Online Puja Services

మడి అంటే అసలు అర్ధమేంటి?

18.189.185.100
మడి 
 
మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం.
అదేమిటో తెలియక అది ఒక ఛాందస ఆచారమని ఆడిపోసుకొనే వారూ మనలో లేకపోలేదు.
కాని అది ఒక ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమేకాని, చాదస్తం ఎంతమాత్రం కాదు.
 
మన ఆచారాలు మనం పాటించాలి,వాటిని వదిలివేయరాదు.మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు.
 
ఆచార హీనం నపునంతి వేదాః అని ఆర్ష వాక్యం.
 
ఆచార హీనున్ని వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం.
 
అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం.ఒకసారి ఇది సమగ్రంగా చదవండి.
 
మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం
 
మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు.
 
కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవ యువత కోసం ఈ వివరణ. అంతే
 
మడి అంటే ఏమిటి ?
 
మడి అంటే శారీరక శౌచము. ( ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు. ) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి. నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము.
 
మడి ఎలా కట్టుకోవాలి ?
 
రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరేసినది ఉత్తమం. ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండెముల మీద ఇంటిలో గానీ లేక ఆరు బయట గానీ ఎవరూ తాకకుండా ఆర వేయవలెను.
 
( ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడుతూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు. )
 
మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడిగుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టుకోనవలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట లేక పూజ చేయవలెను. మడితోనే సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. (ఇది ఉత్తమమైన మడి)
 
శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు.
 
మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టుబట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు. ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను.
 
పట్టుబట్టను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడుకోవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేకపోతే పట్టుగుడ్డలు మడికి పనికిరావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టుబట్ట కంటే శ్రేష్టము. పట్టుబట్టలో కొంత దోషము వున్నది, అదే జీవహింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలుగుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరనిచో (స్వచ్ఛమైన) పట్టువస్త్రము.
 
మగవాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని గానీ, ఆడ వాళ్ళు చీరను పావడా తో గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననేంద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ గోచీ పోసిమాత్రమే పంచ లేక చీర కట్టుకోవలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించింనవి ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికరావు.
 
మడితో పచ్చళ్ళు మడితో వడియాలు మడితో పాలు పెరుగు నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటితరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్దికొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది.
 
ఆసక్తికలిగినవారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శం అవ్వాలి. మనల్ని మనము కాపాడుకోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి దానిలోని ఆనందము స్వచ్ఛత పరిశుభ్రత దైవత్వం అనుభవము లోకి వస్తాయి.
 
నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి పాదాభివందనంచేస్తున్నాను.
 
- వంగల ఆంజనేయ అవధాని 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha