Online Puja Services

ఇహము, పరము

3.14.143.149

మనం సాధారణంగా ఇహము, పరము అని అంటూ ఉంటాము. సుఖదుఃఖాలలోను, ధర్మాలలోను కూడా ఈ రెండు మాటలు వర్తిస్తుంటాయి. ఇహమనేదంతా, జీవుడు ఈ శరీరంలో భూలోకంలో ఉన్నపుడు పొందే సుఖాలు, ఐహికాలు. ఈ శరీరాన్ని వదలిన తర్వాత, ఉత్తరలోకాలలో అనుభవించే సుఖానికి, దుఃఖానికి పరమని పేరు. ఇహంకంటె పరం ప్రధానమైనదిగా పెద్దలు భావించారు. అంతేకాక పరలోక సుఖదుఃఖాలనీ ఇహంలో, అంటే ఈలోకంలో ఉండగా మనము జీవించిన విధానాన్నిబట్టి మనము చేసిన కర్మలనుబట్టి నిర్ణయింపభడుతాయనేది ఈ సృష్టిలోని రహస్యం. ఈ సృష్టిలోని రహస్యం, యోగులకు జ్ఞానులకు కరతలామలకం. వారికి అది ప్రత్యక్ష సత్యం. అయితే సామాన్యులకు అది కేవలం ఒక విశ్వాసం మాత్రమే. విశ్వాసం దృఢంగా కలిగి ఉండడమే కాక, ఎప్పుడూ ఆ విషయం జ్ఞాపకంకూడా ఉండడమనేది విజ్ఞానమనబడుతుంది. ఆ జ్ఞప్తియందుంచుకున్న ఈ పరమసత్యాన్ని ఆధారంగా చేసుకొని, తన నడవడిక పూర్వులు చెప్పిన సనాతన ధర్మాన్ని అనుసరించి తీర్చిదిద్దుకోవటమనేది వివేకము అనబడుతుమ్ది. ఈ వివేకము కలిగినవాడే ఉత్తముడనబడతాడు. అయితే ఉత్తమస్థితి ఆతడిని సమాజంలో ఒక ప్రత్యేకవ్యక్తిగా అమ్దరికీ చూపించవచ్చు, చూపించకపొవచ్చు. ఎందువల్లనంటే ఆతడి ధర్మము, వివేకము, ప్రదర్శనకొరకు ఏర్పడినవి కావు. ప్రధానంగా , వాటియొక్క ఫలితమేమంటే ఆతడియొక్క భవిష్యత్తులో ఇహంలోకాని, పరంలోకాని, నిజమైన సుఖాన్ని అనుభవించడం. అంటే ధర్మవివేకాలు స్వప్రయోజనంకొరకే కాని సమాజంకోసం కాదు. అట్లాంటి వస్తువు, సమాజానికి ప్రదర్శించవలసిన ఆవశ్యకత లేదు. అందువల్ల స్వప్రయోజనం కొరకు తాను ఆచరించే ధర్మము, తనకున్న వివేకము, తనయొక్క విజ్ఞానము, ఇవన్నీ సమాజం గుర్తించాలనే కోరికకూడా ఆతనికి ఉండరాదు. దానివల్ల వచ్చే కీర్తికూడా ఈ లోకంలో సమాజంలోనున్న వస్తువే కాని, పరలోకానికి, అంటే తనయొక్క ఊర్ధ్వలోక జీవనానికి సంబంధించిన వస్తువు కాదు. ఈ లోంలోనివన్నీ క్షణికాలే కాబట్టి ఈ కీర్తి, గౌరవాలూ అంతే. వివేకవంతుడు వాటిని ఆశించడు.

అయితే ఒక ఉత్తమమానవుడి చరిత్ర, అంటే ధర్మరాజువంటి ఉత్తమపురుషుని చరిత్ర నేటివరకు మన సమాజంలో ప్రచారంలో ఉంది. ఇది ధర్మరాజు విషయంలో కీర్తి అనబడవచ్చు. కాని ఆతడు ఈ లోకంలో లేడు కదా! ఈ కీర్తివల్ల ఆతడికి ఎట్టి ధర్మరాజుయొక్క చరిత్ర, సమాజంలో జీవించే మనకు ఆదర్శప్రాయం కావాలి. మనకు మార్గదర్శకం కావాలి అన్నమాట. అందుకొరకై, అంటే మన ప్రయోజనం కోసం, వ్యాసమహర్షివంటివారు ధర్మరాజువంటి వారి చరిత్రలు గ్రంథస్థం చేశారు. అంటె మన ప్రయోజనం కోసమే ఈ గ్రంథాలు శ్రద్ధతో మనం చదవాలి. ఇట్టి మహనీయుల స్మరణ భారతంలో ’మహనీయ జపము’ అనే పేరుతో వ్యవహరించబడింది. యుధిష్ఠిరునికి భీష్ముడు దీని స్వరూపం ఇలా వివరించాదు. ప్రతిరోజు మహనీయుల స్మరణ ఇలాగ చేయాలన్నాడు. ’ముందుగా త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, తరువాత వినాయకుడు, కుమారస్వామి, వాయువు, సూర్యచంద్రులు, ఇంద్ర, వరుణ, యమ, కుబేర, కామధేనువు, సప్తసముద్రులు, గంగాది మహానదులు, వసురుద్రాది దేవతలు, పితృదేవతలు, వాలఖిల్యులు (వీరు అంగుష్ఠ ప్రమాణము కలిగి వేలాది సంఖ్యలో నిరంతరము తపస్సులో ఉండే మునులని పురాణం చెబుతుంది), నారదాది మహర్షులు, రంభమేనకాది దేవతాంగనలు, అహోరాత్రములు, తారకలు, మాస, ఋతు, సంవత్సరములు, గరుత్మంతుడు, వాసుకి మొదలైన మహానాగములు, కాశీ కురుక్షేత్రాది పుణ్యప్రదేశాలు, నైమిశాద్యరణ్యాలు, మేరు కైలాస హిమాచలాది పర్వతాలు, భూమి, దిశలు, ఆకాశము, పుణ్యవృక్షములు, మాంధాత మొదలైన షట్చక్రవర్తులు, ఇత్యాదులను ప్రతిదినము స్మరించడం చేత ఆయురారోగ్యాది సంపదలు మనుష్యునికి లభించడమే కాక దారిద్ర్యము, వ్యాధి, శోకము నశిస్తాయని భీష్ముడు ఉపదేశించాడు.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore