శ్రీ శృంగేరీ శారదా పీఠం
శ్రీ శృంగేరీ శారదా పీఠం
కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూర్ జిల్లాలో తుంగ నది ఒడ్డున శృంగేరి ఉంది.
విభాణ్డక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం. అందువల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.
ఈ ఋష్యశృంగుడు రోమపాదుడు పాలిస్తున్న అంగ రాజ్యములో అడుగు పెట్టి ఆ రాజ్యాన్ని క్షామము నుండి విముక్తి కలిగించి వర్షాలు పడేటట్లు చేస్తాడు. అంతేకాకుండా ఈ ప్రాంతం ఎప్పుడూ వర్షాలతో సుభిక్షంగా ఉంటుందని చెబుతారు. దీంతో ఆ ప్రాంతం మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే కొంత పచ్చదనం ఎక్కువగా ఉంటుంది.
ధర్మ ప్రచారం కోసం ఆదిశంకరాచార్యులు దేశాటన జరుపుతున్న సమయములో, ఆయన తన పరివార శిష్యులతో ఇక్కడకు వస్తాడు. ఆ సమయంలో ప్రసవిస్తున్న ఒక కప్పకు ఒక పాము తన పడగతో నీడ కల్పిస్తుంది. బద్ధ శత్రువులైన పాము, కప్ప మధ్య పరస్పర మైత్రీ భావము చిగురించేలా చేయడానికి స్థలమే కారణమని భావిస్తాడు.
ఇంతటి మహత్తు కలిగిన ఈ ప్రాంతంలో తాను నిర్మించదలిచిన నాలుగు మఠాల్లో మెదటి మఠంను నిర్మిస్తాడు. అదే శృంగేరి శారదా పీఠం.
ఇక ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడు అని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ పూరి , బదరీ, ద్వారకాల లో మరో మూడు మఠాలను స్థాపించారు.
ఇక ఆదిశంకరులు అద్వైతం ప్రచారం చేయడానికి నెలకొల్పిన నాలుగు మఠాలలో శృంగేరి శారద మఠం మెదటిది.
దీనినే దక్షిణామ్నాయ మఠంగా చెబుతారు. హిందూ సనాతన ధర్మాలను ఈ పీఠాలు పరిరక్షిస్తూ ప్రచారం చేస్తుంటాయి.
మరోవైపు దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యములో ఉన్న కృష్ణ యజుర్వేదము ఈ శృంగేరి శారద మఠానికి ప్రధాన వేదం.
ఈ మఠానికి పీఠాధిపతిని స్వయంగా శంకరాచార్యులతో సమానంగా భావిస్తారు. ఆయన సన్యాస్యాశ్రమ నామానికి ముందు శంకరాచార్య అని చేర్చబడుతుంది.
1782 నుంచి 1799 వరకూ శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకులు హైదర్ అలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్లకు శృంగేరీ శంకరాచార్యులపై చాలా గౌరవం ఉండేది. మరాఠీ సైన్యం వచ్చి రాజ్యంపై పడినప్పుడు శృంగేరీ మీద కూడా దాడిచేసి ఊరినీ, పీఠాన్ని కూడా దోచుకున్నారు. స్వామివారికి, వారి శిష్యులకు అన్నవస్త్రాలకే లోటువచ్చింది. టిప్పుసుల్తాన్ ఈ సంగతి తెలుసుకుని వారికి ఆహారపదార్థాలు, బట్టలు, ధనం, మరెవరైనా దోచుకోబోతే అడ్డుకుందుకు సైన్యాన్ని ఇచ్చి పంపారు.
శారదాదేవి జ్ఞానానికి విజ్ఞాన సర్వసానికి తల్లి. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు నెలకొల్పారని చెబుతారు. ఉన్నదని చెబుతారు. మండన మిశ్రుని భార్య అయిన ఉభయ భారతి ఇక్కడ విగ్రహంగా మారిపోయిందని స్థలపురాణం. మెదట ఇక్కడ చందనంతో చేసిన విగ్రహం ఉండేది. ఆ చందన విగ్రహాన్ని 14 వ శతాబ్దములో విద్యారణ్య స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి మరియు బంగార విగ్రహ ప్రతిష్ఠ చేసారని చరిత్ర బట్టి తెలుస్తోంది.
ఆలయ పరిసరాలు 20 వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడింది. అగ్నిప్రమాదము జరగడంతో పాత దేవాలయపు స్థానములో కొత్తదేవాలయము నిర్మించారు. జీర్ణోద్ధారణ జరిగిన ఆ ఆలయ ప్రాంగణం అంతా ద్రవిడ దేవాలయ నిర్మాణ శైలిలో జరిగింది.
శారదా శృంగేరి మఠానికి పదవ పీఠాధిపతైన విద్యాశంకర తీర్థుల స్మారకంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆ తరువాత పీఠాధిపతి భారతి కృష్ణ తీర్థుల ఆధ్వర్యంలో 1357-58 మిగిలిన నిర్మాణం జరిగింది. విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలు, బుక్క రాయలకు గురువు. ఈ ఆలయం నిర్మాణం హొయసల శైలిలో జరిగింది. ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి లింగాకారంగా ఉంటారు.
స్వామికి ఇరుప్రక్కల వినాయకుడు, అమ్మవారు ఉంటారు. ఈ దేవాలయం లోపలి మండపంలోని స్థంబాలపై 12 రాశులు చెక్కి ఉంటాయి. ఆలయ నిర్మాణం, గవాక్షాల ఏర్పాటు (కిటికీ ఏర్పాటు) సూర్య కిరణాలు నెలల ప్రకారం ఆయా రాశుల మీద పడేటట్లు చేయబడింది. ఇంకో విశేషం ఏమంటే మండపంలోని స్తంభాలపై ఉన్న గుండ్రపు రాళ్ళు గోళాకారంగా సింహపు నోటి నుండి బయటకు జారునట్లుగా చెక్కారు. ఇవి సింహం నోటిలో ఉన్నట్లు ఉంటాయి కాని గోళం అంచులు సింహం నోటికి తగిలి తగలనట్లు ఉండి జారిపడతాయి అనిపించేటట్లుగా అత్యద్భుతంగా చెక్కారు
శృంగేరి తుంగ భద్ర నది ఒడ్డున ఉంది. తుంగ నది ఇటు ప్రక్కన విద్యాశంకర దేవాలయం, దాని ప్రక్కన ఆ ఆలయానికి అనుసంధానం ఉన్న చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడి పూజా మూర్తులకు అవసరమైన జలాలన్ని ఇక్కడ నుండే తెస్తారు.
తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉంది. అభినవ విద్యాతీర్థ స్వామి ఆధ్వర్యంలో తుంగభద్ర నదిపై విద్యాశంకర సేతువును నిర్మించారు. తుంగానదిలో అసంఖ్యాకంగా చేపలు నది ఒడ్డుకు వస్తుంటాయి, భక్తులు చేపలకు అటుకులను ఆహారంగా వేస్తారు. తుంగానది ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది, అందువలన ఇక్కడ ఈత కొట్టవద్దని హెచ్చరికలు ఉంటాయి.
శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి.
శ్రీ మదభినవ విద్యాతీర్ధుల మహదనుగ్రహము చేత తుంగా నదికి ఉత్తరముగా వెలసియున్నది.
సూర్యనారాయణ స్వామి సన్నిధి.
ఆదిత్యో పాసకులైన భక్తులను కరుణించే సూర్యనారాయణ స్వామి ఆలయము తుంగా నదికి దక్షిణముగా కొండ కింద వనములో వెలసియున్నది. ధ్యానానికి ఈ స్థానము ఎంతో సముచితముగా ఉంటుంది.
నరసింహ వనము.
