ధ్యానంలో విజయం
ధ్యానంలో విజయం ఒక్క రోజులో రాదు...!
పరిపూర్ణ సిద్ధి పొందే మార్గం సుదూరమైనది మరియు క్లిష్టమైనది. భగవంతుని పై మనస్సు కేంద్రీకరించాలని మనం ధ్యానం లో కూర్చున్నప్పుడు, మనకు చాలా సార్లు తెలిసేదేమిటంటే, మనస్సు ప్రాపంచిక సంకల్ప వికల్పాలలో భ్రమించిపోతుంది. కాబట్టి ధ్యాన ప్రక్రియ లో ఉన్న మూడు అంచెలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది:
1. బుద్ధి యొక్క విచక్షణా శక్తితో మనం
ఈ ప్రపంచము మన లక్ష్యం కాదు అని నిర్ణయించుకోవాలి. కాబట్టి, మనం బలవంతంగా మనస్సుని ప్రాపంచికత్వం నుండి వేరు చెయ్యాలి. దీనికి పరిశ్రమ అవసరం.
2. మరల, బుద్ధి విచక్షణ శక్తి చే భగవంతుడు మాత్రమే మనవాడని అర్థం చేసుకుని మరియు భగవంతుడిని పొందటమే మన లక్ష్యం గా చేసుకోవాలి. కాబట్టి, మనస్సుని తిరిగి తెచ్చి భగవంతుని పైనే కేంద్రీకరించాలి. దీనికి కూడా పరిశ్రమ అవసరం.
3. మనస్సు భగవంతుని నుండి వేరుగా వచ్చేసి మరల ప్రపంచంలో తిరుగుతుంటుంది. దీనికి శ్రమ అవసరం లేదు, దానికదే అనాయాసముగా అయిపోతుంది.
ఎప్పుడైతే ఈ మూడవది దానికదే అయిపోతుందో, సాధకులు తరచుగా నిరాశ పడతారు, “భగవంతుని పై మనస్సు కేంద్రీకరించటానికి నేను చాలా ప్రయత్నించాను కానీ మనస్సు తిరిగి ఈ ప్రపంచంలోకి వెళ్లి పోయింది.” అని. శ్రీ కృష్ణుడు మనలను ఇలా నిరాశ పడవద్దు అంటున్నాడు. మనస్సు చంచలమైనదే, మనం ఎంత ప్రయత్నించినా అది సహజంగానే, తన ఆసక్తి ఉన్న చోటికి వెళ్ళిపోతుంది, అని ముందే అనుకోవాలి, అని అంటున్నాడు. కానీ, అది చంచలమైపోయినప్పుడు, తిరిగి మరోసారి, 1వ, 2వ ఉపాయం అవలంబించాలి – మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీసివేయాలి మరియు తిరిగి భగవంతునిపై కేంద్రీకరించాలి. మరల 3వ పని దానికదే అయిపోతుంది, అని మనకు అనుభవంలోకివస్తుంది. మనం నిరాశ చెందకుండా, మరల 1వ, 2వ ఉపాయాలు ఉపయోగించుకోవాలి.
ఈ సాధనని మరల మరల చేయాలి. అప్పుడు క్రమక్రమంగా మనస్సు భగవంతునిపై అనుసంధానం పెరగటం మొదలవుతుంది. అదే సమయంలో, ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది. ఇది జరిగే క్రమంలో, ధ్యానం చేయటం ఇంకా ఇంకా సులువుగా అవుతుంది. కానీ, ప్రారంభంలో మనస్సుని క్రమశిక్షణ లోనికి తెచ్చే పోరాటానికి సిద్ధపడాలి.
-
అభినయ