నన్ను అనుగ్రహించు
పరమాత్మ ! .....
బ్రాహ్మీముహుర్తములో
నన్ను నిద్రనుండి లేపుము
ఆ పవిత్ర సమయమున
నా అంతరంగము నందు నిన్నే స్మరించు
నిర్మల బుద్ధిని నాకు కలుగజేయుము
పరమేశ్వరా ! ప్రతి నిత్యమూ
భక్తి సంఘాలలో పాల్గొను భాగ్యము కలిగించు
భక్తిజ్ఞాన వైరాగ్యాలను ప్రసాదించుము
పరత్పారా ! పర్వతములట్లు సుఖదుఃఖములు భయ పెట్టినను
చివరి శ్వాస వరకు త్రికరణ శుద్దిగ నీ ప్రార్థనలోనే
శక్తి సామర్థ్యాలు ప్రసాదించుము
సర్వేశ్వరా ! సంసారసుఖములపైన
కామవాంఛలపైన పరిపూర్ణ విరక్తిని కలిగించి
నీవు నా హృదయము నందే ఉన్నావని
సంపూర్ణభావమును కలిగించుము
ఈశ్వరా ! తెలిసికాని తెలియక కాని
ఏ ప్రాణికైనా నా నుండి అపకారము
జరుగకుండు విధంగా ఈ జీవిత రథమును
నడిపించుము ఆత్మస్తుతి పరనిందలనేడి
పాపకూపముల బడకుండ నన్ను కాపాడుము
ఓ ప్రేమైకమూర్తీ ! ప్రేమ కరుణ త్యాగము
నా హృదయం లో నిరంతరము నిండి
యుండు విధంగా దయచూడుము
ధీనబంధూ దేహాభిమానమును తగ్గించుము
విషయ సుఖములు విషములని నిరంతరము
గుర్తుండునట్లు చేయుము
కరుణాసింధూ కీర్తి ప్రతిష్టలపై
ధన ధాన్యముల పైన నాకు కాంక్ష
కలుగని రీతిగా కరుణించుము
సకలాంతర్యామి ఈ నామరూపాలన్నింటి
లోను నీవు నిండియున్నావను నిశ్చయ
నిజబవావములను నిరంతరము నాకు
స్ఫురింపజేయుచుండును
సదానందా సర్వ ప్రాణులయందునూ
సాటిమానవుల యందు ప్రేమనూ
నాలో అభివృద్ధి చేయుము
ఈర్ష్యాసూయలు రాగద్వేషాలలు
నా మనస్సులోకి రానీయకుము
అచ్యుతా ! పలువురు దూషించిననూ
భూషించిననూ భక్తబృందము యొక్క
స్నేహమునుండి నన్ను వేరు చేయకుము
పరమేశ్వరుడా శివ స్వరూపా
సద్గురూ ! జగద్గురూ ! నారాయణా !
వివరంచీ ! పరమశివా ! శ్రీకృష్ఞా !
శ్రీరామా ! ఆంజనేయా ! గణపతీ !
జగజ్జోతీ ! పార్వతీ ! సరస్వతీ ! పద్మావతీ
నేను ఆరాధించే నామరూపాలతో
నన్ను అనుగ్రహించి రక్షింపుము