నరసింహ వనము తుంగా నది ఉత్తర తీరములో ఉన్నది. ఇరవయ్యో శతాబ్దం పూర్వభాగంలో ఈ ప్రదేశమంతా దట్టమయిన వృక్షాలతో వనములా ఉండేది. అప్పుడు జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవనృసింహభారతీ మహాస్వామివారు తరచూ ఆ వనానికి వెళ్ళి ఒక బండరాయిపై ఆసీనులై ధ్యాననిమగ్నులయ్యేవారు. అప్పటి శ్రీ మఠం ప్రధాన కార్యనిర్వహణాధికారి ఆ ప్రాంతములో ఒక చిన్న కుటీరము నిర్మించి జగద్గురువులు ఉండేందుకు సౌకర్యాన్ని కలిగించారు.
కాలక్రమేణా ఆ ప్రదేశం అభివృద్ధి చెందింది. అప్పటి చిన్న నిర్మాణం విస్తరించి శ్రీసచ్చిదానంద విలాస్ పేరిట జగద్గురువుల ఆశ్రమముగా పరిణామం చెందినది. కాగా నానాటికీ భక్తుల రద్దీ అధికము కావడముతో దాని పక్కనే గురునివాస్ అనే అతి పెద్ద పూజాప్రాంగణము నిర్మించారు.
ఈ భవనము శ్రీ చంద్రమౌళీశ్వరుల పూజా సన్నిధిగా జద్గురువుల నివాస ప్రదేశముగా విరాజిల్లుతోంది. నరసింహవనములో పీఠం యొక్క ముప్పయి మూడు, ముప్పయి నాలుగు, ముప్పయి అయిదవ జగద్గురువార్యుల మహా సమాధి అధిష్ఠానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వేద పాఠశాల కూడా మహా స్వామి వారి ఆధ్వర్యములో నడుపబడుచున్నది.
శ్రీ భారతీ తీర్ధ మహా స్వామి వారి నివాసము.
శ్రీ చంద్రమౌళీశ్వర సన్నిధి (గురు నివాస్ లో) శ్రీ శంకర భగవత్పాదులు, శృంగేరిలో శ్రీ శారదా పీఠాన్ని నెలకొల్పిన తరుణంలో కైలాసవాసియైన పరమేశ్వరుడు. సుందరమైన స్పటికలింగమును ప్రసాదించారు.
ఆది శంకరులు మహిమాన్వితమైన శివలింగాన్ని నిత్యారాధన లింగముగా నియమాన్ని ఏర్పరిచారు. అప్పటి నుండి సుమారు పన్నెండు వందల సంవత్సరాలుగా ఈ అపూర్వ శివలింగానికి రోజూ రెండు పర్యాయములు అభిషేక ఆరాధనలు జరుగు చున్నాయి.
సాయంత్రము వేళలో శ్రీ జగద్గురువులే శ్రీ చంద్రమౌళీశ్వరుల అభిషేక, ఆరాధన పూజలను నిర్వహిస్తారు.
శ్రీ చంద్రమౌళీశ్వర అభిషేకము భక్తజనులకు అపరిమిత నేత్రానందాన్ని కలిగిస్తుంది. గురునివాసంలోని స్వర్ణమంటపములో శ్రీ చంద్రమౌళీశ్వర సన్నిధితోపాటు శ్రీ రత్నగర్బగణపతి,శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, విష్ణువు, మహాశక్తి సమన్వితాలైన సాలగ్రామాలు ఉన్నాయి.
స్వర్ణమంటపమునకు ఇరువైపులా శ్రీ ఆది శంకరులు, శ్రీ శారదాంబ మూర్తులు ఊంటాయి. గురునివాస్ లో పూర్వ జగద్గురువర్యుల పాదుకలు పూజలందుకుంటున్నాయి.
శ్రీ శృంగేరిపీఠమునకు రక్షక దైవాలుగా నాలుగు దిక్కులలో ఉన్న దేవాలయాలు.
శ్రీ కాలభైరవ స్వామి ఆలయము. (తూర్పున)
శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయము. (పశ్చిమాన)
శ్రీ దుర్గాంబ అమ్మవారి ఆలయము. (దక్షిణమున)
శ్రీ కాళికాంబ అమ్మవారి ఆలయము. (ఉత్తరమున)
శ్రీ మలహానికారేశ్వర దేవాలయము.
మఠ ప్రాంగణానికి కొద్ది దూరంలో శృంగేరి పట్టణ నడి బొడ్డున చిన్న కొండపై శ్రీ మలహానికారేశ్వర దేవాలయము వెలసియున్నది. పూర్వం కశ్యప మహర్షి కుమారుడైన విభాండక మహర్షి ఈ కొండపై తపస్సు చేసి జ్యోతి స్వరూపంతో శ్రీ మలహానికారేశ్వర లింగములో ఇక్యమయినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
ప్రారంభములో చెక్కతో నిర్మితమై యుండిన ఈ ఆలయమును విజయనగర రాజులు శిలా నిర్మాణము చేసినట్లు తెలుస్తోంది. పరవసింపచేసే ప్రకృతి మధ్య కొండపై వెలసిన శ్రీ మలహానికారేశ్వరుడు గంభీరుడైన ఉద్భవ శివలింగ రూపములో దర్శనమిస్తాడు.
1985 లో శ్రీ మదభినవ విద్యాతీర్ధ మహాస్వామి వారు ఈ ఆలయమునకు నవరంగ మండపము నిర్మించి విశేష రీతిలో కుంభాభిషేకమును జరిపించారు. ఆలయములో శ్రీ భవానీ, శ్రీ దుర్గ, శ్రీ స్థంభ గణపతి, శ్రీ చండికేశ్వరుల సన్నిధులున్నాయి.
శ్రీ ఋష్యశృంగేశ్వర స్వామి వారి ఆలయము.
ఋష్యశృంగ మహర్షి దేహాన్ని త్యజించి, తపస్సు చేసిన ప్రదేశంలోనే
శివలింగంలో ఐక్యమయ్యాడు. ప్రస్తుతము ఆ శివలింగము ఉన్న ఆలయము శృంగేరికి పది కిలోమీటర్ల దూరంలో "కిగ్గా" అనుగ్రామములో శ్రీ ఋష్యశృంగేశ్వరాలయముగా విరాజిల్లుతోంది.
ఈ ఆలయములోని శివలింగముపై శృంగం ఉండటం విశేషము. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటికీ దేశంలో తీవ్ర అనావృష్టి పీడిస్తున్న ప్రాంతాల ప్రజలు శ్రీ శృంగేరి జగద్గురువుల వారి ఆదేశాల ప్రకారం శ్రీ ఋష్యశృంగేశ్వరునికి పూజలు జరిపిస్తుంటారు. వెంటనే వారి ప్రాంతాలలో సమృద్దిగా వర్షాలు కురుస్తాయి.
వివిధ మార్గాల ద్వారా శృంగేరికి ఇలా చేరుకోవచ్చు. . .
రోడ్డు మార్గము ద్వారా . . .
బస్సులో చేరుకోవాలనుకొనే వారికి, చెన్నై, బెంగుళూరు, మైసూరు, మంగుళూరు, ఉడుపి, షిమోగా(శివ మొగ్గ) నగరాలనుంచి నేరుగా శృంగేరి చేరుకునేటందుకు బస్సు సౌకర్యము ఉంది. అంతే కాకుండా 325 కి.మీ దూరములో బెంగుళూరు బస్టాండు ఉన్నది. ఇచ్చటి నుంచి శృంగేరికి ప్రతిరోజూ కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రాత్రి 9-00 గంటల ప్రాంతములో నిద్రిస్తూ ప్రయాణించే సౌకర్యమున్న రెండు బస్సులను నడుపుచున్నది.
రైలు మార్గము ద్వారా . . .
రైలులో శృంగేరికి చేరుకోవాలనుకొనే వారికి, 80 కి.మీ దూరములో ఉడుపి అను రైల్వే స్టేషన్, 105 కి.మీ దూరములో షిమోగా రైల్వే స్టేషన్, 110 కి.మీ దూరములో మంగుళూరు రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
వాయు మార్గము ద్వారా . . .
విమానంలో శృంగేరికి చేరుకోవాలనుకొనే వారికి, 100 కి.మీ దూరములో మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయము ఉంది. విమానాశ్రయము నుంచి టాక్సీలు అందుబాటులో ఉంటాయి...
- వంగల ఆంజనేయ అవధాని