Online Puja Services

నందీశ్వరుని అసలు కథ తెలుసా?

3.135.192.51

నందీశ్వరా...!!!

శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా? ఆయన చరిత్ర ఒకసారి ఆ నందీశ్వరుని తల్చుకుందాం..

పూర్వం శిలాదుడనే రుషి ఉండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా… పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతానభాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు. ఏళ్లూ ఊళ్లూ గడిచిపోయాయి, ఎండావానా వచ్చిపోయాయి… కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. ఆతని ఒంటినిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేళకు శిలాదుని ఎదుట ప్రత్యక్షం అయ్యాడు పరమశివుడు. `నాకు అయోనిజుడయిన ఒక కుమారుడిని కలుగచేయి` అని కోరుకున్నాడు శిలాదుడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు `తథాస్తు` అంటూ వరాన్ని అనుగ్రహించాడు.. 

శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా, ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి `నంది` అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట! బాలుని జననంలాగానే అతని మేథ కూడా అసాధారణంగా ఉండేది. పసివాడకుండానే సకలవేదాలన్నీ ఔపోసన పట్టేశాడు. ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ `దీర్ఘాయుష్మాన్భవ` అని అశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు.. 

నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాథేయపడిన తరువాత నంది ఆయుష్షు త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భివిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం తొణకలేదు, బెణకలేదు. `శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి, దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు` అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకి మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివయ్యని చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్షు గురించో, ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా `అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ` అని శివుని వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా! అందుకే నందిని వృషభరూపంలో తన వాహనంగా ఉండిపొమ్మంటూ అనుగ్రహించాడు.. 

ఆనాటి నుంచీ శివుని ద్వారాపాలకునిగా ఆయనను కాచుకుని ఉంటూ, ఆయన ప్రమథగణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ, తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామిభక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటాయి. ఉదా॥ క్షీరసాగరమథనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు, దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్నీ ఆరగించేశాడు. మహామహాదేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా, నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు.. 

నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే, ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్యభక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. తమిళనాట ఆయనను అష్టసిద్ధులు కలిగినవానిగా, జ్ఞానిగా, ప్రథమగురువులో ఒకనిగా భావిస్తారు. శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవనగుడి, మైసూర్‌ వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగునాట కూడా లేపాక్షి (అనంతపురం), మహానంది (కర్నూలు) వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది. శివుడు ఉన్నంతకాలమూ, ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఏ లోటూ ఉండదు.

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha