Online Puja Services

ఈ పాపాలు చేస్తే నరకానికే...!

18.117.8.41

గరుడ పురాణం ప్రకారం... 
ఈ పాపాలు చేస్తే నరకానికే...!
=============================
ధర్మం, కర్మ, పాపాలకు సంబంధించిన పరిజ్ఞానం అంతటినీ విష్ణుమూర్తి తన వాహనమైన గరుడికి బోధించాడు. అదే గరుడ పురాణం.

ప్రపంచంలో ఉన్న ప్రాచీన మతాల్లో హిందూ మతం ఒకటి. దీన్నే సనాతన ధర్మం అని కూడా అంటారు. దీని ప్రకారం.. బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణుమూర్తి ధర్మాన్ని పరిరక్షిస్తాడు. శివుడు లయకారుడు. ధర్మం, కర్మ, పాపాలకు సంబంధించిన పరిజ్ఞానం అంతటినీ విష్ణుమూర్తి తన వాహనమైన గరుడికి బోధించాడు. అదే గరుడ పురాణం. స్వర్గానికి ఎవరెళ్తారు, నరకానికి ఎవరెళ్తారు అని గరుడ పక్షి విష్ణు మూర్తిని ప్రశ్నించగా.. ఎవరైతే మంచి పనులకు దూరంగా, ఎప్పుడు చెడ్డపనులే చేస్తుంటారో వారు తప్పక నరకానికి వెళ్తారని విష్ణువు చెప్పాడు. ఈ కింది 17 పాపాలు చేస్తే వైతరణి వద్ద కష్టాలు కూడా భరించకుండానే నేరుగా నరకానికెళ్తారని భోధించాడు. ఇవన్నీ కలియుగంలో చాలా సాధారణంగా చేస్తున్న పాపాలు..

1.) బ్రాహ్మణ హత్యకు పాల్పడినవారు, పవిత్రమైన విషయాల్లో మాట ఇచ్చి తప్పినవారు, గర్భంలో ఉన్న పిండాన్ని చంపినవారు నేరుగా నరకానికి వెళ్తారు.

2) స్త్రీ హత్యకు పాల్పడినవారు, అత్యాచారం చేసినవారు.. ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళకు హాని తలపెట్టినవారు లేదా ఆమెను చంపినవారు కూడా నరకానికి వెళ్తారు.

3) నమ్మకద్రోహానికి పాల్పడినవారు, విషమిచ్చి చంపినవారు నరకానికే వెళ్తారు.

4) పుణ్యక్షేత్రాలను తక్కువ చేసి చూసినవారు; మంచి వారికి, తమకు ఉపకారం చేసిన వారికి చెడు తలపెట్టేవారు; పురాణాలు, వేదాలు, మీమాంసలను అవమానించినవారు.

5) నిస్సహాయుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తించేవారు, బలహీనులను శిక్షించేవారు నేరుగా నరకానికి వెళ్తారు.

6) ఆకలిదప్పులతో అలమటిస్తున్నవారికి తిండి, నీరు అందించని వారు, ఇంటికొచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా పంపినవారు..

7) ధార్మిక, నిరాశ్రయుల అవసరాల కోసం పోగు చేసిన ధనాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించినవారు; తమ ప్రయోజనాల కోసం వేరే వ్యక్తుల జీవనోపాధిని దూరం చేసేవారు నరకానికి వెళ్తారు.

8) దేవుడి సేవలో ఉండి కూడా.. మద్యమాంసాల అమ్మకం, కొనుగోలు జరిపేవారు; జీవిత భాగస్వామితో కాకుండా వేరే వ్యక్తులతో సంబంధాలను నెరిపేవారు..

9) తమ స్వార్థం కోసం మూగజీవాలను బలి తీసుకునేవారు.

10) రాజులు, ప్రభువుల భార్యలను కోరుకునేవాడు; తమ కుటుంబానికి చెందిన స్త్రీ పట్ల కోరికను కలిగినవాడు; అమ్మాయిల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వారి పరిజ్ఞానంతో సంబంధం లేకుండా వారిపై దుర్భాషలాడేవాడు. అమాయకులను నిందించేవాడు.

11) తప్పుడు సాక్ష్యం చెప్పేవారు, చెడు పనులతో అమాయకులను ఇబ్బందుల్లోకి నెట్టేవారు, సొమ్ముకు అమ్ముడుబోయి నిజాలను దాచేవారు.

12) ప్రకృతికి హాని తలపెట్టేవారు, చెట్లను నరకడం, పంటలను, అడవులను నాశనం చేయడం, ప్రకృతి సిద్ధమైన వాటిని ధ్వంసం చేసేవారు..

13) వైధవ్యంతో బాధపడుతున్న వారి శీలాన్ని దోచుకోవడం; పురుషుణ్ని వివాహ గీతను దాటమని కోరడం రెండూ కూడా దేవుడి దృష్టిలో సమాన పాపాలే.

14) భార్యా పిల్లలను పట్టించుకోకపోవడం, వారిపై దౌర్జన్యానికి దిగడం; పితృదేవతలను నిర్లక్ష్యం చేయడం కూడా నరకానికి దారి తీస్తాయి.

15) ఎవరైతే దేవుణ్ని పూజించరో; శివుడు, విష్ణువు, సూర్య భగవానుడు, గణేశుడు, దుర్గా పూజలను చేయనివారు..

16) క్రూరమైన బుద్ధితో ఉన్నవారు, ఆశ్రయం ఇచ్చే ముసుగులో మహిళలకు ద్రోహం తలపెట్టేవాడు పాపం చేసినట్టే.

17) పవిత్రమైన అగ్నిలో, నీటిలో, తోటలో, పశువుల పాకలో మలమూత్రాలను విసర్జించేవారికి నరకంలో యమ ధర్మరాజు చేతిలో శిక్షలు తప్పవు.

 
- అభినయ 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha