Online Puja Services

యంత్రమంటే ఏమిటి

18.191.200.223
శ్రీ చక్రం మానవదేహం: యంత్రమంటే ఏమిటి?
ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.
యంత్రమంటే ఏమిటి:- యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క (శక్తి) స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.
అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే 'ఇచ్ఛ' (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.
ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే.
నేటి శాస్త్రజ్ఞులు కూడా, ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే.
విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే 'ప్రకృతి' అని, 'పరాశక్తి' అని, 'అవ్యక్తం', 'శుద్ధమాయ' అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి, వారికి అందిస్తోంది.
శ్రీ చక్ర ఆవిర్భావం:- ఉండేది బ్రహ్మమొక్కటే. ఈ బ్రహ్మం సత్‌, చిత్‌, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికి, చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం.
కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను 'విమర్శ' (ఆలోచన) అన్నారు. తాంత్రికులు కాంతిని పరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికవల్ల నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు.
దీనినే "పరాబిందువు" అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.
శ్రీ చక్రం - పరాశక్తి వేర్వేరు కాదు
అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి.
1) శివశక్తులొకటిగా నున్న 'బిందువు', 2) అచేతనంగా ఉన్న 'శివుడు', 3) 'చేతనా స్వరూపమైన శక్తి'.
ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది.
మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తి మాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థము లకు సమన్వయం కలుగుచున్నది.
పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు. శ్రీ దేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.
శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది, పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore