏర్పడింది. మొదటిది వేదాధ్యయనం అవ్వగానే పురుషునికి ఒక తోడు, సహాయకురాలు ఏర్పాటు చెయ్యడం. ఈ తోడు కేవలం ఇంటి అవసరాలు తీర్చడం కోసమే కాకుండా పురుషుని వైదికధర్మాచరణకు తోడ్పాటునివ్వడం. రెండవది మంచి వ్యక్తిత్వం మంచి నడవడిక గల ఉత్తమ సంతానాన్ని కనడం. వారి వల్ల ఆ వంశపు వైదికసంస్కృతి పరిఢవిల్లుతుంది. మంచి వ్యక్తులుగా ఎదిగి సంఘానికి మేలుచేసే సంతానం అవుతారు. మూడవది స్త్రీకి ప్రాపంచిక ఉనికినుండి విముక్తినివ్వడం. ఆత్మోన్నతి పూర్తిగా పొందని భర్తని అతని కర్మానుసారం భార్య నడిపిస్తుంది. అలా చేయడం వలన ఆమె పూర్తిగా భర్తకు అంకితమై అతనికంటే పైస్థాయిని పొందుతుంది. నాలుగవది పైమూడు విషయాలకోసం విచ్చలవిడి ఇంద్రియ సుఖాలను అణిచివేయడం.

కాని ఇప్పుడు మనం పై మూడింటిని మరచిపోయాము. మిగిలినది నాలుగవది ఒక్కటే శారీరక సుఖం లేదా ఇంద్రియ సుఖం. ఎల్లప్పుడూ అసత్యమైన ఈ శరీరమును సుఖింపచేయడం. మీరు నా సలహా పాటించి శాస్త్రము చెప్పిన ఉన్నతమైన ఆదర్శాలకొరకు సశాస్త్రీయ వివాహము చేసుకొన్న ఆత్మోన్నతి తప్పక పొందెదరు. చంద్రమౌళీశ్వరుడు మిమ్ము కాపాడుగాక !!!

బాలస్థావత్క్రీడాసక్తః తరుణస్థావత్తరుణీసక్తః
వృద్ధస్తావచ్చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః ||
 
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
 
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya