Online Puja Services

షిరిడీ సాయిబాబా పుట్టింది ఎక్కడ

13.58.60.34

షిరిడీ సాయిబాబా పుట్టింది ఎక్కడ.....


దేవతల పుట్టుక, ఋషుల పుట్టుక, నదీమతల్లుల పుట్టుక, వీరుల పుట్టుక... వీటి గురించి ఆరాలు తీయడం, తర్కించడం సరైనది కాదని పురాణ వచనం. ఎందుకంటే జన జీవనంతో వారు పెనవేసుకుపోయి ఉంటారు. అలాంటి మహనీయుల్లో షిరిడీ సాయిబాబా ఒకరు. తాజాగా ఆయన జన్మస్థలం అంశం వివాదాస్పదమవుతోంది. ఇంతకీ బాబా ఎక్కడ జన్మించారు....

సాయిబాబా పుట్టుపూర్వోత్తరాలు, జన్మించిన చోటు గురించి స్పష్టమైన అవగాహన కలిగించే ఆధారాల్లో ముఖ్యమైనవి: బ్రిటిష్‌ ప్రభుత్వ కాలం నాటి ఒక నివేదిక, సాయిబాబా స్వయంగా చెప్పిన సాక్ష్యం, షిరిడీ సంస్థానం వేసిన ఒక కేసు, బాబా సమకాలీకుల రచనలు, బాబా సన్నిహితుడు దాసగణు చేసిన ప్రసంగం.

డైరెక్టర్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇంటలిజెన్స్‌ నివేదిక

ప్రధానంగా పరిశీలించాల్సిన ఒక డాక్యుమెంట్‌... గణేశ కృష్ణ ఖపర్దే లేదా దాదా సాహెబ్‌ ఖపర్దేపై ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్టు. అది 1911 జనవరి 17 నాటిది. ఖపర్దే పేరుమోసిన క్రిమినల్‌ లాయర్‌. స్వాతంత్య్ర యోధుడు బాలగంగాధర్‌ తిలక్‌పై నాటి ప్రభుత్వం మోపిన కేసును వాదించారు. ఆయన అనేకసార్లు షిరిడీ వచ్చారు. ప్రభుత్వ ఆదేశం మేరకు, ఆయన కదలికలను సునిశితంగా పరిశీలించిన డైరెక్టర్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇంటలిజెన్స్‌ (కలకత్తా) ఒక నివేదికను తయారు చేసి, పంపింది. ఆ నివేదికలో సాయిబాబా ప్రస్తావన ఇలా ఉంది: ‘‘ఆ ఫకీరు (సాయిబాబా) దాదాపు 70 ఏళ్ళ వృద్ధుడు. ఆయన 30-35 ఏళ్ళ కిందట షిరిడీ వచ్చాడు. అక్కడ ఉన్న మసీదును నివాస స్థలంగా ఏర్పరచుకున్నాడు. చాలాకాలం అతణ్ణి సాధారణ ఫకీర్‌గానే పరిగణించారు. కానీ గత 15 ఏళ్ళ నుంచి గొప్ప సాధు పురుషునిగా పేరు సంపాదించాడు. అతణ్ణి ‘సాయిబాబా’ అని పిలుస్తారు. కొందరు అతణ్ణి సాధువుగా భావిస్తారు. మరికొందరు భగవంతుడి అవతారంగా చెబుతారు...’’ ఈ నివేదికలో బాబా పుట్టుక లేదా ఆయన జన్మస్థలం గురించి ప్రస్తావన లేదు.


సివిల్‌ కేసు

షిరిడీ సంస్థాన్‌ స్కీమ్‌ ఏర్పాటు కోసం అహమ్మద్‌నగర్‌ జిల్లా కోర్టులో సివిల్‌ సూట్‌ (135/1921) వేశారు. ఆ రికార్డుల్లో ఎక్కడా బాబా జన్మస్థలం తదితరాల ప్రస్తావన లేదు.


బాబా ఇచ్చిన సాక్ష్యం...

షిరిడీ సాయిబాబా ముఖ్య భక్తులలో దాసగణు మహరాజ్‌ ఒకరు. సాయిబాబా జీవిత కథను ‘శ్రీ సాయి గురుచరిత్ర’ పేరిట ఆయన రాశారు. ఒకసారి దుళియా కోర్టు కమిషనర్‌ ముందు సాయిబాబా ఇచ్చిన సాక్ష్యాన్ని తన రచనల్లో దాసగణు ప్రస్తావిస్తూ బాబా తన తల్లితండ్రుల గురించి గానీ, కులమతాల గురించి గానీ చెప్పలేదని తెలిపారు.


సన్నిహితుల రచనలు

సాయిబాబాను ప్రత్యక్షంగా సేవించుకున్న అన్నాసాహెబ్‌ దాభోల్కర్‌ (హేమాంద్‌పంత్‌) సాయిబాబా అనుమతితో ‘శ్రీ సాయి సచ్చరిత్రము’ అనే గ్రంథం రచించారు. దానిలో కొన్ని భాగాలను స్వయంగా బాబాకు చదివి వినిపించారు కూడా. అందులో ‘‘సాయిబాబా తల్లితండ్రుల గురించి గానీ, జన్మాన్ని గురించి గానీ, జన్మస్థలాన్ని గురించి గానీ ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని కనుక్కోవడానికి ఎన్నోసార్లు ఎందరో ప్రయత్నించారు. బాబాను కూడా పలుసార్లు ప్రశ్నించారు. కానీ వారు ఎలాంటి సమాచారాన్నీ, సమాధానాన్ని పొందలేకపోయారు’’ (4వ అధ్యాయం) అని ఆయన రాశారు. అలాగే హరి సీతారాం దీక్షిత్‌ అలియాస్‌ కాకా సాహెబ్‌ దీక్షిత్‌ ‘దీక్షిత్‌ డైరీ’ షిరిడీలో ఉన్నప్పుడు దాదా సాహెబ్‌ ఖపర్దే రాసిన ‘షిరిడీ’ డైరీ’, సావిత్రీబాయి టెండూల్కర్‌ రాసిన ‘శ్రీ సాయిబాబా అద్భుత లీలలు’, అమీదాస్‌ భవానీ మెహతా రచించిన ‘శ్రీ సాయి కథ’ల్లో బాబా తల్లితండ్రుల గురించీ, పుట్టిన ఊరు గురించీ ప్రస్తావన లేదు. షిరిడీ సాయి గురించి విశేష ప్రచారాన్ని చేసిన బి.వి. నరసింహస్వామి కూడా తన ‘లైఫ్‌ ఆఫ్‌ సాయిబాబా’ అనే పుస్తకం లో ‘‘బాబా పుట్టుక . ఆయన తల్లితండ్రుల వివరాలు ఇప్పటికీ రహస్యంగానే మిగిలాయి’’ అని పేర్కొన్నారు.


దాసగణు ప్రసంగం

హరికథల్లో సాయిబాబా జన్మస్థలం గురించి దాసగణు ఏవేవో చెప్పి ఉండొచ్చు కానీ కోయంబత్తూరులో 1950ల్లో నిర్వహించిన రెండో అఖిలభారత సాయిబాబా భక్తుల మహా సభలో చేసిన ప్రసంగంలో ‘‘సాయిబాబా ఎక్కడ పుట్టారో, ఆయన తల్లితండ్రులు ఎవరో, కుల మతాలు ఏమిటో ఎవరికీ తెలియవు. ఆయన ఎవరితోనూ, ఎన్నడూ ఆ విషయాలు మాట్లాడలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.


అది బాబాకే తెలుసు!

జీవితంలో ఎక్కువకాలం సాయిబాబా షిరిడీలోనే గడిపారు. ఆయన ఎవరితోనూ తన వివరాలు చెప్పలేదు. తన జన్మస్థలం గురించీ, పుట్టుపూర్వోత్తరాల గురించీ, మతం గురించీ రహస్యంగా ఉంచాలని సాయిబాబా అనుకున్నప్పుడు, వాటి గురించి ఊహించడం, కల్పించడం ఆయన అభిమతానికి విరుద్ధం.

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha