Online Puja Services

ఉగాది ఆచరణ విధానం

3.145.64.245

ఉగాది (యుగాది) ఆచరణ విధానం:

ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం...మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

(1) తైలాభ్యంగనం

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.

(2) నూతన సంవత్సర స్తోత్రం

అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.

(3) ఉగాడి పచ్చడి సేవనం

ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!

అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాడి నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.

(4) పూర్ణ కుంభదానం

ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.

(5) పంచాంగ శ్రవణం

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పం చాంగం. ఉగాది నాడు దేవాల యంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాం తుల సమ క్షంలో కందాయఫలాలు స్థూ లంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.

ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది. ‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.

 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore